Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏఐకేఎస్ విజ్ఞప్తి
న్యూఢిల్లీ : పెరుగుతున్న వన్య ప్రాణుల దాడుల నుంచి ప్రజల ప్రాణాలను, పంటలను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) డిమాండ్ చేసింది. ఈ మేరకు ఒక ప్రకటన జారీ చేసింది. కేరళలోని వాయనాడ్ జిల్లా మనంతవాదీ తాలూకాకు చెందిన థామస్ (50) తన ఇంటి పరిసరాల్లోనే పులి దాడి చేయడంతో ప్రాణాలు కోల్పోయాడు. కేరళ ఎల్డీఎఫ్ ప్రభుత్వం వారి కుటుంబానికి రూ.10లక్షల నష్టపరిహారాన్ని ఇచ్చి, వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగమిచ్చింది. ఆ పులిని తర్వాత బంధించారు. కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోతే ఆ నష్టాన్ని ఎవరూ భర్తీ చేయలేరని, అయినా ఎల్డీఎఫ్ ప్రభుత్వం సున్నిత ధోరణితో వ్యవహరించిందని ఏఐకేఎస్ తెలిపింది. అడవులు, వన్య ప్రాణి సంరక్షణ విభాగం కేంద్రప్రభుత్వం పరిధిలోకి వస్తుందనీ, అందువల్ల కేంద్రం కూడా కోటి రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలనీ, కుటుంబంలోని అర్హులైన వారికి ఉద్యోగాలివ్వాలని ఏఐకేఎస్ కోరింది. వన్య ప్రాణుల దాడుల నుంచి ప్రజలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేనని తెలిపింది. జంతువు ల దాడుల ముప్పు కారణంగానే సారవంతమైన నేలలున్నా వేలాది హెక్టార్ల భూములను సాగు చేయకుండా వదిలిపెడుతున్నారని కిసాన్ సభ పేర్కొంది. తీవ్రమైన భయం, మానసిక ఆందోళనలతో ప్రజలు జీవిస్తున్నారని తెలిపింది. ఇటీవలి కాలంలో వన్య ప్రాణుల దాడుల్లో మరణిస్తున్న వారి సంఖ్య రెట్టింపు అయింది. దేశవ్యాప్తంగా ఏనుగుల దాడుల్లో 300మందికి పైగా మరణిం చారు. సగటున ప్రతి ఏడాది వెయ్యి మందికి పైగా వన్య ప్రాణుల దాడుల్లో చనిపోతున్నారని కిసాన్ సభ తెలిపింది. బాధిత ప్రాంతాలను గుర్తించి, వాటి చుట్టూ నాలుగు మీటర్ల ఎత్తైన వైరింగ్ చేసి, రక్షణ చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ పనులను మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టం కింద చేయించాలని సూచించింది. ఈ డిమాండ్లు నెరవేరేవరకు రాష్ట్రస్థాయిలో, కింది స్థాయిలో పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టాలని ఏఐకేఎస్ పిలుపునిచ్చింది.