Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫిబ్రవరి 26న భారీ నిరసన ప్రదర్శన !
న్యూఢిల్లీ : మధ్యప్రదేశ్‌లో అధికార బీజేపీ తీరుపై వివిధ వర్గాలు ఆందోళనకు దిగుతున్నాయి. ఎస్సీ, ఎస్టీ ప్రభుత్వ ఉద్యోగులు శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో, పదోన్నతుల్లో, బ్యాక్లాగ్ పోస్టుల భర్తీలో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు అమలుజేస్తామని 2016లో సీఎం శివరాజ్ సింగ్ ప్రజలకు వాగ్దానం చేశారు. గత ఆరేండ్లుగా రాష్ట్రంలో అధికారంలో ఉన్నా... వాగ్దానాన్ని నిలబెట్టుకోవటంలో ప్రభుత్వం విఫలమైందని ఎస్సీ, ఎస్టీ ప్రభుత్వ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఈ ఏడాది మధ్యప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు రాబోతున్న తరుణంలో ఈ అంశం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. తమకు ఇచ్చిన వాగ్దానాన్ని బీజేపీ నెరవేర్చలేదని ఎస్సీ, ఎస్టీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం 'ఏజేజేఏకేస్' ఫిబ్రవరి 26న రాష్ట్రవ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చింది.
'ఏజేజేఏకేస్' ప్రధాన కార్యదర్శి సూర్యవంశి మాట్లాడుతూ, ''లక్షలాది మంది ప్రజలు హాజరైన సభలో బహిరంగంగా సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ రిజర్వేషన్ల అమలుపై వాగ్దానం చేశారు. అన్ని రకాల నియామకాల్లో అమలుజేస్తామన్నారు. పాలనా విభాగం సైతం విధివిధానాలు సిద్ధం చేసింది. అయినా ఆరేండ్లుగా అమలు జేయకుండా అధికార బీజేపీ కాలయాపన చేస్తూ వస్తోంది. ఆరోగ్యం, ఆర్థికం, కోఆపరేటివ్, జిల్లా కోర్టులు, మెడికల్ కాలేజీలు..ఇలా అన్నిచోట్లా ఔట్సోర్సింగ్ విధానంలో ఉద్యోగ ఖాళీల్ని భర్తీ చేస్తోంది. రిజర్వేషన్లు లేకుండా ఖాళీలను నింపుతున్నారు. ఎస్సీ, ఎస్టీ సామాజికవర్గాలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను బీజేపీ సర్కార్ కాలరాస్తోంది'' అని అన్నారు. తమ డిమాండ్లపై జనవరి 29లోగా ప్రభుత్వం నుండి స్పందన రాకపోతే, ఫిబ్రవరి 26న భోపాల్‌లో ఉద్యోగులు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనకు దిగుతారని మీడియాకు వెల్లడించారు.