Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తమిళనాడులో ముదురుతున్న వివాదం
- రాష్ట్ర ప్రభుత్వ చిహ్నం తొలగించి.. పొంగల్ ఇన్విటేషన్ పంపిన గవర్నర్
న్యూఢిల్లీ : తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్.రవి, ఎం.కె.స్టాలిన్ ప్రభుత్వానికి మధ్య వివాదం అంతకంతకూ ముదురుతోంది. సోమవారం అసెంబ్లీలో చోటుచేసుకున్న రసాభాసకు కారణమైన గవర్నర్ తీరును విమర్శిస్తూ మంగళవారం పలు చోట్ల 'హ్యాష్‌ట్యాగ్ గెటౌట్ రవి' పోస్టర్లు వెలిశాయి. ట్విట్టర్లో పెద్ద సంఖ్యలో ట్వీట్లు వెలువడ్డాయి. దీనికి పోటీగా బీజేపీ మద్దతుదారులు గవర్నర్‌కు అనుకూలంగా సోషల్‌మీడియాలో పోస్టులు పెట్టారు. పలు చోట్ల నిరసనలు తెలియజేశారు. గవర్నర్, స్టాలిన్ సర్కార్ మధ్య వివాదం ముదురుతున్న క్రమంలో మంగళవారం గవర్నర్ పంపిన సంక్రాంతి వేడుకల ఆహ్వానం సైతం డీఎంకే క్యాడర్ ఆగ్రహాన్ని రెట్టింపు చేసింది. ఈ ఇన్విటేషన్లో రాష్ట్ర ప్రభుత్వ చిహ్నం లేకపోవడం, భారత ప్రభుత్వ చిహ్నం మాత్రమే ఉండటం వీరి ఆగ్రహానికి కారణమైంది. సోమవారం రాష్ట్ర అసెంబ్లీలో ప్రసంగపాఠం చదివే సమయంలో తమిళనాడు అనే పదంతోపాటు, ద్రవిడ నేతల పేర్లున్న పేరాలను గవర్నర్ చదవకుండా దాటవేయడం, ఇందుకు ప్రతిగా గవర్నర్ రవి ప్రసంగాన్ని రికార్డుల్లో చేర్చవద్దని తమిళనాడు అసెంబ్లీ తీర్మానించటం, గవర్నర్ వాకౌట్ చేయడం వంటి పరిణామాల నేపథ్యంలో చెన్నైలోని వల్సువర్ కొట్టం, అన్నాశాలై ప్రాంతాల్లో ''గెటైట్ రవి'' పోస్టర్లు వెలిశాయి. ఇందుకు సంబంధించిన హ్యాష్‌ట్యాగ్ మంగళవారం ట్విట్టర్లో ట్రెండింగ్ అయ్యింది. ఇదిలా ఉండగా గవర్నర్ చర్యలను వ్యతిరేకిస్తూ తందై పెరియార్ ద్రవిడ కళగం కార్యకర్తలు కోయంబత్తూరులో నిరసనలకు దిగారు. గవర్నర్ దిష్టిబొమ్మలను తగలబెట్టేందుకు ప్రయత్నించారు. గవర్నర్ వ్యతిరేక నిరసనలకు ప్రతిగా స్థానిక బీజేపీ కార్యకర్తలు ప్రదర్శనలకు దిగారు. దీంతో పలుచోట్ల కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అసెంబ్లీలో జరిగిన పరిణామాలపై స్టాలిన్ కుమారుడు, రాష్ట్ర మంత్రి ఉదయనిధి మాట్లాడుతూ, గవర్నర్ తీరు, దీనిపై అసెంబ్లీ తీర్మానం చేయడం రాష్ట్ర అసెంబ్లీ చరిత్రలోనే అసాధారణ ఘట్టమని అన్నారు. హక్కులకు భంగం కలిగినప్పుడు ఆందోళన వ్యక్తం చేసిన తొలి ముఖ్యమంత్రి స్టాలిన్ అని చెప్పారు. కాగా, అధికార డీఎంకే ఎమ్మెల్యేలపై తమిళనాడు బీజేపీ సీనియర్ నేత ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.