Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అరుణపతాకాన్ని ఎగురవేసిన అధ్యక్షులు కె.హేమలత
- ప్రత్యేక ఆకర్షణగా రెడ్ షర్ట్ వాలంటీర్ల గార్డ్ ఆఫ్ ఆనర్
- అమరవీరుల స్థూపానికి డబ్ల్యూఎఫ్‌టీయూ ప్రధాన కార్యదర్శితో సహా సీఐటీయూ నేతల నివాళి
బెంగుళూరు నుంచి నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి
సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్(సీఐటీయూ) అఖిల భారత 17వ మహాసభ బుధవారం కర్నాటక రాజధాని అయిన బెంగుళూరు పట్టణంలోని ప్యాలెస్ గ్రౌండ్లో అట్టహాసంగా ప్రారంభమైంది. సీఐటీయూ అఖిల భారత అధ్యక్షులు డాక్టర్ కె.హేమలతకు కెప్టెన్ మునిరాజ్ నేతృత్వంలోని రెడ్ షర్ట్ వాలంటీర్ల బృందం గార్డ్ ఆఫ్ ఆనర్ ఇచ్చింది. ఆ బృందం నుంచి గౌరవవందాన్ని ఆమె స్వీకరించారు. కోలార్ గోల్డ్ ఫీల్డ్ పోరాటంలో అసువులు బాసిన అమరులను స్మరించుకుంటూ అక్కడ నుంచి తీసుకొచ్చిన అమరవీరుల జ్యోతిని ఆనందరాజు నేతృత్వంలోని బృందం హేమలతకు అందజేసింది. అనంతరం సీఐటీయూ జెండాను ఆమె ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయా రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రతినిధులు 'వర్కర్స్ యూనిటీ జిందాబాద్.. మజ్దూర్-కిసాన్ ఏక్తా..అప్అప్ సోషలిజం..డౌన్‌డౌన్ క్యాప్టలిజం.. ఇంక్విలాబ్ జిందాబాద్.. సమాజివాద్ జిందాబాద్...సీఐటీయూ జిందాబాద్' అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం అమరవీరుల స్థూపం వద్ద డబ్ల్యూఎఫ్‌టీయూ ప్రధాన కార్యదర్శి పంబిస్ క్రిస్టిస్, సీఐటీయూ అఖిల భారత ప్రధాన కార్యదర్శి తపన్‌సేన్, అధ్యక్షులు కె.హేమలత, మహాసభల ఆహ్వాన సంఘం గౌరవాధ్యక్షులు, సీనియర్ న్యాయవాది కె.సుబ్బారావు, అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి.వెంకట్, ఆలిండియా కిసాన్‌సభ ప్రధాన కార్యదర్శి విజ్జుకృష్ణన్, సీఐటీయూ జాతీయ ఉపాధ్యక్షులు ఎం.సాయిబాబు, జాతీయ కార్యదర్శి చుక్కరాములు, ఉపాధ్యక్షులు ఏకే.పద్మనాభన్, బేబీరాణి, కార్యదర్శి దేబ్రారు, ఉమేశ్, ఏఆర్.సింధు, కరుమలయన్, జాతీయ కార్యదర్శి, ఎంపీ ఎ.కరీం, ఇతర ఆఫీస్‌బేరర్లు, ఏఐకేఎస్ సహాయకార్యదర్శి కృష్ణప్రసాద్, ఏఐఏడబ్ల్యూయూ సహాయ కార్యదర్శి విక్రమ్, సీఐటీయూ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, ఆంధ్రప్రదేశ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నాగేశ్వర్రావు, నర్సింగరావు, తదితరులు పుష్పగుచ్చాలనుంచి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కళాకారులు పాటలు పాడారు. నివాళులు అర్పించే క్రమంలో ప్రతినిధులు పెద్దఎత్తున నినాదాలు చేశారు. మహాసభకు 1500 మంది ప్రతినిధులు హాజరయ్యారు.