Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 2023-24కు గాను కేంద్రం యోచన
న్యూఢిల్లీ : వచ్చే ఏప్రిల్ నుంచి ప్రారంభం కానున్న ఆర్థిక సంవత్సరం 2023-24లో ప్రభుత్వ రంగ సంస్థల్లోని రూ.50,000 నుంచి రూ.60,000 కోట్ల విలువ చేసే వాటాలను ప్రయివేటుకు విక్రయించాలని కేంద్రం యోచిస్తోందని సమాచారం. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని డిజిన్వెస్ట్‌మెంట్ అంశంలో దూకుడుగా వ్యవహారించకూడదని భావిస్తోన్నట్టు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో వచ్చే ఆర్థిక సంవవత్సరంలో చమురు, బ్యాంకింగ్ రంగాల్లోని పీఎస్‌యూల వాటాల ఉపసంహరణ విషయంలో అచీతూచి వ్యవహారించనుందని ఫైనాన్సీయల్ ఎక్స్‌ప్రెస్ ఓ కథనంలో పేర్కొంది. ''ఇప్పటికే క్యాబినెట్ ఆమోదించిన పీఎస్‌యూల్లో డిజిన్వెస్ట్‌మెంట్‌ను వచ్చే ఏడాది కొనసాగించనున్నాము. వాటాల విక్రయ జాబితాలో ఐడీబీఐ బ్యాంక్, కాన్కోర్, బీఈఎంఎల్, షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఎన్ఎండీసీ స్టీల్, హెచ్ఎల్ఎల్ లైఫ్ కేర్, పీడీఐఎల్ తదితర ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి.'' అని డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ (దీపమ్) సెక్రటరీ తూహిన్ కాంత పాండే తెలిపారు.
రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులను, ఒక సాధారణ బీమా కంపెనీని ప్రయివేటీకరించనున్నామని క్రితం బడ్జెట్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన విషయం తెలిసిందే. వీటి డిజిన్వెస్ట్మెంట్లో కొంచెం పురోగతి సాధించామని పాండే తెలిపారు. ఇటీవలి శీతాకాల సమావేశాల్లో ప్రభుత్వం ఎలాంటి ప్రయివేటీకరణ బిల్లును కేంద్రం ప్రవేశపెట్టలేదన్నారు. ఎల్ఐసీ, కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంలోని ఐడీబీఐ బ్యాంక్ ప్రయివేటీకరణ ప్రక్రియ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ బ్యాంక్‌ను కొనుగోలు చేయడానికి విదేశీ పెట్టుబడిదారులు ఆసక్తి చూపుతున్నారని తూహిన్ కాంత తెలిపారు. ఐడిబిఐ బ్యాంక్‌లోని మెజారిటీ 60.72 శాతం వాటాలను దేశ, విదేశీ కార్పొరేట్లకు విక్రయించాలని కేంద్రం నిర్ణయించింది. ప్రస్తుతం 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.65వేల కోట్ల విలువ చేసే పిఎస్‌యుల వాటాలను ప్రయివేటు శక్తులకు విక్రయించాలని మోడీ సర్కార్ గడిచిన బడ్జెట్లో లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే.