Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మల్లికా సారాభాయ్ ఆవేదన
కోల్కతా : భారతదేశంలో విలువలు, ఆదర్శాలు నాశనమై పోతున్నాయంటూ ప్రముఖ నృత్య కళాకారిణి మల్లికా సారాభాయ్ ఆవేదన వ్యక్తం చేశారు. హిందూవాదం పేరుతో ప్రజల గొంతుల్లోకి హిందూత్వను తొక్కేస్తున్నారని విమర్శించారు. ఇక్కడ కోల్కతా సాహిత్య ఉత్సవాల ముగింపు సందర్భంగా ఆమె తన జీవితం, కెరీర్, ప్రపంచ నాట్య రంగంలో తన కృషి గురించి మాట్లాడారు. ''ఈనాడు నా చుట్టూ జరుగుతున్న సంఘటనలు నన్నెంతో నిరాశకు గురి చేస్తున్నాయి. మన భారతదేశంలో ఇలా విలువలు పూర్తిగా నాశనమవుతాయని అస్సలు ఊహించలేదు. వాణిజ్య ప్రకటనలు,బ్రాండ్ల వెల్లువలో చాలామంది కొట్టుకుపోతున్నారు.'' అని వ్యాఖ్యానించారు. కేవలం ప్రశ్నలు అడిగినందుకే తన స్నేహితుల్లో చాలామంది జైలుకు వెళ్లారని ఆమె అన్నారు. మన వేదాల్లో చెప్పినట్లుగా అసలు హిందూమతం అంటేనే ప్రశ్నలు అడగడమని ఆమె వ్యాఖ్యానించారు. కానీ దురదృష్టవశాత్తూ హిందూత్వ రూపంలో హిందూవాదాన్ని ప్రచారం చేస్తున్నారని అన్నారు. కోల్కతాలో వివిధ మతాల వారు కలిసికట్టుగా వుండడం చూస్తుంటే ఆనందంగా వుందని, ఇలాంటి పరిస్థితిని గుజరాత్లో చూడలేమని అన్నారు.