Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తద్వారా విద్యారంగంలో అంతర్జాతీయ నాణ్యత...
- 'బేటీ పఢావో - బేటీ బచావో' అందమైన నినాదాలు మాత్రమే...
- విద్యార్థులు రాజకీయాల్లోకి వస్తేనే సమాజ మార్పు
- నవతెలంగాణ ఇంటర్వ్యూలో కేరళ మాజీ మంత్రి కె.కె.శైలజ
మన దేశ విద్యారంగం ఘోరంగా ఉంది. స్వాతంత్య్రం వచ్చి ఇన్నేండ్లు గడుస్తున్నా ఇంకా గ్రామీణ ప్రజలు, పట్టణ పేదలు చదువుకు దూరంగానే ఉన్నారు. నూతన విద్యా విధానం పేరుతో మతోన్మాదులు దీన్ని మరింత ప్రమాదంలోకి నెట్టేసేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనికి భిన్నంగా కేరళ రాష్ట్రం స్మార్ట్ తరగతులను అక్కడి విద్యార్థులకు పరిచయం చేయబోతున్నది. విద్యలో అంతర్జాతీయ నాణ్యతను తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నది. ఇలాంటి ఎన్నో విషయాలను కేరళ మాజీ మంత్రి, ప్రస్తుత ప్రభుత్వ విప్ కె.కె శైలజ టీచర్ నవతెలంగాణతో పంచుకున్నారు. రంగారెడ్డి జిల్లాలోని మన్నెగూడలో గత రెండు రోజుల పాటు జరిగిన టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర మహాసభల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ నగరానికి విచ్చేసిన ఆమె నవతెలంగాణ ప్రతినిధి ఎస్.కె.సలీమాకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే...
గతంలో మీకు ఉపాధ్యాయురాలిగా పనిచేసిన అనుభవం ఉంది. అలాంటి మీరు ప్రస్తుత దేశ విద్యారంగ పరిస్థితులను ఎలా విశ్లేషిస్తారు?
స్వాతంత్య్రం తర్వాత మన దేశం ప్రజాస్వామ్య, లౌకిక దేశంగా రూపొందించబడింది. రాజ్యాంగం ప్రజలందరికీ కొన్ని ప్రత్యేక హక్కులు ఇచ్చింది. విద్య మన దేశాభివృద్ధికి ఎంతో కీలకమని గుర్తించింది. అందుకే విద్యా వ్యవస్థలో కొన్ని మార్పులు తీసుకొచ్చింది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే అదంతా పెట్టుబడిదారులకు అనుకూలమైన విద్య విధానంగానే రూపొందించారు. జీడీపీలో కేవలం 6శాతం మాత్రమే విద్యకు కేటాయిస్తున్నారు. దేశ జనాభాకు అవసరమైనంత ఖర్చు చేయలేదు. ఫలితంగా ఇప్పటికీ మన దేశంలో విద్య చాలా మందికి అందుబాటులో లేదు. ముఖ్యంగా గ్రామీణ భారతం చదువుకు అత్యంత దూరంగా వుంది. అదే కేరళలో చూస్తే వంద శాతం అక్షరాస్యత సాధించాం. ఇది స్వాతంత్య్రం వచ్చిన తర్వాత అక్కడ పరిపాలించిన వామపక్ష ప్రభుత్వాల విధానాల ఫలితంగానే సాధ్యమయింది. ప్రస్తుతం కేరళలో విద్యారంగంలో మరిన్ని మార్పులు తీసుకొస్తున్నాం. అయితే దేశంలో పరిస్థితి దారుణంగా ఉంది. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మత ప్రభావం విద్యలో బాగా పెరిగిపోయింది. కొఠారీ కమిషన్ సూచనలను పక్కకు పెట్టేశారు. ప్రజాస్వామ్య, లౌకిక విలువలను తుంగలో తొక్కేశారు. కరిక్యులంలో విపరీతమైన మార్పులు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. కర్నాటకలో ఈపాటికే అమలు చేయడం మొదలుపెట్టారు. చరిత్రను వక్రీకరిస్తున్నారు. ముస్లింలపై ద్వేషం పెంచేందుకు వారు చేసిన మంచిని తెలియజేసే పాఠ్యాంశాలను సిలబస్ నుంచి తొలగిస్తున్నారు. అలాగే అభ్యుదయ, వామపక్ష భావాలు కలిగిన పాఠ్యాంశాలను కూడా తీసేస్తున్నారు. మనదేశానిది భిన్న మతాలు, సంప్రదాయాలు కలగలిసిన మిశ్రమ సంస్కృతి. భిన్నత్వంలో ఏకత్వం అనే దాన్ని పక్కకు పెట్టి హిందూ దేశంగా మార్చేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. మైనార్టీలు, దళితుల పట్ల విద్వేషాలను రెచ్చగొడుతున్నారు. దీనికోసం విద్యను ఆయుధంగా చేసుకుంటున్నారు. ఈ కారణాలరీత్యా పస్తుతం మన దేశంలో విద్యా వ్యవస్థ ప్రమాదంలో పడింది.
