Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కీలకమైన 20 సర్వేల్లో 12 సర్వేల విడుదల ఆలస్యం
- 2021 జనాభా లెక్కలు,పేదరికం, కుటుంబ వ్యయం.. అన్నింటా కాలయాపన
- విద్య, వైద్యం, నేరాల.. డేటా కీలకం : నిపుణులు
ప్రభుత్వ నిర్ణయాలకు, విధానాల రూపకల్పనకు...ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసే 'డాటా'నే ఆధారం. సర్వేల్లోని సమాచారమే కీలకం. కానీ మోడీ సర్కార్ 'డేటా' అనే మాట వినడానికి ఇష్టపడటం లేదు. 'సామాజిక ఆర్థిక, కుల గణన' సర్వే అంతా పూర్తయ్యింది. విడుదలకు నో చెప్పింది. అలాగే కుటుంబ వినియోగదార్ల వ్యయ నివేదిక-2017-18ను కూడా విడుదల చేయలేదు. జన గణన, సామాజిక, ఆర్థిక, కుల గణన, ఆరోగ్య నిర్వహణ వార్షిక నివేదిక, పేదరికం..మొదలైన నివేదికలేవీ కేంద్రం విడుదల చేయటం లేదు. దేశంలో ప్రజల జీవన స్థితిగతులపై ఒక అంచనాకు రావడానికి దోహదం చేసే 'డేటా'పై మోడీ సర్కార్ ముసుగేసి దాస్తోంది. వారాంతపు, నెలవారీ నివేదికలతో ప్రజల్ని మభ్యపెడుతోంది.
న్యూఢిల్లీ : జన గణన-2021, కుల గణన చేపట్టకుండా కేంద్రం కాలయాపన చేస్తోంది. జాతీయ నేర గణాంకాల నివేదిక విడుదల ఏడాది ఆలస్యమైంది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే కూడా సమయానికి విడుదల కాలేదు. దేశంలో వాస్తవ పరిస్థితులు బయటకు రాకుండా చేయటమే లక్ష్యంగా మోడీ సర్కార్ వెళ్తోందని, అందులో భాగంగానే 'డేటాకు ముసుగు' వేస్తోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. సర్వేలు..అందులోని సమాచారం ప్రభుత్వ విధాన రూపకల్పనకు అత్యంత కీలకం. ఈ నివేదికల్లోని డాటా ఆధారంగానే సంక్షేమ, అభివృద్ధి పథకాలు, వాటికి కేటాయించాల్సిన నిధులపై ప్రభుత్వాలు ఒక అంచనాకు రాగలగుతాయి. అయితే ఈ నివేదికల సమాచారం బయటకు రాకుండా మోడీ సర్కార్ వీలైనన్ని ఎత్తులు వేస్తోంది.
కీలకమైన 12 నివేదికలు
భారత ప్రభుత్వం విడుదల చేసే నివేదికల్లో అత్యంత ముఖ్యమైనవి 20 ఉన్నాయి. ఇందులో జన గణన, సామాజిక, ఆర్థిక, కుల గణన, ఆరోగ్యం, పేదరికం, వ్యవసాయ వేతనాలు, ఉన్నత విద్య..మొదలైన సర్వేల సమాచారం బయటకు రావటం కేంద్రంలోని పాలకులకు ఇష్టం లేదు. కాలయాపన చేస్తూ, ప్రభుత్వ సమాచారాన్ని తారుమారు చేయటమే పనిగా కేంద్రం ముందుకు వెళ్తోందన్న విమర్శలున్నాయి. రాజకీయ ప్రేరేపితమైన సమాచారాన్ని మోడీ సర్కార్ ప్రజలకు అందుబాటులో ఉంచుతోంది. ఉన్నత విద్య, వైద్యం, నేరాలు...నివేదికలు చాలా కీలకం. వీటి ఆధారంగానే ప్రభుత్వ విధానాల రూపకల్పన సాధ్యపడుతుంది. వార్షిక నివేదికలను పక్కకు పెట్టడం మరో ఎత్తుగడ. వారాంతపు, నెలవారీ నివేదికలను రూపొందించే వ్యవస్థలను కేంద్రం తయారుచేసిందని, విస్తారమైన 'డేటా బేస్'ను రూపొందించే వ్యవస్థను కేంద్రం బలహీనపర్చిందని నిపుణులు చెబుతున్నారు.
