Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జాతీయ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా పి.కె.శ్రీమతి, మరియం ధావలే, కోశాధికారిగా ఎస్.పుణ్యవతి.
- కేరళలో ముగిసిన ఐద్వా జాతీయ మహాసభలు
- ఐక్యంగా పోరాడదాం.. మతోన్మాదులను తరిమేద్దాం.. : వక్తలు
ఎం.సి.జోసఫీన్ నగర్ నుంచి సలీమా
ఐక్యంగా ఉద్యమిద్దాం- మతోన్మాదులను తరిమికొడదాం అంటూ నాయకులు మహాసభకు పిలుపునిచ్చారు. గత నాలుగు రోజుల నుంచి వామపక్ష ఉద్యమ కోట కేరళ రాష్ట్రం, తిరువనంతపురంలో జరుగుతున్న ఐద్వా 13వ జాతీయ మహాసభలు విజయవంతంగా ముగిశాయి. 104 మంది సభ్యులతో నూతన జాతీయ కమిటీ ఎన్నికైంది.
మరింత ధైర్యంగా పని చేయాలి...
గత మూడు మహాసభల నుంచి తొమ్మిదేండ్లుగా సుధీర్ఘ కాలంపాటు ఐద్వాకు సేవలందించిన ఆ సంఘం సీనియర్ నాయకురాలు మాలినీభట్టాచార్య ఈ మహాసభల్లో అధ్యక్ష బాధ్యతలనుంచి రిలీవ్ అయ్యి ఉపాధ్యక్షులుగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అధ్యక్షురాలిగా మాత్రమే రిలీవ్ అయ్యాననీ, బతికినంత కాలం ఐద్వాకు సేవలందిస్తానని అన్నారు.
ఐద్వా, కమిటీలోని తోటి కార్యకర్తల నుంచి ఎంతో నేర్చుకున్నానని దాన్ని జీవితాంతం ఆచరిస్తా అని అన్నారు. నూతన కమిటీ ముందు ఎన్నో సవాళ్ళు ఉన్నాయని, దేశం అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో వుందన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో కమిటీ మరింత ధైర్యంతో, ఉత్సాహంతో పని చేయాల్సిన అవసరం వున్నదంటూ నూతన కమిటీకి అభినందనలు తెలియజేశారు.
ఓపికతో సేవలందించారు..
ప్రధాన కార్యదర్శి మరియం ధావలే మాట్లాడుతూ మాలినీభట్టాచార్య ఎంతో ఓపికతో సేవలందించారని తెలిపారు. ఐద్వా జాతీయ ఆఫీస్ బేరర్లను సమన్వయం చేసుకుంటూ.., కమిటీని నడిపారన్నారు. పొరపాట్లు చేస్తే సరిదిద్దారనీ, మంచి చేసినపుడు ప్రోత్సహించారని ఆమె ఎప్పటికీ ఐద్వాతోనే వుంటారని తెలిపారు.
సమానత్వానికై ఐక్యంగా పోరాడదాం
నూతన జాతీయ అధ్యక్షురాలిగా ఎన్నికైనా కేరళ రాష్ట్ర మాజీ మహిళా,శిశుసంక్షేమ శాఖ మంత్రి పి.కె.శ్రీమతి మాట్లాడుతూ టీం వర్క్ మన సంఘాన్ని ఇప్పటి వరకు ముందుకు నడిపిందనీ దీన్నే కొనసాగిస్తూ ఐద్వాను మరింత అభివృద్ధి చేద్దామన్నారు. ప్రస్తుతం దేశంలో ప్రజారాజ్యం, రాజ్యాంగం ప్రమాదంలో పడ్డాయనీ వాటిని కాపాడుకోవడం మన బాధ్యత అని నూతన కమిటీకి పిలుపు ఇచ్చారు. అనంతరం కేరళ రాష్ట్ర అధ్యక్షురాలు సుహాన మహాసభ విజయవంతం చేసేందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. నాలుగు రోజుల పాటు ప్రతినిధులకు అద్భుతమైన సేవలు అందించిన వాలింటీర్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
నూతన కమిటీ
ఐద్వా 13వ జాతీయ మహాసభల 104 మందితో నూతన జాతీయ కమిటీని, 34 మందితో కార్యదర్శి వర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నది. తెలంగాణ నుంచి కార్యదర్శి వర్గంలోకి మల్లు లక్ష్మీ, కమిటీ సభ్యులుగా అరుణజ్యోతి, ఎం.భారతి, పి.ప్రభావతి, అఖిల భారత కేంద్రం నుంచి ఆశాలత ఎన్నిక కాగా ఆంధ్రప్రదేశ్ నుంచి కార్యదర్శి వర్గంలోకి డి.రమాదేవి, కమిటీ సభ్యులుగా బి.ప్రభావతి, వి.సావిత్రి, ఎన్.అలివేలు ఎన్నికయ్యారు.