Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సుప్రీంకోర్టుకు తెలిపిన సెషన్స్ జడ్జి
న్యూఢిల్లీ : కేంద్ర మంత్రి అజయ్ కుమార్ మిశ్రా కుమారుడు అశిష్ మిశ్రా నిందితుడిగా ఉన్న లఖింపూర్ ఖేరి హింస కేసు విచారణ ముగియడానికి ఐదేండ్లు పడుతుందని కేసు విచారణను నిర్వహిస్తున్న అదనపు సెషన్స్ జడ్జి సుప్రీంకోర్టుకు తెలియజేశారు. ఈ కేసులో 208 మంది ప్రాసిక్యూషన్ సాక్షలు, 171 డాక్యుమెంట్లు, 27 ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ (ఎఫ్ఎస్ఎల్) నివేదికలు ఉన్నట్టు అత్యున్నత న్యాయస్థానానికి రాసిన లేఖలో సెషన్స్ జడ్జి తెలిపారు. లఖింపూర్ ఖేరిలో 2021 అక్టోబర్‌లో నిరసన తెలుపుతున్న రైతులపై కారునడిపిన కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ ఆశిష్ మిశ్రా వేసిన పిటిషన్‌ను అలహాబాద్ హైకోర్టు ఇటీవల తోసిపుచ్చింది. ఈ తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆయన ఆశ్రయించారు. దీనిపై న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ వి.సుబ్రమణియన్‌తో కూడిన ధర్మాసనం విచారణ జరుపుతోంది. ఇతర కేసులు, కోర్టు ప్రాధాన్యతాంశాలను వాయిదా వేయకుండా సాధారణ క్రమంలో కేసు విచారణ పూర్తి చేయడానికి ఎంత సమయం పడుతుందని గత నెలలో సెషన్స్ కోర్టును సుప్రీంకోర్టు ప్రశ్నించింది. దీనిపై సెషన్స్ కోర్టు ఇచ్చిన వివరణను న్యాయమూర్తులు ప్రస్తావిస్తూ విచారణ పూర్తి కావడానికి కనీసం ఐదేండ్లు పట్టవచ్చని అదనపు సెషన్స్ జడ్జి తెలియజేశారని అన్నారు.