Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పన్నుల్లో వారి వాటా 4 శాతం లోపే
- 100 మంది వద్ద రూ.54.12 లక్షల కోట్లు
- భారత్‌లో తీవ్ర ఆర్థిక అసమానతలు
- ప్రజలపై అధిక భారాలు.. సంపన్నులకు ఆదాయాలు : ఆక్స్‌ఫామ్ రిపోర్టులో వెల్లడి
గత రెండేండ్లలో ప్రపంచంలోని ధనవంతుల్లో అగ్రశ్రేణి ఒక శాతం మంది కూడబెట్టిన సంపద.. ప్రపంచ జనాభాలోని మిగిలిన వారు ఆర్జించిన దాంతో పోలిస్తే దాదాపు రెట్టింపు అయ్యింది. 170 కోట్ల మంది వేతనాలు పడిపోగా.. మరోవైపు బిలియనీర్ల సంపద రోజుకు 2.7 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.22వేల కోట్లు) పెరిగింది. ప్రపంచంలోని కుబేరులపై 5 శాతం పన్ను విధిస్తే వచ్చే 1.7 లక్షల కోట్ల డాలర్లతో 200 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకి తీసుకు రావచ్చు.
న్యూఢిల్లీ : దేశంలో ఆర్థిక అసమానతలు తీవ్రంగా పెరుగుతున్నాయి. భారత్‌లో సంపన్నులు ఒక్క శాతం ఉంటే.. వారి వద్ద 40.5 శాతం సంపద పోగుపడింది. మొత్తం సంపదలో 60 శాతం కేవలం ఐదు శాతం మంది వద్ద ఉన్నది. మరోవైపు దేశంలో అట్టడుగున ఉన్న 50 శాతం మంది (సగం జనాభా) వద్ద కేవలం మూడు శాతం సంపద పరిమితమైంది. భారత్‌లోని ఆర్థిక అసమానతలు, ధనవంతుల వద్ద ఉన్న సోమ్ముుతో ఆర్థిక వ్యవస్థకు ఎలాంటి పరిష్కారాలు చూపవచ్చునో స్వచ్ఛంద సంస్థ ఆక్స్‌పామ్ ఓ రిపోర్టులో విశ్లేషించింది. దావోస్‌లో జనవరి 16 నుంచి 20 వరకు వరల్డ్ ఎకనమిక్స్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్) వార్షిక సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల్లోని తొలి రోజున కార్పొరేట్ల పెరుగుదల, కోరలు చాస్తోన్న పేదరికంపై ఆక్స్‌ఫామ్ 'సర్వైవల్ ఆఫ్ ది రిచెస్ట్- ది ఇండియన్ స్టోరీ' పేరుతో ఓ రిపోర్టును విడుదల చేసింది. సోమవారం విడుదల చేసిన ఈ నివేదికలో అనేక విస్తు పోయే విషయాలను వెల్లడించింది. దేశంలో ధనవంతుల కంటే పేద ప్రజలే ఎక్కువ పన్నులు చెల్లిస్తున్నారని తెలిపింది. ఫోర్బ్స్ క్రెడిట్ సూయిజ్, కేంద్ర గణంకాల శాఖ, కేంద్ర బడ్జెట్ పత్రాలు, పార్లమెంట్లో సభ్యుల ప్రశ్నలకు ఇచ్చిన నివేదికల ఆధారంగా ఈ రిపోర్టును రూపొందించినట్టు ఆ సంస్థ తెలిపింది.
ఆ రిపోర్టు వివరాలు..
2020లో దేశంలో 102 మంది కుబేరులు (బిలియనీర్లు) ఉండగా.. 2022 ముగింపు నాటికి ఈ సంఖ్య 166కు చేరింది. 100 మంది కుబేరుల వద్ద రూ.54 లక్షల కోట్ల సంపద పోగుబడింది. దీంతో కేంద్ర బడ్జెట్‌కు 18 నెలల పాటు కేటాయింపులు చేయవచ్చు. దేశంలోని టాప్ 10 మంది కార్పొరేట్ల వద్ద రూ.27.52 లక్షల కోట్ల సంపద ఉంది. 2021 నాటి సంపదతో పోల్చితే దాదాపు 9 లక్షల కోట్లు లేదా 32.8 శాతం పెరుగుదల చోటు చేసుకున్నది. కరోనా సంక్షోభం ప్రారంభమైన నాటి నుంచి 2022 నవంబరు వరకు దేశంలో బిలియనీర్ల సంపద 121 శాతం పెరిగింది. రోజుకు దాదాపు రూ.3,608 కోట్ల సంపద పోగు చేసుకున్నారు. ''2019 కరోనా తర్వాత జనాభాలో దిగువన ఉన్న 50 శాతం మంది తమ సంపాదను కోల్పోయారు. మొత్తం సంపదలో వీరి వాటా 3 శాతం కంటే తక్కువగా ఉందని అంచనా. దీని ప్రభావం అనూహ్యంగా బలహీనమైన ఆహారం, అప్పులు, మరణాల పెరుగుదలకు కారణమైంది. దేశంలోని మొత్తం 90 శాతం పైగా సంపద 30 శాతం మంది ధనవంతుల వద్ద ఉన్నది. 80 శాతం సంపద 10 శాతం మంది చేతుల్లో ఉన్నది. అగ్రశ్రేణి 5 శాతం మంది కుబేరులు మొత్తం సంపదలో దాదాపు 62 శాతం వాటాను కలిగి ఉన్నారు. ఇది కరోనా ముందు నాటికంటే ఎక్కువ.'' అని ఈ రిపోర్టు తెలిపింది.
