Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ స్కూళ్లల్లో గాడిన పడని చదువులు..అయోమయంలో విద్యార్థులు
- కోవిడ్ కాలంలో నష్టపోయిన విద్యా సంవత్సరం
- చదవడం.. రాయడం.. నేర్చుకోవడానికి ఇప్పటికీ తంటాలు
కరోనా మహమ్మారి ప్రభావంతో నష్టపోయినవాటిలో విద్యా రంగమూ ఒకటి. వైరస్ కట్టడిలో భాగంగా దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రయివేటు స్కూళ్లన్నీ దాదాపు ఏడాది పాటు మూతపడ్డాయి. దీంతో ఆన్లైన్ విద్య దేశంలో ఆవశ్యమైంది. అయితే, సౌకర్యాలు లేకపోవడంతో ప్రభుత్వ స్కూళ్లలో చదివే పేద విద్యార్థులు విద్యాపరంగా నష్టపోయారని నిపుణులు చెప్పారు. కానీ, స్కూళ్లు తిరిగి ప్రారంభమైన తర్వాత చదవడం, రాయడం వంటి విషయాల్లో వారు ఇప్పటికీ ఇబ్బందులనే ఎదుర్కొంటున్నారని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు చెప్పారు. వీరి విషయంలో ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపాలని విద్యా నిపుణులు సూచించారు.
న్యూఢిల్లీ : కేంద్రంలోని మోడీ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల్లో ఒకటిగా భావింపబడుతున్న లాక్డౌన్ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు శాపంగా మారింది. ప్రయివేటు, కార్పొరేటు స్కూళ్లల్లో చదివే సంపన్న విద్యార్థులు ఆన్లైన్ విద్యకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలను కలిగి ఉండటంతో విద్యా సంవత్సరాన్ని సాఫీగా సాగించారు. ఇంటి వద్దే ఉండి కావాల్సినటువంటి జ్ఞానాన్ని సముపార్జించారు. అయితే, ప్రభుత్వ స్కూళ్లలో చదివే విద్యార్థుల పరిస్థితి మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉన్నది. ఆన్లైన్ విద్యకు కనీస సదుపాయాలు లేకపోవడం, ఒకవేళ ఉన్నా.. అవి అరకొరగానే ఉండటంతో ఈ బడుల్లో చదివే పేద, మధ్య తరగతి విద్యార్థులు విద్యా సంవత్సరాన్ని తీవ్రంగా నష్టపోయారని నిపుణులు చెప్పారు.
కనీసం చదవడం, రాయడమూ రాక.. ఇబ్బందులకు గురయ్యారన్నారు. దాదాపు ఏడాది తర్వాత తిరిగి పాఠశాలలు తెరుచుకున్నాక ఆన్లైన్ క్లాసుల్లో చెప్పిన అంశాలను తిరిగి నేర్చుకోవడం చేశారు. చదవడం, రాయడం విషయాల్లో ఇబ్బందులు ఎదురయ్యాయని ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తెలిపారు. అయితే, ఈ పరిస్థితి విద్యార్థుల చదువుపై ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మరింత శ్రద్ద వహించాల్సిన అవసరాన్ని సూచిస్తున్నదని నిపుణులు తెలిపారు. కొందరు టీచర్లు స్కూళ్లలో అదనపు క్లాసులు తీసుకోగా, తల్లిదండ్రులు కొందరు తమ చిన్నారులను ప్రయివేటు కోచింగ్ క్లాసులకు పంపారు. ప్రభుత్వం కూడా సిలబస్‌ను తగ్గించి విద్యార్థులపై అధిక భారం మోపకుండా చేసింది. తమిళనాడు వంటి రాష్ట్రాలైతే ప్రత్యేక శ్రద్ధ తీసుకొని విద్యార్థుల కోసం కమ్యూనిటీ రెమిడియల్ క్లాసులను నిర్వహిస్తున్నాయి.
నేషనల్ అచీవ్మెంట్ సర్వే 2021 ప్రకారం.. 2017తో పోలిస్తే గణితం, భాషలలో అభ్యాసనలు పడిపోయాయి. ''గ్రామాల్లో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలకు వచ్చే పేద విద్యార్థులకు ఆన్లైన్ విద్యకయ్యే సౌకర్యాలు లేవు. లాక్డౌన్ కాలంలో చాలా కొద్ది మంది మాత్రమే ఆన్లైన్ తరగతులకు హాజరయ్యారు'' అని వారణాసికి చెందిన ఒక ప్రభుత్వ స్కూల్ టీచర్ అన్నారు. దాదాపు 60 శాతం మంది చిన్నారులు ఆన్లైన్ విద్యావకాశాలను పొందలేకపోయారని 2020లో అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ తన అధ్యయనంలో పేర్కొన్న విషయం విదితమే. ఆన్లైన్ క్లాసులకు వాస్తవ తరగతులకు మధ్య తేడా ఉన్నదనీ, ఆన్లైన్ విద్య ఒక విరామం లాగా అనిపించిందని మీరట్‌లోని ఒక ప్రయివేటు పాఠశాలకు చెందిన 8వ తరతగి విద్యార్థి శిఖర్ జుబిన్ రారు అన్నారు. తాను అదనంగా మరింత కష్టపడాల్సి వచ్చిందని తెలిపారు. డిజిటల్ తరగతుల కారణంగా చదవడం, రాయడం మందగించిందని చెప్పారు.
