Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఈ విషయాన్ని శుక్రవారం కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 31న ప్రారంభమై ఏప్రిల్ 6 వరకు 66 రోజుల పాటు జరగనున్నాయి. పార్లమెంట్ నూతన భవనంలో తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభోపన్యాసం చేస్తారు. రాష్ట్రపతిగా ఆమె ఎన్నికైన తరువాత మొదటిసారిగా పార్లమెంట్ ఉభయ సభలను సమావేశపర్చనున్నారు. ఆ తరువాత పార్లమెంట్లో ఆర్థిక సర్వేను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్నది. మరుసటి రోజు ఫిబ్రవరి 1న వార్షిక బడ్జెట్ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెడతారు.
రెండు విడతలుగా..
ఈ బడ్జెట్ సమావేశాలు రెండు విడతలుగా జరగనున్నాయి. తొలి విడతలో జనవరి 31 నుంచి ఫిబ్రవరి 13 వరకు, రెండో విడతలో మార్చి 13 నుంచి ఏప్రిల్ 6 వరకు జరగనున్నాయి. ఫిబ్రవరి 14 నుంచి మార్చి 12 వరకు విరామం ఉంటుంది. తొలి విడతలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ, వార్షిక బడ్జెట్ పై చర్చ జరుగుతుంది. రెండో విడతలో ఆయా శాఖలకు సంబంధిత పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలు గ్రాంట్స్ కోసం డిమాండ్లను పరిశీలించడం, మంత్రిత్వ శాఖలు, డిపార్ట్మెంట్లకు సంబంధించిన నివేదికలను రూపొందించడం, పలు బిల్లులకు ఆమోదించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం షెడ్యూల్ చేయనున్నది.