Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రిమోట్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ పై ప్రతిపక్ష పార్టీలు
- రెండు, మూడు పార్టీలు మాత్రమే మద్దతు
- రాజకీయ పార్టీలు లిఖితపూర్వక అభిప్రాయాలు ఇచ్చేందుకు
గడువు పెంపు
న్యూఢిల్లీ : వలస కార్మికులకు రిమోట్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ (ఆర్‌ఈవీ) వ్యవస్థతో ఓటు హక్కు కల్పించడంపై తొందరొద్దని, మరింత చర్చ జరగాలని రాజకీయ పార్టీలు స్పష్టం చేశాయి. సోమవారం నాడిక్కడ కాన్ట్సిట్యూషన్ క్లబ్లో కేంద్ర ఎన్నికల సంఘం అఖిలపక్ష పార్టీల నేతలతో భేటీ నిర్వహించింది. ఈ సమావేశంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు అనుప్ చంద్ర పాండే, అరుణ్ గోయెల్, ఎనిమిది గుర్తింపు పొందిన జాతీయ పార్టీలు, 57 ప్రాంతీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. రిమోట్ ఓటింగ్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకు వస్తూ.. తీసుకున్న నిర్ణయంపై పార్టీల అభిప్రాయాన్ని ఈసీ కోరింది. వలస కార్మికుల ఓటర్ల కోసం ఆర్‌ఈవీ పనితీరును రాజకీయ పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం వివరించింది. ఓటింగ్ శాతం పెంచడానికి ప్రధానంగా రిమోట్ ఏరియాల నుంచి ఓటింగ్ శాతం పెంచడానికే ఈ వ్యవస్థ తీసుకొచ్చామని ఈసీ తెలిపింది. ఓటింగ్ శాతం తక్కువ ఉండడానికి ప్రధానంగా కారణం వలస కార్మికులేననీ, వలస కార్మికులకు వారికి ఉన్న ప్రదేశంలో ఓటు హక్కు వేసే అవకాశం ఇవ్వాలని ఉద్దేశంతో దీన్ని తీసుకొచ్చామని తెలిపింది. రెండు మూడు చిన్న పార్టీలు మినహా అన్ని రాజకీయ పార్టీలు కూడా రిమోట్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ పనితీరుపై అనుమానాలను వ్యక్తం చేశాయి. రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరపకుండానే, నిర్ణయం తీసుకోకుండానే ఈ మిషన్లను తయారు చేశారనీ, ముందు రాజకీయ పార్టీల ఆలోచనలు వినాలని సమావేశంలో అన్ని పార్టీల ప్రతినిధులు స్పష్టం చేశారు. అన్ని రాజకీయ పార్టీల తమ తమ అనుమానాలు, సందేహాలు వ్యక్తం చేశాయి. ఉద్యోగ, ఉపాధి రీత్యా ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన వారికి ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేందుకు అవకాశం కల్పించే ఉద్దేశంతో ఎన్నికల సంఘం రిమోట్ ఓటింగ్ యంత్రాన్ని ప్రవేశపెట్టాలన్న ఆలోచనతో రాజకీయ పార్టీలు విభేదిస్తున్నాయి. చాలా రాజకీయ పార్టీలు వలస కార్మికుల నిర్వచనం, వారి సంఖ్య, రిమోట్ ఓటింగ్ యంత్రం పనితీరుపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశాయి. రాజకీయ పార్టీలు ఆసక్తి చూపకపోవడంతో రిమోట్ ఓటింగ్ యంత్రం పనితీరును కూడా కమిషన్ సమావేశంలో ప్రదర్శించలేకపోయింది. సమావేశంలో రాజకీయ పార్టీలకు ఈసి డెమో ఏర్పాటు