సర్వే పూర్తయినా..నో
ఆయా శాఖల్లో సర్వేలు పూర్తయి డాటా విడుదలకు సిద్ధంగా ఉన్నా..కేంద్రం అడ్డుకుంటోంది. ప్రజలకు అందుబాటులోకి తేవడానికి మోడీ సర్కార్ ఆమోదం తెలపటం లేదు. సర్వేలో వెలువడ్డ సమాచారం మింగుడుపడక పోవటం, రాజకీయంగా తమకు ప్రతికూలంగా ఉండటం వల్లే సర్వే సమాచారాన్ని బయటపెట్టక పోవడానికి కారణమని నిపుణులు ఆరోపిస్తున్నారు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రతి మూడేండ్లకు ఒకసారి విడుదల కావాలి. కానీ మోడీ హయాంలో చాలా నెలలపాటు విడుదల కాకుండా ఆపారు. పదేండ్ల క్రితం నాటి 2011-12 సర్వేనే పాలకులు వాడుతున్నారు. 2017-18 సర్వే విడుదలకు సిద్ధమైనా కేంద్రం విడుదల చేయటం లేదు. నిజానికి దేశవ్యాప్తంగా సర్వే చేపట్టి..పెద్ద ఎత్తున సమాచారాన్ని సేకరించి, విశ్లేషించే వ్యవస్థ భారత్లో లేదని నిపుణురాలు అవనీ కపూర్ విమర్శించారు.
వీలైనంతమేరకు కాలయాపన..
కేంద్ర ప్రభుత్వ నివేదికల్లో చాలామటుకు ఏడాదికిపైగా ఆలస్యంగా విడుదలవుతున్నాయి. ఉదాహరణకు 'బేసిక్ రోడ్ స్టాటిస్టిక్స్' నివేదిక 2018-19 మాత్రమే అందుబాటులో ఉంది. ''ఓటింగ్, ఆర్థిక శాఖ నిధుల బదిలీ, జనాభా ప్రకారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు..ఇవన్నీ డేటా ఆధారంగా జరుగుతాయి'' అని ముంబయికి చెందిన ప్రొఫెసర్ ఎస్.చంద్రశేఖర్ అన్నారు. ప్రభుత్వ స్కూల్స్, ఆరోగ్య కేంద్రాలు ఎన్ని ఉండాలి? తెలుసుకోవాలంటే జన గణన తప్పనిసరి. కుటుంబ వ్యయం, పేదరికం నివేదికలు ప్రభుత్వ విధానాల రూపకల్పనకు ప్రధాన ఆధారం. వీటికి సంబంధించి దేశవ్యాప్త సర్వే వివరాలు లేకుండానే మోడీ సర్కార్ ముందుకు వెళ్తోంది. అంతేకాదు మిగతా సర్వేల నిర్వహణ కూడా ప్రభావితమవుతుందని నిపుణులు చెప్పారు.
జనాభా లెక్కలు
రాజకీయంగా, ప్రభుత్వ పరంగా అత్యంత కీలకం జనాభా లెక్కలు. ప్రస్తుతం 2011 జనాభా లెక్కల ఆధారంగా కేంద్రం ముందుకు వెళ్తోంది. గ్రామీణ స్థాయిలో జనాభా, అక్షరాస్యత, వలసలు..మొదలైన అనేక విషయాలు పదేండ్ల క్రితం నాటివే ప్రామాణికంగా తీసుకుంటోంది. 2021 జన గణన చేపట్టలేకపోతున్నామని కోవిడ్-19 సంక్షోభాన్ని కేంద్రం సాకుగా చూపుతోంది. కోవిడ్ నియంత్రణలు ఎత్తేసినా..జన గణన ఎప్పుడు ఉంటుందన్నది ఎవ్వరికీ తెలియదు. కేంద్రం ఇప్పటివరకూ స్పష్టత ఇవ్వలేదు.
పేదరికం
ప్రతి 5ఏండ్లకు ఒకమారు ప్లానింగ్ కమిషన్ 'పేదిరికం అంచనాల' నివేదికను విడుదల చేయాలి. 1973-74 నుంచి ప్రతి ఐదు, ఆరేండ్లకొకమారు నివేదిక విడుదలవుతోంది. 2013 తర్వాత రావాల్సిన నివేదికను మోడీ సర్కార్ ఆపేసింది. ఇప్పటివరకూ అధికారికంగా 'పేదరికం'పై ప్రభుత్వ అంచనాలు విడుదల కాలేదు. ''ఊహాజనితమైన ఎన్నికల వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన అధికార పార్టీ నాయకులకు, పాలకులకు 'డేటా సెట్స్' విడుదల కావటం ఇష్టం లేదు.
దాంతో విధాన నిర్ణయాలు సంక్లిష్టంగా మారుతాయి. ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతుంది. దీన్నుంచి బయటపడటానికి డాటాను తారుమారు చేయటం, చేతివాటం ప్రదర్శించటం వంటి పనులకు పాల్పడతాయి'' అని అజీం ప్రేమ్జీ వర్సిటీలో ప్రొఫెసర్ వికాస్ కుమార్ అన్నారు. రాజకీయాల్లో మత ప్రభావం పెరగటమూ సర్వేలు ఆలస్యం కావటం, విడుదల కాకపోవటానికి కారణమని ఆయన అన్నారు. డాటా నిర్వహణ వ్యవస్థనే కుప్పకూల్చారని, కొన్ని చోట్ల బలహీనపర్చారని ఆయన వివరించారు. గణాంకాల నిర్వహణ విభాగానికి నిధులు విడుదలు కేటాయించటం వృథా అని పాలకులు భావిస్తున్నారని అన్నారు.