Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మోడీ సర్కార్ 8ఏండ్ల పాలనలో రికార్డుస్థాయిలో ఎన్పీఏలు
- మొత్తం రుణాల్లో ఎన్పీఏలు 6.5శాతం
- అత్యంత రహస్యంగా.. రైట్ ఆఫ్ : రాజకీయ విశ్లేషకులు
- యుపీఏ హయాంలో బ్యాంకులకు ఏటా రూ.50వేల కోట్ల లాభాలు
- ఇప్పుడు ఏటా రూ.2లక్షల కోట్ల నష్టాలు..
దేశ ఆర్థిక వ్యవస్థ, బ్యాంకింగ్ రంగాన్ని అతలాకుతలం చేస్తున్న అంశం 'మొండి బకాయిలు' (ఎన్పీఏ). మార్చి 2014న ఎన్పీఏలు రూ.2.51లక్షల కోట్లు. 2021-22నాటికి రూ.14.5లక్షల కోట్లకు చేరుకుంది. ఇందులో బడా కార్పొరేట్లు తీసుకున్న దాదాపు రూ.12లక్షల కోట్లు ఒక పద్ధతి ప్రకారం ఎన్పీఏలుగా మారాయి. ఇవి ఒక ప్రణాళిక, వ్యూహం ప్రకారం అత్యంత రహస్యంగా రైట్ ఆఫ్ అవుతున్నాయని బ్యాంకింగ్ రంగ నిపుణులు, రాజకీయ విశ్లేషకులు ఆరోపిస్తున్నారు. మోడీ సర్కార్ అండదండలతోనే ఇదంతా జరుగుతోందన్నది బహిరంగ రహస్యం. బ్యాంకింగ్ వ్యవస్థలో ఉండాల్సిన లక్షల కోట్లు.. కార్పొరేట్ల చేతుల్లోకి వెళ్లిందని, సడిచప్పుడూ లేకుండా.. వ్యవహారాలు(ఎన్పీఏలుగా ముగించటం) నడుస్తున్నాయని ఆరోపణలున్నాయి.
న్యూఢిల్లీ : మోడీ సర్కార్ అధికారంలోకి వచ్చింది మొదలు దేశంలోని బడా కార్పొరేట్ సంస్థలకు పండగే పండగ. మోడీ సర్కార్ ఆర్థిక విధానాలతోనే నీరవ్ మోడీ, మెహుల్ చోస్కీ వంటి ఆర్థిక నేరగాళ్లకు వేల కోట్లు రుణాలు అందాయి. అదంతా ఎగ్గొట్టి.. విదేశాలకు ఎగిరిపోయారు. ఈ రుణ ఖాతాల వివరాలు ఎవ్వరికీ తెలియదు. ప్రధాని మోడీకి అత్యంత సన్నిహితుడు అయిన అనిల్ అంబానీ వ్యాపార సంస్థలకు బ్యాంకుల నుంచి దాదాపు రూ.1లక్ష కోట్ల రుణాలు అందాయి. ఇదంతా కూడా ఎన్పీఏగా మారింది. ఈ కేసుపై కేంద్రం నోరు మెదపటం లేదు. ఈడీ, సీబీఐ, ఇన్‌కం ట్యాక్స్.. ఇవేవీ దాడులు చేయవు. విచారణ చేపట్టవు. డీహెచ్ఎఫ్ఎల్ తీసుకున్న రూ.35వేల కోట్లు ఎన్పీఏలుగా మారాయి. 17 బ్యాంకులకు నష్టం. గుజరాత్‌కు చెందిన ఏబీజీ షిప్‌యార్డ్ 28 బ్యాంకులకు రూ.23వేల కోట్లు ఎగ్గొట్టింది. రిలయన్స్, వేదాంత, ఆర్సెలర్ మిట్టల్, టాటా, పిరామల్.. మొదలైన కంపెనీలకు 'రైట్ ఆఫ్'లతో పెద్ద ఎత్తున లబ్ది చేకూరిందని ఆరోపణలున్నాయి.
