Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్‌పై రెజ్లర్ల ఆరోపణ
- జంతర్ మంతర్ వద్ద భజరంగ్, వినేశ్, సాక్షి సహా రెజ్లర్ల ధర్నా
నవతెలంగాణ-న్యూఢిల్లీ
'టాటా స్పోర్ట్స్ నుంచి వస్తున్న నిధులు క్రీడాకారులకు చేరటం లేదు. ఫెడరేషన్ విధానాలపై ప్రశ్నిస్తే చంపేస్తామని బెదిరిస్తున్నారు. మహిళా రెజ్లర్లను శిక్షణ శిబిరంలో లైంగికంగా వేధింపులకు గురి చేస్తున్నారు. ఫెడరేషన్ అధ్యక్షుడే స్వయంగా రెజ్లర్లను పరుషంగా దూషిస్తున్నాడు. ఈ విషయంపై గతంలో ప్రధాని మోదికి ఫిర్యాదు చేసినా పరిస్థితిలో ఎటువంటి మార్పు రాలేదు'.. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్లూఎఫ్ఐ) తీరు పట్ల ఇదీ భారత రెజ్లర్ల ఆవేదన. రెజ్లర్లను ఇబ్బందులకు గురిచేస్తూ, ఇష్టారాజ్యంగా ప్రయివేటు స్పాన్సర్షిప్ నిధులను వాడుకుంటున్న భారత రెజ్లింగ్ సమాఖ్య పాలకవర్గంపై రెజ్లర్లు గళమెత్తారు. ప్రస్తుత అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ పదవీ నుంచి తప్పుకునే వరకు దీక్షకు కూర్చుంటామని హెచ్చరించారు. భారత స్టార్ రెజ్లర్లు బజరంగ్ పూనియా, సాక్షి మాలిక్, వినేశ్ ఫోగట్, అన్షు మాలిక్ సహా పలువురు రెజ్లర్లు బుధవారం జంతర్ మంతర్ వద్ద ధర్నాకు దిగారు.
అధ్యక్షుడి బూతు పురాణం : ' ఫెడరేషన్ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ రెజ్లర్లను దూషిస్తున్నాడు. ఆటగాళ్లకు ఆత్మ గౌరవం అవసరం. టాటా స్పోర్ట్స్ నుంచి వస్తున్న స్పాన్సర్షిప్ నిధులు రెజ్లర్లకు చేరటం లేదు. ప్రయివేటు స్పాన్సర్లు సైతం ఫెడరేషన్ ద్వారానే రూల్ పెట్టారు. యువ రెజ్లర్లు స్పాన్సర్షిప్ కోసం ఎక్కడికెళ్లాలని అడుగుతున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే వెంటనే క్రమశిక్షణ చర్యల పేరుతో నిషేధం విధిస్తున్నారు. ఏకంగా చంపేస్తామని బెదిరింపులు రావటంతో అప్పట్నుంచి ఎవరినీ సమస్యల పట్ల సంప్రదించటం లేదు. టోక్యో ఒలింపిక్స్ అనంతరం ప్రధాని నరెంద్ర మోదితో ఈ విషయంపై ఫిర్యాదు చేశాను. ఆ తర్వాత అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ నాతో మాట్లాడేందుకు నిరాకరించాడు. అధ్యక్షుడు నేరుగా బెదిరించకపోయినా, అతడి అనుచరులు ఆ పని చేస్తున్నారు. రెజ్లింగ్ సమాఖ్యలో, పనితీరులో స్పష్టమైన మార్పు కోసం ఈ ధర్నాకు దిగుతున్నామని' అని స్టార్ రెజ్లర్ బజరంగ్ పూనియా పేర్కొన్నాడు. ప్రభుత్వ ఉద్యోగిగా కొనసాగుతున్న వినోద్ తోమర్ రూ 20-30 కోట్ల ఆస్తిని కూడబెట్టాడు. అందుకు కారణంగా ఆటగాళ్లకు చెందాల్సిన డబ్బును సొంత ఖాతాలోకి వేసుకోవటమేనని పూనియా ఆరోపించాడు.
