Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిందితులపై అభియోగాలు నమోదు
ముంబయి : సీపీఐ నేత గోవింద్ పన్సారే హత్య కేసులో ప్రమేయం ఉన్న 10 మంది నిందితులపై బుధవారం మహారాష్ట్ర కొల్హాపూర్‌లోని ప్రత్యేక కోర్టు అభియోగాలు మోపింది. పన్సారే హత్య జరిగి ఎనిమిదేండ్ల అనంతరం ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. నిందితులు సమీర్ గైక్వాడ్, వీరేంద్ర సింగ్ త్వాడే, అమోల్ కాలే, వాసుదేవ్ సూర్యవంశి, భరత్ కురానె, అమిత్ దేగ్వేకర్, శరద్ కలాస్కర్, సచిన్ అందూరే, అమిత్ బడ్డీ, గణేష్ మిస్కిన్లపై ఉగ్రవాద నిరోధక బందం ప్రత్యేక జడ్జి ఎస్ ఎస్ తంబే అభియోగాలు నమోదుచేశారు. ఐపీసీ సెక్షన్ 302 (హత్య), 307 (హత్యకు యత్నించడం), 120-బీ న్రేరపూరిత కుట్ర)లతో పాటు ఆయుధాలు అక్రమంగా కలిగి ఉండటం, వినియోగించడం వంటి ఆయుధాల చట్ట కిందా అభియోగాలు నమోదు చేసినట్టు ప్రత్యేక ప్రభుత్వ న్యాయవాది శివాజీరావు రాణె తెలిపారు. మరో ఇద్దరు నిందితులు వినరు పవార్, సారంగ్ అకోల్కర్లు పరారీలో ఉన్నారు. ఈ కేసులో సాక్షుల జాబితాను, దర్యాప్తు సంస్థల పత్రాలను సమర్పించాలని కోర్టు ఆదేశించింది. కాగా, నిందితులు నేరాన్ని అంగీకరించారని, విచారణకు సిద్ధంగా ఉన్నారని నిందితుల తరపు న్యాయవాది పేర్కొన్నారు. హేతువాది, సీపీఐ సీనియర్ నేత అయిన పన్సారే 2015, ఫిబ్రవరి 16న కొల్హాపూర్‌లో హత్యకు గురయ్యారు. మార్నింగ్ వాక్ నుంచి తిరిగి వస్తుండగా ఇద్దరు దుండగులు ఆయనపై కాల్పులు జరిపారు. బుల్లెట్ గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నాలుగు రోజుల అనంతరం పన్సారే మరణించారు.