Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేజ్రీవాల్‌కు ఎల్జీ నోటీసు మరో కొత్త ప్రేమ లేఖ : ఆప్
న్యూఢిల్లీ : ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు లెఫ్టినెంట్ గవర్నర్ వికె. సక్సేనా మరో నోటీసు పంపారు. ప్రభుత్వ ప్రకటనల ముసుగులో ఆప్ పార్టీ తరపున ప్రకటనలు ఇచ్చారనీ, దీంతో వందలకోట్ల ప్రజాధనాన్ని వృధా చేశారని ఆరోపిస్తూ చర్యలకు ఆదేశించారు. అరవింద్ కేజ్రీవాల్‌కు ఢిల్లీ డైరెక్టరేట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిసిటీ విభాగం రూ.163.62 కోట్ల రికవరీ నోటీసులు జారీ చేసింది. 10 రోజుల్లోగా ఈ నగదును చెల్లించాలని నోటీసులు పంపింది. ఆ ప్రకటనల ఖర్చులు వసూలు చేయాలని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. నగదు చెల్లించకపోతే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆ రికవరీ నోటీసుల్లో పేర్కొన్నారు.డిసెంబర్ 20వ తేదీన 97 కోట్ల రూపాయల్ని ఆప్ నుంచి రికవరీ చేయాలంటూ లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశించారు. రాజకీయ ప్రకటనల కోసం 2017, మార్చి 31 దాకా రూ.99.31 కోట్లు ఖర్చు చేశారనీ, మిగిలిన రూ.64.31 కోట్లను ఖర్చు చేసినదానికి వడ్డీ కింద చెల్లించాలంటూ తాజా నోటీసుల్లో పేర్కొంది. ఈ నోటీసులపై ఉప ముఖ్యమంత్రి మనీశ్ శిసోడియా ఆగ్రహం వ్యక్తం చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్, బీజేపీలు ఎన్నికైన మంత్రులను, ఆప్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకున్నాయని విమర్శించారు. ఎల్జీ సక్సేనా నుంచి మరో కొత్త ప్రేమ లేఖ వచ్చిందని ఆప్ అధికార కార్యదర్శి చురకలంటించారు. ఆప్ జాతీయ పార్టీగా మారడంతో పాటు ఢిల్లీ మునిసిపల్ (ఎంసీడీ) ఎన్నికల్లో అధికారం చేజిక్కించుకోవడంతో బీజేపీకి భయం పట్టుకుందని విమర్శించారు. బీజేపీ ఆదేశాలకనుగుణంగా ఎల్జీ చర్యలు చేపడుతున్నారని ఆరోపించారు. బీజేపీ చర్యలతో ఢిల్లీ ప్రజలు ఆందోళనలు చెందుతున్నారని అన్నారు. ప్రజలు ఎంత ఎక్కువ ఆందోళన చెందితే.. బీజేపీ అంతగా సంతోషిస్తుందని భరద్వాజ్ ధ్వజమెత్తారు.