Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దళితుడిపై పెత్తందారీ కులస్థుల దారుణ చర్య
- మండుతున్న కర్రతో దెబ్బలు.. చిత్ర హింసలు
- స్పృహ కోల్పోయిన బాధితుడు.. అరెస్టు కాని నిందితులు
- ఉత్తరకాశీలో ఘటన
డెహ్రాడూన్ : బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అక్కడి ప్రభుత్వాల ఉదాసీన వైఖరి కారణంగా దళితులపై పెత్తందారీ కులస్థుల దాడులు నిత్యకృత్యమయ్యాయి. దళితులను కనీసం గుడులకూ రానివ్వటం లేదు. కాదని వస్తే భౌతిక దాడులకు దిగుతూ చట్టాన్ని చేతులోకి తీసుకుంటున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకొని బాధితులకు భరోసా కల్పించాల్సిన కాషాయ ప్రభుత్వాలు ఏమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నాయి. ఇలాంటి ఘటనే ఇటీవల ఉత్తరాఖండ్లో చోటు చేసుకున్నది. దళితుడిపై ఐదుగురు పెత్తందారీ కులస్థులు దాడి చేసిన ఘటన ఉత్తర కాశీలో చోటు చేసుకున్నది. బాధితుడిని ఐదుగురు నిందితులు గుడిలో బంధించారు. గుడికి కట్టేసి రాత్రంతా మండుతున్న కర్రతో తీవ్రంగా కొట్టారు.
ఈ దెబ్బలకు తట్టుకోలేకపోయిన బాధితుడు స్పృహ తప్పి పడిపోయాడు. అయితే, నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. నిందితులపై కేసుల నమోదు చేసిన పోలీసులు.. వారి కోసం గాలిస్తున్నట్టు చెప్పారు. పోలీసులు, బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. బానోల్ గ్రామానికి చెందిన బాధితుడు ఆయూష్ (22) ఈనెల 9న రాత్రి ఏడు గంటలకు గ్రామంలోని కౌన్వల్ గుడికి వెళ్లాడు. పూజలు చేసి మొక్కులు సమర్పించుకున్నాడు. అయితే, అప్పటికే గుడిలో ఉన్న కొందరు ఆయూష్పై అకస్మాత్తుగా దాడికి దిగారు. వారు బాధితుడిని గుడిలో కట్టేశారు. గ్రామంలోని ఐదుగురు పెత్తందారీ కులస్థులు ఆయూష్ను రాత్రంతా మండుతున్న కర్రతో తీవ్రంగా కొట్టారు. దీంతో బాధితుడు స్పృహతప్పి పడిపోయాడు. తర్వాత రోజు ఉదయం స్పృహలోకి వచ్చిన ఆయూష్ తాను నగంగా ఉన్నట్టు తెలిపాడు. అనంతరం అక్కడి నుంచి ఎలాగోలా తప్పించుకొని ఇంటికి చేరుకున్నాడు. దాడికి సంబంధించిన గుర్తులు, గాయాలు ఆయుష్ శరీరంపై ఉన్నాయి. అనంతరం మోరీ పోలీసు స్టేషన్కు వెళ్లి బాధితుడు ఫిర్యాదు చేశాడు. బాధితుడి పిర్యాదు అందుకున్న పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద నిందితులపై కేసులు నమోదు చేశారు. నిందితులను అరెస్టు చేయడానికి వారి ఇండ్లు, రహస్య స్థావరాలలో గాలిస్తున్నామని ఉత్తరకాశీ ఎస్పీ అర్పన్ యదువంశి తెలిపారు. నిందితులు అరెస్టు అయిన తర్వాతే ఈ ఘటన వెనుక గల కారణం బయటకు వస్తుందని చెప్పారు.