'ఆన్‌లైన్‌తో ఉపయోగం లేదు'
ఆన్లైన్ క్లాసులతో పిల్లలకు ఒరిగిందేమీ లేదని తల్లిదండ్రులు తెలిపారు. స్కూల్‌కు వెళ్తేనే వ్యక్తిత్వ వికాసం జరుగుతుందనీ, ఆన్లైన్ క్లాసులతో శారీరకంగానూ నష్టమేనని రష్మీరారు అనే ఒక మహిళ అన్నారు. ఉపాధ్యాయులు సైతం ప్రత్యక్ష తరగతి బోధనలకే ప్రాధాన్యతనిచ్చారు. కోవిడ్-19 ప్రేరేపిత లాక్డౌన్ అనంతరం స్కూళ్లు తెరుచుకున్నాక.. విద్యార్థులు తాము నేర్చుకున్నది మరిచిపోయారని యూపీలోని ఒక ప్రభుత్వ స్కూల్ టీచర్ దిగ్విజరు సింగ్ చెప్పారు. విషయాన్ని అర్థం చేసుకోవడానికి చాలా సమయాన్ని తీసుకున్నారని తెలిపారు. ఆఫ్‌లైన్ క్లాసుల్లో తాము విద్యార్థులను నేరుగా చూస్తామనీ, వారికి అర్థమైందా లేదా అనేది తెలుసుకోగలుగుతామని జార్ఖండ్‌లోని ఒక ప్రయివేటు స్కూల్ టీచర్ జ్యోతి సింగ్ తెలిపారు. ఒకవేళ విద్యార్థులకు ఏవైనా డౌట్లు ఉంటే తరగతి గదిలో సులభంగా నివృత్తి చేయగలుగుతామన్నారు
అదనపు క్లాసులు
తమ పిల్లలకు పాఠాలు అర్థమవడం కోసం సంపన్న కుటుంబాలకు చెందిన తల్లిదండ్రులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ప్రత్యేకంగా ట్యూటర్లను నియమించి తమ పిల్లలకు విద్యనందిస్తున్నారని ఢిల్లీ కేంద్రంగా పని చేసే థింక్ ట్యాంక్ సెంటర్ ఫర్ బడ్జెట్ గవర్నెన్స్ అండ్ అకౌంటబులిటీకి చెందిన ప్రొతివ కుండు చెప్పారు. అయితే, అందరు విద్యార్థులు ప్రయివేటు ట్యూషన్లను పొందలేకపోవడంతో అసమానతలు విస్తృతమవుతున్నాయని ఆక్స్‌ఫామ్ ఇంటర్నేషనల్‌కు నేతృత్వం వహిస్తున్న అంజెలా తనేజా అన్నారు. ఇటు నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ విద్యార్థులపై భారాన్ని తగ్గించడంలో భాగంగా సిలబస్‌లో కోత విధించింది. ఇది విద్యా సంవత్సరాన్ని కోల్పోకుండా ఇటు విద్యార్థులకు.. అటు ఉపాధ్యాయులకు సులభతరం చేసిందని నిపుణులు తెలిపారు. మోడీ ప్రభుత్వం అనాలోచితంగా, ఏకపక్షంగా లాక్డౌన్ వంటి నిర్ణయాన్ని తీసుకొని అమలు చేసిందనీ, దీని ప్రభావం ముఖ్యంగా పేద విద్యార్థుల పైనే పడిందని నిపుణులు చెప్పారు. సిలబస్‌లో కోత అనేది విద్యార్థులకు తాత్కాలిక ఉపశమనాన్ని కలిగించినా దీర్ఘకాలంలో ఇది నష్టాన్ని తీసుకొస్తుందని హెచ్చరించారు. కోల్పోయిన విద్యను విద్యార్థులకు అందించే విషయంలో కేంద్రం చొరవ చూపాలని తెలిపారు. ఇందుకు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని అదనపు తరగతులు(రెమిడియల్ క్లాసులు) నిర్వహించాలని సూచించారు.