చేస్తూ షెడ్యూల్డ్ చేసింది. అయితే రాజకీయ పార్టీల నుంచి వచ్చిన అనుమానాలతో ఈసీ ఆర్‌ఈవీ డెమోను వాయిదా వేసింది. కమిషన్ ఈ వ్యవహారంలో వేగం పెంచుతోందనీ, ఇలాంటి ఆలోచనతో ముందుకు వెళ్లాలంటే ముందుగా రాజకీయ పార్టీలతో చర్చించి ఉండాల్సిందని రాజకీయ పార్టీలు స్పష్టం చేశాయి. కానీ కమిషన్ అన్ని ప్రకటనలు చేసిన తరువాత, రాజకీయ పార్టీలను చర్చకు పిలిచారని అన్నాయి. ''వలస కార్మికులకు అవకాశం రాకపోవడంతో ఓటింగ్ శాతం తగ్గుతోందని కమిషన్ అభిప్రాయంలో నిజం లేదు. ఎన్నికల సమయంలో చాలా మంది ఓటు వేయడం లేదు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల ప్రజలు ఓటు వేయడం లేదు. 30 కోట్ల మంది వలస కార్మికులు ఉన్నట్టు కమిషన్ గుర్తించడంతో మేం ఏకీభవించలేం. ఇంతమంది జాబితాలోకి ఎలా వచ్చారు? రాజకీయ పార్టీలు సాధారణంగా ఏకాభిప్రాయం ద్వారా మాత్రమే ఇటువంటి చర్య తీసుకోవాలి'' అని రాజకీయ పార్టీలు అభిప్రాయపడ్డాయి. దీనిపై మరిన్ని చర్చలు జరపాల్సిన అవసరం ఉన్నదని బీజేపీ కూడా అభిప్రాయపడింది. రిమోట్ ఓటింగ్ మెషిన్ అమలుపై రాజకీయ పార్టీలు లిఖితపూర్వకంగా వ్యాఖ్యానించడానికి గడువును జనవరి 31 నుండి ఫిబ్రవరి 20 వరకు పొడిగించారు.
సీపీఐ(ఎం) తరపున పొలిట్‌బ్యూరో సభ్యుడు నీలోత్పల్ బసు, కేంద్ర కమిటీ సభ్యుడు మురళీధరన్, సాంకేతిక నిపుణుడు బప్పా సిన్హా పాల్గొన్నారు. వలస కార్మికులను కూడా ఎన్నికల ప్రక్రియలో భాగం చేయాలన్నదే తమ లక్ష్యమని, అయితే ప్రస్తుత కమిషన్ చర్యలు హడావుడిగా ఉన్నాయని సీపీఐ(ఎం) ప్రతినిధులు పేర్కొన్నారు. టీడీపీ తరపున పాల్గొన్న ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ రాష్ట్ర స్థాయిలో కూడా సమావేశాలు జరపాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ తరఫున దిగ్విజయ సింగ్, ఆప్ తరపున సంజరు సింగ్, ఆర్జేడి తరపున మనోజ్ కుమార్ ఝా తదితరులు పాల్గొన్నారు.
రిమోట్ ఓటింగ్ విధానానికి బీఆర్ఎస్ వ్యతిరేకం
- బోయినపల్లి వినోద్‌కుమార్ స్పష్టం
రిమోట్ ఓటింగ్ విధానానికి బీఆర్ఎస్ వ్యతిరేకమని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్‌కుమార్ స్పష్టం చేశారు. ఈ విషయాన్ని జనవరి 30లోపు పార్టీలో చర్చించి, లిఖిత పూర్వకంగా కేంద్ర ఎన్నికల కమిషన్‌కు బీఆర్ఎస్ అభిప్రాయాన్ని తెలియజేస్తామని పేర్కొన్నారు. ఈమేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ పద్ధతి దేశంలో అవసరం లేదని స్పష్టం చేశారు. అభివృద్ధి చెందిన దేశాలే ఆవిధానాన్ని పక్కన పెట్టాయని గుర్తు చేశారు. ఎన్నికల్లో వాడుతున్న ఈవీఎంలను హ్యాక్ చేస్తున్నారనే అనుమానాలు, ప్రచారాలు బలంగా ఉన్నాయనీ, వాటినే ఇప్పటి వరకు ఈసీ నివృత్తి చేయడం లేదని పేర్కొన్నారు. అలాంటప్పుడు మల్టీ కానిస్టిట్యూయెన్సీ రిమోట్ ఓటింగ్ యంత్రాలను ఎలా నమ్ముతామని ప్రశ్నించారు.