Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాజకీయ లక్ష్యం లేకుండా పోరాటాలు సరిగాదు : సీఐటీయూ అఖిల భారత అధ్యక్షులు డాక్టర్ కె.హేమలత
- యాజమాన్య-కార్మికుల మధ్య సంబంధాలను గుర్తించి పోరాటాలు చేయాలి : అఖిల భారత ప్రధాన కార్యదర్శి తపన్‌సేన్
- అమరవీరులకు సంతాపం ప్రకటించిన మహాసభ
బెంగుళూరు నుంచి నవతెలంగాణ ప్రతినిధి
ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారీ విధానం తీవ్ర సంక్షోభంలో ఉందనీ, అదొక విఫల వ్యవస్థ అని సీఐటీయూ అఖిల భారత అధ్యక్షులు డాక్టర్ కె.హేమలత అన్నారు. రాజకీయ లక్ష్యం లేకుండా పోరాటాలు సరిగాదన్నారు. బెంగుళూరులోని ప్యాలెస్గ్రౌండ్లోని కామ్రేడ్ రంజనా నిరులా, రఘునాథ్‌సింగ్ వేదికపై జరుగుతున్న సీఐటీయూ అఖిల భారత 17వ మహాసభలో ఆమె మాట్లాడారు. ఈ సంక్షోభం గతంలో లాగా ఒక విభాగానికి, ఒక ప్రాంతానిక పరిమితమై లేదని చెప్పారు. అమెరికా మొదలుకుని, యూరప్, శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ ఇలా అనేక దేశాల్లో తీవ్రమైన సంక్షోభం నెలకొందని గుర్తు చేశారు. దేశంలోనూ దీని ప్రభావం ఉందని చెప్పారు. ఈ క్రమంలో కార్మిక హక్కులు మరింత హరించబడుతున్నాయని విచారం వ్యక్తం చేశారు. పెరుగుతున్న ధరలకు తగ్గట్టు వేతనాలు పెరగడం లేదని పేర్కొన్నారు. ఉపాధి అవకాశాలూ తగ్గిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విధానాలను సరైన పద్దతిలో అర్థం చేసుకుని పోరాటాలను నిర్మించాల్సిన అవసరముందనీ, సైద్ధాంతిక పోరాటాలకు సన్నద్ధం కావాలని ప్రతినిధులకు పిలుపునిచ్చారు. సీఐటీయూ ప్రధాన కార్యదర్శి తపన్ సేన్ మాట్లాడుతూ మారుతున్న పాలకుల విధానాలకు అనుగుణంగా కార్మిక సమస్యల్లోనూ మార్పులు వస్తున్నాయన్నారు. యాజమాని, కార్మికుడి మధ్య సంబంధాల్లోనూ మార్పులు జరుగుతున్నాయన్నారు. వాటిని సరైన పద్దతిలో గమనించి, అర్థం చేసుకుని పోరాటాలను రూపొందించాల్సిన అవసరం మనపై ఉందని సూచించారు. గతంలో లాగా సంఘటిత రంగంగా ఇప్పుడు కార్మికుల్లేరని అన్నారు. అలాగని అసంఘటితంగానూ కాకుండా అప్రెంటీస్, ట్రైనీ తదితర పేర్లతో మార్పులు వస్తునాయన్నారు. రెగ్యులర్ ఎంప్లాయీస్ అనే పద్ధతే భవిష్యత్‌లో కనుమరుగయ్యే ప్రమాదం ఉందని చెప్పారు. వీటిని అర్థం చేసుకుని అందుకు అనుగుణంగా పోరాటాలను రూపొందించాల్సి ఉంటుందన్నారు. అదే విధంగా ఆర్థిక సంక్షోభం పెరగే కొద్ది పెట్టుబడీదారి విధానం మతాలు, రంగులు, జాతుల పేరుతో ప్రజల మధ్య చీలిక తీసుకొచ్చి దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తోందన్నారు. ఇది భారతదేశంలోనూ మతతత్వం పేరుతో ప్రజలను విడగొట్టే ప్రయత్నం సాగుతోందన్నారు. అందుకే వర్గ పోరాటంతోపాటు, సామాజిక పోరాటాలపైనా దృష్టి సారించాల్సి ఉందన్నారు. ప్రజల మధ్య ఐక్యత పెంచి పోరాటాల్లో భాగస్వాములను చేయాలని పిలుపునిచ్చారు.
తీర్మానాలు
సీఐటీయూ 17వ మహాసభలో మొదటి రోజు సంతాపతీర్మానాన్ని ప్రవేశపెట్టారు. గత మహాసభ నుంచి ఇప్పటి వరకు మృతి చెందిన సీఐటీయూ నాయకులతోపాటు, కోవిడ్‌తోనూ, ఇతర అనారోగ్య కారణాలతో మృతి చెందిన ప్రముఖులకు, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు మల్లుస్వరాజ్యం, తదితరులకు నివాళులు అర్పిస్తూ అమిత్ గుహ సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అనంతరం కేజీఎఫ్ పోరాట అమరవీరులకు, మధ్యప్రదేశ్‌లో సిమెంటు కార్మికుల పోరాటంలో హత్యగావించబడిన సీఐటీయూ నేత మనీష్ శుక్లాకు నివాళులు అర్పిస్తూ మరో సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అనంతరం మహాసభ రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులు అర్పించింది.