లైంగికంగా వేధించాడు :' ప్రపంచ చాంపియన్‌షిప్స్ అంటే ఫెడరేషన్ పెద్దలకు జాతీయ చాంపియన్‌షిప్స్ మాదిరి కనిపిస్తాయి. ట్రయల్స్‌లో పోటీపడే నేను కామన్వెల్త్ క్రీడలకు వెళ్లాను. వరల్డ్ చాంపియన్‌షిప్‌కు ముందు ట్రయల్స్ నుంచి మినహాయించాలని కోరాను. కానీ ఫెడరేషన్ పెద్దలు వినలేదు, పైగా ట్రయల్స్‌లో పోటీపడేందుకు భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. దీంతో నేను గాయానికి గురయ్యాను. గాయం గురించి ఫెడరేషన్ తరఫున ఎవరూ నన్ను సంప్రదించలేదు. ఫెడరేషన్ బాధ్యతగా వ్యవహరిస్తే వరల్డ్ చాంపియన్‌షిప్స్‌లో పసిడి పతకం సాధించేందుకు అవకాశం ఉండేది. నేషనల్స్‌లో పోటీపడకపోతే, వరల్డ్ చాంపియన్‌షిప్స్‌కు పంపమని చెప్పారు. నన్ను ఓ చెల్లని రూపాయిగా అభివర్ణించారు. రెజ్లర్లకు ఎటువంటి హాని జరిగినా అది పూర్తిగా ఫెడరేషన్ బాధ్యత' అని వినేశ్ ఫోగట్ తెలిపింది. ' శిక్షణ శిబిరంలో ఉన్న కోచ్‌లు మహిళా రెజ్లర్లను, మహిళా కోచ్‌లను లైంగిక వేధింపులకు గురి చేస్తారు. రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ స్వయంగా ఎంతోమంది మహిళా రెజ్లర్లను లైంగిక వేధింపులకు గురి చేశాడు. లైంగిక వేధింపులకు గురైన ఎంతో మంది రెజ్లర్లు నాతో ఆ బాధను పంచుకున్నారు. ఆ విషjలు అన్నీ నాకు తెలుసు. లైంగిక వేధింపులను బహిరంగ పరిచాను, రేపటికి నేను సజీవంగా ఉంటానో లేదో తెలియదు!' అని వినేశ్ ఫోగట్ భావోద్వేగానికి లోనైంది.
ఎవరికీ ఆటపై అవగాహన లేదు : రెజ్లింగ్ ఫెడరేషన్లో ఉన్న పాలక వర్గంలో ఎవరికీ ఆటపై అవగాహన లేదని స్టార్ రెజ్లిర్ సాక్షి మాలిక్ ఆరోపించారు. 'నిషేధం విధిస్తే రెజ్లర్లు ఏ టోర్నీలో పాల్గొనేందుకు వెళ్లలేరు. ఫెడరేషన్లో ఉన్న వారికి ఎవరీ ఆటపై అవగాహన లేదు. ఒలింపిక్స్ అనంతరం నేను జాతీయ చాంపియన్‌షిప్స్‌లో పోటీపడ్డాను. నేషనల్ క్యాంప్‌లో మా పేర్లను చేర్చరు. ఫెడరేషన్ అధికారులతో పోరాటం తర్వాతే మా పేర్లను శిక్షణ శిబిరం జాబితాలో చేర్చుతారు. నీరజ్ చోప్రా, పి.వి సింధులకు ఇటువంటి పరిస్థితి ఉందా?' అని సాక్షి మాలిక్ ఆవేదిన వ్యక్తం చేసింది.
ఎవరీ బ్రిజ్ భూషణ్? : కామన్వెల్త్ క్రీడలు మొదలుకుని ఒలింపిక్స్ వరకు భారత్‌కు పతకాలు తీసుకొచ్చే క్రీడాంశం రెజ్లింగ్. భారత రెజ్లింగ్ సమాఖ్య పగ్గాలు దశాబ్దకాలంగా భారతీయ జనతా పార్టీ (బిజెపి) నాయకుడు, లోక్‌సభ సభ్యుడు (ఉత్తరప్రదేశ్‌లోని కైసర్‌గంజ్ నియోజక వర్గం) బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ చేతుల్లో ఉన్నాయి. మూడు దఫాలుగా భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్ష పదవి దక్కించుకున్న బ్రిజ్భూ షణ్.. ఆటగా ళ్లకు నేరుగా ప్రయోజనాలు అందిస్తున్న టాప్ ప్రోగ్రామ్ (టార్గెట్ ఒలింపిక్ పోడియం), శారు యంత్రాంగంపై సైతం విరుచుకుపడ్డాడు. బ్రిజ్‌భూషణ్ వ్యవహార శైలిపై నేరుగా ప్రధానికి ఫిర్యాదు చేసినా పరిస్థితిలో మార్పు రాలేదు. రెజ్లర్లను లైంగికంగా, మానసికంగా వేధిస్తున్న బ్రిజ్‌భూషణ్‌పై కేంద్ర ప్రభుత్వం, క్రీడా మంత్రిత్వ శాఖ ఎటువంటి నిర్ణయం తీసుకుంటాయో చూడాలి.