ఏ దేశంలోనూ ఇలా లేదు
ప్రపంచంలో ఏ దేశంలోనూ జరగని వ్యవహారం. బడా కార్పొరేట్లు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు చాలా నిశ్శబ్ధంగా ఎన్పీఏలుగా మారుతున్నాయి. మొండి బకాయిలేవీ ఇక తిరిగిరావని ప్రభుత్వ, ప్రయివేటు బ్యాంకుల ఉన్నతాధికారులు చెబుతున్నారు. చట్టబద్ధంగా రుణాలు అందాయనీ, చట్టబద్ధమైన పద్ధతిలోనే వారి రుణాలు 'రైట్ ఆఫ్' అయ్యాయని బ్యాంకింగ్ వర్గాలు చెబుతున్నాయి. ఇలా జరగటం వెనుక.. రాజకీయ అధికార బలం ఉందని తెలుస్తున్నది. కేంద్ర ప్రభుత్వ అండదండలు లేకుండా వేల కోట్లు, లక్షల కోట్లు 'రైట్ ఆఫ్' కావని, ప్రపంచంలో ఏ దేశంలోనూ ఇలాంటి పరిస్థితి లేదని బ్యాంకింగ్ రంగ నిపుణులు చెబుతున్నారు.
వెసులుబాటు ఇచ్చినా..
ఏదైనా రుణ ఖాతా బకాయిలు చెల్లింపు 90 రోజులు జరగకపోతే అది 'ఎన్పీఏ'గా మారినట్టే. అయితే రుణ వాయిదాలు, బకాయిల చెల్లింపులకు బ్యాంకులు అనేక అవకాశాలు ఇస్తాయి. అయినా చెల్లంపులు లేకపోతే వాటిని వివిధ కేటగిరీలుగా వర్గీకరిస్తుంది. మొదట 'సబ్ స్టాండర్డ్'గా పేర్కొంటాయి. తర్వాత 'డౌట్ఫుల్ లెవల్-1', ఆ తర్వాత లెవల్-3గా మారుస్తాయి. చివరికి 'లాస్ అస్సెట్'గా చూపుతాయి. తుది దశ 'రైట్ ఆఫ్'కు రావడానికి దాదాపు 4 ఏండ్లు పడుతుంది. ఈ కాలంలో బ్యాంకుల కన్సార్టియం అనేక సంప్రదింపులు, చర్యలు చేపడుతుంది. రుణ ఖాతాలో వడ్డీలు, ఇతర రుసుములు మొత్తంగా మాఫీ చేసి..అసలు కట్టాలని కోరుతాయి. దీనిని వాయిదాల్లో కట్టొచ్చు. రుణ పునర్వ్యవస్థీకరణ అనే అవకాశమూ ఇస్తుంది. అంటే మరికొంత రుణం ఇచ్చి...ఆ ఖాతాదారుడి వెసులుబాటు కల్పిస్తుంది. ఇలాంటి ఎన్నో మినహాయింపులు, అవకాశం ఇచ్చినా మనదేశంలో బడా కార్పొరేట్లు ఎగ్గొట్టిన బ్యాంకు రుణాలు రూ.12లక్షల కోట్లు దాటాయి. వీటిని చడీచప్పుడు లేకుండా 'రైట్ ఆఫ్' చేశారన్నది ప్రధాన ఆరోపణ. కేంద్రంలోని పాలకుల అండదండలు లేకుండా జరగదన్నది బహిరంగ రహస్యం.
మొత్తం రుణాల్లో ఎన్పీఏలు 6.5శాతం
ఎన్పీఏలపై ఐఎంఎఫ్-2021 నివేదిక ఆసక్తికర విషయాల్ని వెల్లడించింది. మొత్తం రుణాల్లో ఎన్పీఏల వాటా అమెరికా, బ్రిటన్‌లో 1శాతం. కెనడాలో 0.4శాతం. దక్షిణ కొరియాలో 0.2శాతం. చైనాలో 1.7శాతం. భారత్ విషయానికొస్తే 6.5శాతంగా ఉంది. ఇది చాలా అసహజం, ప్రమాదకరమని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏ దేశంలోనూ ఇంతపెద్ద మొత్తంలో ఎన్పీఏలు ఏర్పడటం లేదని చెబుతున్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల మొత్తం రుణాల్లో ఎన్పీఏలు 9.4శాతానికి (డిసెంబర్ 29, 2022నాటికి) చేరుకుంది. యుపీఏ హయాంలో ఏటా రూ.50వేల కోట్లు లాభాలు చూసిన ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఇప్పుడు ఏటా రూ.2లక్షల కోట్ల నష్టాల్ని చవిచూడాల్సి వస్తోంది. వేల కోట్లు, లక్షల కోట్లు ఎన్పీఏలుగా మారటంపై బ్యాంకు ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇంతపెద్ద మొత్తం ఎక్కడి పోతుందన్నది ప్రజలకు తెలియటం లేదని, 'రైట్ ఆఫ్' ప్రక్రియ అత్యంత రహస్యంగా ముగుస్తోందని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి.