Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఎంసీ కార్యకర్తల దాష్టీకంపై ఆందోళనలు
కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌లోని పురూలియా జిల్లాలో డీవైఎఫ్ఐ నేతను తృణమూల్ కార్యకర్తలు కాల్చి చంపారు. పురూలియాలోని బందోన్ పోలీసు స్టేషన్ ఏరియా మకపోలి గ్రామంలో శుక్రవారం సాయంత్రం దుండగులు డీవైఎఫ్ఐ నేత కృష్ణపాద్ తుడుపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన కృష్ణపాద్ని సీపీఐ(ఎం) కార్యకర్తలు వెంటనే బంకూరా సామిలని మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ వెంటనే ఆపరేషన్ చేసినా ఫలితం లేకపోయింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు.
ఈ దుండగులకు తృణమూల్ కాంగ్రెస్ ఆశ్రయం కల్పించిందని సీపీఐ(ఎం) నేతలు విమర్శించారు. ఈ ఘటనపై పురూలియా జిల్లా సీపీఐ(ఎం) నేత మాట్లాడుతూ, శుక్రవారం సాయంత్రం ఏరియా కమిటీ సభ్యుడు కృష్ణపాద తుడు పార్టీ సమావేశం ముగించుకుని ఇంటికి తిరిగివస్తుండగా, మకపోలి మలుపు వద్ద దుండగులు కాల్పులు జరిపారని తెలిపారు. తుడు భుజం, చేతుల్లో మొత్తంగా మూడు బుల్లెట్లు తగిలాయని తెలిపారు. ఈ ఘటనపై పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. కృష్ణపాద్ పార్టీలో క్రియాశీల కార్యకర్త అని, ఇటీవల ఆ ఏరియాలో సీపీఐ(ఎం) కార్యకలాపాలను విస్తృతం చేసిన నేపథ్యంలో దారుణంగా హత్య చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీపీఐ(ఎం) కార్యకర్తల ఆందోళన
కృష్ణపాద్ తుడును హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ బంద్వాన్ నుంచి గలుడి వెళ్లే రహదారిలో కుచియా జంక్షన్‌ను సీపీఐ(ఎం) కార్యకర్తలు దిగ్బంధించారు. టీఎంసీ హత్యా రాజకీయాలను తిప్పికొట్టాలంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని నేతలు హెచ్చరించారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో సీపీఐ(ఎం) ఆధ్వర్యాన ఆందోళనలు నిర్వహించారు.