జీఎస్టీతో ప్రజలపైనే దాడి..
ఆర్థిక సంవత్సరం 2021-22లో దేశంలో వసూళ్లయిన రూ.14.83 లక్షల కోట్ల వస్తు సేవల పన్ను (జీఎస్టీ)ల్లో 64 శాతం రాబడి కూడా అట్టడుగున ఉన్న 50 శాతం మంది నుంచి వచ్చిందే. పన్నుల్లో మూడింట్లో ఒక్క వంతు మధ్య తరగతి వారి వాటా ఉంది. జీఎస్టీ మొత్తం ఆదాయంలో కేవలం 3-4 శాతం మాత్రమే తొలి పది మంది కుబేరుల నుంచి వచ్చింది. అంటే పన్నుల రూపంలో పేద, మధ్యతరగతి ప్రజలను ఏ స్థాయిలో బాదేస్తున్నారే ఈ రిపోర్టు స్పష్టం చేస్తోంది.
వారిపై పన్నులతోనే పరిష్కారం..
ధనవంతులపై పన్నులు వేయడం ద్వారా దేశంలోని అనేక సామాజిక సమస్యలకు పరిష్కారం చూపవచ్చని ఆక్స్‌ఫామ్ సూచించింది. ఆ వివరాలు.. భారత్‌లోని టాప్ 10 మంది కుబేరులపై 5 శాతం పన్ను విధిస్తే.. బడి మానేసిన పిల్లలందరినీ తిరిగి పాఠశాలలకు తీసుకురావచ్చు. లేదా తొలి 100 మంది బిలియనీర్లపై 2.5 శాతం పన్ను విధించిన ఆ పిల్లలను సూళ్లకు చేరువ చేయవచ్చు. మోడీ రెండో సారి అధికారంలోకి వచ్చిన తర్వాత గౌతమ్ అదానీ సంపద రాకెట్ల దూసుకుపోయిన సంగతి తెలిసిందే. 2017- 2021 మధ్య పెరిగిన అదానీ సంపదపై కేవలం ఒక్క సారి పన్ను విధిస్తే రూ. 1.79 లక్షల కోట్ల నిధుల్ని సమీకరించవచ్చు. దీంతో ఏడాది పాటు దేశంలోని ప్రాథమిక పాఠశాలల్లో బోధించే 50 లక్షల మందికి వేతనాలివ్వొచ్చు. భారత్‌లోని బిలియనీర్లపై ఒకసారి రెండు శాతం పన్ను విధిస్తే రూ.40,423 కోట్ల ఆదాయం వస్తుంది. దీంతో దేశంలో పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న పిల్లలందరికీ వచ్చే మూడేండ్ల పాటు పోషకాహారం అందించవచ్చు. 10 మంది కుబేరులపై ఒకేసారి 5 శాతం పన్ను విధిస్తే రూ.1.37 లక్షల కోట్లు నిధులు సమకూరుతాయి. ఈ మొత్తం 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఆయుష్ మంత్రిత్వ శాఖ అంచనా వేసిన నిధుల కంటే 1.5 రెట్లు ఎక్కువ కావడం విశేషం. దేశంలో ఒక పురుష కార్మికుడు సంపాదించే ప్రతి రూపాయికి మహిళా కార్మికులు కేవలం 63 పైసలు మాత్రమే పొందుతున్నారు. షెడ్యూల్డ్ కులాలు, గ్రామీణ ప్రాంత కార్మికుల సంపాదనల్లో తేడా మరింత ఎక్కువగా ఉంది. ఉన్నత సామాజిక వర్గాలు సంపాదిస్తున్న దానితో పోల్చితే షెడ్యూల్డ్ కులాల వారు 55 శాతం మాత్రమే పొందుతున్నారు.
ఆకలితో పిల్లల మరణాలు
''ఆకలి, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, ఆరోగ్య విపత్తులు తదితర బహుళ సంక్షోభాలతో భారత్ బాధపడుతోంది. మరోవైపు దేశంలో కుబేరులు పెరిగిపోతున్నారు. అదే సమయంలో పేదలు జీవించడానికి కనీస అవసరాలను కూడా కొనుగోలు చేయలేకపోతున్నారు. విపరీతమైన ఆకలితో ఉన్న భారతీయుల సంఖ్య 2018లో 19 కోట్ల నుంచి 2022లో 35 కోట్లకు పెరిగింది. ఆకలి కారణంగా 2022లో ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలలో 65 శాతం మరణాలు సంభవిస్తున్నాయి. ఇదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు సమర్పించింది.' అని ఆక్స్‌ఫామ్ ఇండియా సీఈఓ అమితాబ్ బెహర్ తెలిపారు.