Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అన్ని సంఘాల మధ్య ఐక్యత అవసరం: డబ్ల్యూఎఫ్టీయూ ప్రధాన కార్యదర్శి పంబిస్ క్రిస్టిస్
బెంగుళూరు నుంచి నవతెలంగాణ ప్రతినిధి
రష్యా, ఉక్రెయిన్ యుద్ధం వెనుక సామ్రాజ్యవాద విస్తరణ కాంక్ష ఉందని డబ్ల్యూఎఫ్టీయూ ప్రధాన కార్యదర్శి పంబిస్ క్రిస్టిస్ అన్నారు. ఆ రెండు దేశాల యుద్ధం ద్వారా రష్యాపై ప్రపంచదేశాలతో ఆంక్షలు విధించి యూఎస్ఏ లబ్ది పొందాలని చూస్తున్నదని విమర్శించారు. బెంగుళూరులోని ప్యాలెస్ గ్రౌండ్లోని కామ్రేడ్ రంజనా నిరులా, రఘునాథ్ సింగ్ వేదికగా జరుగుతున్న సీఐటీయూ అఖిల భారత 17వ మహాసభకు ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రసంగించారు. వర్గదృక్పథంతో పనిచేస్తున్న సీఐటీయూకి అభినందనలు తెలుపుతున్నానన్నారు. డబ్యూఎఫ్టీయూ నిరంతరం ప్రపంచ శాంతి కోసం కృషి చేస్తున్నదని చెప్పారు. సామ్రాజ్యవాద విస్తరణ కాంక్షతో జరుగుతున్న యుద్ధాలను ఖండించాలని కోరారు. ప్రపంచవ్యాప్తంగా కార్మివర్గాన్ని దోపిడీచేసే పాలసీలు ఎక్కువయ్యాయనీ, దీంతో కార్మికుల జీవన ప్రమాణాలు పడిపోతున్నాయని వాపోయారు. సామ్రాజ్యవాదం వల్ల ఎక్కువగా నష్టపోతున్నది కార్మికవర్గమేనని చెప్పారు. కార్మికుల హక్కులను కాపాడేందుకు డబ్ల్యూఎఫ్టీయూ, దాని అనుబంధ సంఘాలు పోరాటాలు చేస్తున్నాయన్నారు. అయితే, ఈ పోరాటాలపై పాలకవర్గాలు తీవ్ర అణచివేత చర్యలకు పాల్ప డుతున్నాయని విమర్శించారు. బ్యూరోక్రసీతో అవినీతి పెరిగి పోతున్నదన్నారు. రాజకీయ, ఆర్థిక, సామాజిక హక్కులను కాపాడుకునేందుకు పోరాటాలే మార్గమని చెప్పారు. దీనికి అన్ని సంఘాల ఐక్యత అవసరమని నొక్కిచెప్పారు. ప్రపంచ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి... సీఐటీయూ వర్ధిల్లాలి.. డబ్ల్యూఎఫ్టీయూ వర్ధిల్లాలి...అంటూ చివర్లో ఆయన నినాదాలు చేశారు. డబ్ల్యూఎఫ్టీయూ తరఫున సీఐటీయూ అఖిల భారత అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డాక్టర్ కె.హేమలత, తపన్సేన్లకు జ్ఞాపికలను అందజేశారు.