ఇప్పుడు సాంప్రదాయ కోర్సుల స్థానంలో వృత్తి విద్యా కోర్సులే (బీ.టెక్, ఎమ్.టెక్, మెడిసిన్ లాంటివి) ఎక్కువగా చలామణి అవుతున్నాయి. ఈ పరిస్థితి సమాజంపై ఎలాంటి ప్రభావం చూపుతున్నది?
కొత్త కొత్త ఆలోచనలతో యువత ముందుకు వస్తున్నారు. వారి కోరికలు, ఆలోచనలు గౌరవించాల్సిన అవసరం ఎంతో ఉంది. అయితే ఏదైనా ఒక సంస్కరణ తీసుకొస్తే అది వీలైనంత వరకు ఎక్కువ మందికి ప్రయోజనం చేకూర్చేలా ఉండాలి. ప్రస్తుతం టెక్నాలజీ ప్రాధాన్యం బాగా పెరిగింది. అయితే టెక్నాలజీని ఉపయోగించుకుంటూనే దేశంలో ఎక్కువ శాతంగా ఉన్న గ్రామీణ ప్రజలకు నష్టం కలిగించని విధానాలు పాలకులు తీసుకోవాలి. అభివృద్ధి పేరుతో చరిత్రను పక్కకు పెట్టేస్తున్నారు. ఇప్పటి బీజేపీ ప్రభుత్వం మరింత ప్రమాదంగా మారింది. ఏం చేసినా పెట్టుబడిదారుల కోసం మాత్రమే ఆలోచిస్తున్నది. దీని వల్ల యువత ఆలోచన ధోరణి పూర్తిగా మారిపోతుంది. మన పోరాటాల చరిత్రను మర్చిపోయి యువతను కేవలం యంత్రాలుగా తయారు చేసే ప్రయత్నం బాగా జరుగుతుంది.
కేంద్ర ప్రభుత్వం తెచ్చిన 'బేటీ పఢావో - బేటీ బచావో' వంటి నినాదాల అమలు తీరెలా ఉంది?
అందమైన నినాదాన్ని ఇచ్చారు. ఇది చెప్పుకోవడానికి, వినడానికి మాత్రం చాలా బాగుంది. అయితే ఇప్పుడు వారు తెస్తానంటున్న నూతన విద్యా విధానాన్ని పరిశీలిస్తే దీని వల్ల మొదట నష్టపోయేది ఆడపిల్లలే. అమ్మాయిలు చదువుకు దూరమయ్యే ప్రమాదం చాలా ఉంది. అలాంటప్పుడు బేటీ పఢావో - బేటీ బచావో నినాదానికి అర్థమేముంది. అంతేకాదు ఆడపిల్లలపై ఇటీవల కాలంలో లైంగిక దాడులు పెరిగిపోయాయి. పసి పిల్లలను కూడా వదలడం లేదు. మతోన్మాదులు గొప్పగా చెప్పుకుంటున్న మనుధర్మ శాస్త్రం కూడా మహిళలను కించపరిచేదే. అమ్మాయిని ఇంటికే పరిమితం చేయాలనే ఆలోచనలు బాగా పెరిగిపోయాయి. లింగ సమానత్వంపై బీజేపీ ప్రభుత్వానికి ఏ మాత్రం దృష్టి లేదు.
కేంద్రం తీసుకొస్తున్న నూతన విద్యా విధానంపై మీ అభిప్రాయం?
రాష్ట్రాలకు ఎటువంటి ప్రాధాన్యం లేకుండా చేయబోతున్నారు. పేదలకు ఉచిత విద్యను దూరం చేయబోతున్నారు. రిజర్వేషన్లు లేకుండా పోతాయి. ప్రభుత్వ రంగం మొత్తం ప్రమాదంలో పడబోతుంది. ముఖ్యంగా అమ్మాయిలు ఎక్కువగా స్కాలర్‌షిప్‌లపై ఆధారపడి చదువుకుంటారు. విద్యలో అయ్యే ఖర్చులో సబ్సిడీ ఉంటేనే ఆడపిల్లను చదివించడానికి తల్లిదండ్రులు ముందుకొస్తారు. లక్షలు ఖర్చుపెట్టి చదివించాలంటే ముందు అబ్బాయికి మాత్రమే ప్రాధాన్యం ఇస్తారు. కేంద్రం అమలు చేస్తానంటున్న నూతన విద్యా విధానం వల్ల ఇంకా ఇలాంటి ప్రమాదాలు ఎన్నో ఉన్నాయి. అందుకే ఆ విద్యా విధానాన్ని కేరళ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది.
దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో విద్యార్థి సంఘాల ఎన్నికలపై నిషేధం కొనసాగుతున్న నేపథ్యంలో దాని వల్ల ఉత్పన్నమయ్యే పరిస్థితులేమిటీ?
దేశానికి స్వాతంత్య్రం తీసుకురావడంలో విద్యార్థుల పాత్ర కీలకం. ఆనాడు ఎంతో మంది విద్యార్థులు, యువత తమ ప్రాణాలు త్యాగం చేసి దేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చారు. అప్పుడు వారికి రాజకీయాలు ఎందుకు అనుకుంటే మనకు అంత త్వరగా స్వాతంత్య్రం వచ్చేదే కాదు. సాక్షాత్తూ గాంధీజీయే ఆనాడు విద్యార్థులను తరగతులు బహిష్కరించి బయటకు రమ్మని పిలుపునిచ్చారు. అలాంటిది ఇప్పుడు విద్యార్థులకు రాజకీయాలు వద్దంటున్నారు. విద్యార్థి సంఘాల ఎన్నికలను రద్దు చేశారు. ఇది విద్యార్థుల స్వేచ్ఛను హరించి వేయడమే కదా? మనది ప్రజాస్వామ్య దేశం. ఎవరి భావాలు వారు స్వేచ్ఛగా చెప్పుకోవచ్చు. కానీ ఎన్నికలను రద్దు చేసి ఆ స్వేచ్ఛను నేడు విద్యార్థులకు లేకుండా చేశారు. విద్యార్థులు రాజకీయాల్లోకి రాకుండా సమాజంలో మార్పు రావడం కష్టం. దీన్ని మన పాలకులు గుర్తించడం లేదు.
కేరళ రాష్ట్రం ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలు?
పినరయి విజయన్ నాయకత్వంలో 2016 - 2021లో ఎల్డీఎఫ్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర అభివృద్ధి కోసం నాలుగు మిషన్స్‌ను రూపొందించాం. అవి ఆరోగ్య మిషన్, విద్యా మిషన్, హౌసింగ్ లైఫ్ మిషన్ అలాగే హరిత కేరళ మిషన్. ఈ నాలిగింటిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం తన పనిని ప్రారంభించింది. వీటిలో ముఖ్యంగా విద్యా మిషన్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాం. బడ్జెట్లో ఎక్కువ శాతం నిధిలు దీనికి కేటాయించాం. పాఠశాల భవనాలు, ప్రయోగశాలల నిర్మాణం మొదలుపెట్టాం. విద్యలో అంతర్జాతీయ నాణ్యత తీసుకురావాలనే నిర్ణయం తీసుకున్నాం. దీని కోసం ముందు ప్రైమరీ పాఠశాలల కోసం కోటి రూపాయలు, ఎలిమెంటరీ పాఠశాలలకు 2 కోట్లు, హైస్కూల్స్‌కు వాటి అవసరాలను బట్టి రూ.3 నుండి 5 కోట్లు కేటాయించాం. ఇక యూనివర్సిటీలకైతే వాటి అవసరాలకు ఎంతైతే కావాలో అంత ఖర్చు పెట్టాలని నిర్ణయించుకున్నాం. ప్రతి తరగతి గదిలో కంప్యూటర్, ఎల్ఇడీ స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నాం. ప్రస్తుతం 60 వేల స్మార్ట్ క్లాస్ రూములు నిర్మాణంలో ఉన్నాయి. ఈ రకంగా కేరళ విద్యా విధానంలో ముందుకు పోతున్నది. దేశానికే ఆదర్శనీయంగా ఉంది.
విశ్వవిద్యాలయాల్లో గవర్నర్ల జోక్యంపై మీ కామెంట్..?
గవర్నర్లు అంటే రాజ్యాంగం ప్రకారం నియమించబడేవారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడడంలో వారి పాత్ర ఎంతో కీలకమైంది. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి, కేబినెట్‌తో కూడా చర్చించి సమన్వయంతో నడిపించాల్సిన అవసరం ఉంది. కానీ మన దేశంలో పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది.