Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మోడీని మార్చాల్సిందే
- వర్గ దృక్పథంతో ప్రభుత్వ విధానాలను చూడాలి : సీఐటీయూ అఖిల భారత 17వ మహాసభలో ట్రేడ్ యూనియన్ల నేతలు
బెంగుళూరు నుంచి అచ్చిన ప్రశాంత్
'దేశంలోని కార్మికుల్ని ఐక్యం చేద్దాం.. కలిసికట్టుగా ముందుకెళ్దాం.. వర్గ దృక్పథంతో ప్రభుత్వ విధానాలపై పోరాడుదాం. కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని మోడీ సర్కారును మార్చుదాం' అని కార్మిక సంఘాల నేతలు ముక్తకంఠంతో చెప్పారు. అలా చేయని పక్షంలో దేశానికే ప్రమాదకరమనీ, కార్మికులు, కర్షకులు, ప్రజలపై దాడులు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు. కర్నాటక రాజధాని బెంగుళూరులో ప్యాలెస్ గ్రౌండ్‌లోని కామ్రేడ్ రంజనా నిరులా, రఘునాథ్‌సింగ్ వేదికపై సీఐటీయూ అఖిల భారత 17వ మహాసభ బుధవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా పలు ట్రేడ్ యూనియన్ల అగ్రనాయకులు తమ సంఘాల తరఫున సౌహార్ధ్ర సందేశాలిచ్చారు.
ఇది పరీక్షా సమయం..ఎదురొడ్డి పోరాడాలి : అమర్జిత్ కౌర్, ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి
దేశంలో నేడు కార్మిక సంఘాలకు పెద్ద పరీక్షా సమయం. మోడీ సర్కారు అనుసరిస్తున్న ప్రజా, కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఎదురొడ్డి పోరాడాల్సిన ఆవశ్యకత ఉంది. ఈ రోజు ఏం జరుగుతున్నది? రేపు ఏం జరుగబోతున్నది? రానున్న సవాళ్లేంటి? అనే వాటిని బేరీజు వేసుకుంటూ పెట్టుబడిదారీ విధానంపై పోరాడేందుకు భవిష్యత్ కార్యాచరణను రూపొదించుకోవాలి. దేశంలో జీవించే హక్కును, మాట్లాడే స్వేచ్ఛను మోడీ సర్కారు అణచివేస్తున్నది. జాబులు లేవు. జీతాలు తగ్గాయి. కార్మికవర్గంపై దాడి తీవ్రత పెరిగింది. వాటికి సంబంధించి ఆక్స్‌ఫామ్, తదితర సంస్థల నివేదికలు నిజాలను వెల్లడిస్తున్నాయి. ఇదీ గ్రౌండ్ రియాల్టీ. ఇలాంటి పరిస్థితులుంటే రైతులు బాగున్నారు.. కార్మికులు బాగున్నారు.. దేశం బాగుంది.. అని మోడీ సర్కారు గొప్పలకు పోతున్నది. ఇలాంటి
అంశాలపై ప్రజలకు విడమర్చి అర్ధమయ్యేలా చైతన్యపర్చాలి. కార్మికుల సమస్యలతో పాటు వేతనాలు పెంచాలి, పిల్లలకు రక్షణ కల్పిస్తూ అందరికీ ఉచిత విద్య అందించాలి... వైద్యానికి బడ్జెట్లో నిధులు పెంచాలి అనే డిమాండ్లను కూడా తీసుకుని ముందుకు సాగాలి.
నెహ్రు పరిశ్రమలను స్థాపిస్తే..మోడీ అమ్మేస్తున్నాడు.. ఆర్. చంద్రశేఖరన్, ఐఎన్టీయూసీ ఉపాధ్యక్షులు
సోషలిస్టు ఐడియాలజీతో దేశ ఆర్థిక వ్యవస్థను మెరుగుపర్చేలా ఆనాడు ప్రభుత్వ రంగ సంస్థలను నెహ్రు స్థాపించారు. మోడీ సర్కారు అవే పరిశ్రమలను ప్రయివేటీకరణ పేరుతో కార్పొరేట్లకు అప్పణంగా కట్టబెడుతున్నది. బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, ఫైనాన్స్, ఇలా అన్ని రంగాలను నిర్వీర్యం చేస్తున్నది. ఇది దేశ ఆర్థిక వ్యవస్థకే అత్యంత నష్టదాయకం. మరోవైపు దేశంలో కార్మికవర్గంపై దాడి కొనసాగుతున్నది. మతాల వారీగా ప్రజలను విభజించి పాలిస్తున్న వాతావరణం దేశంలో నెలకొంది. ఇండియా అంటే ఇది కాదు. ప్రజాస్వామ్యయుత దేశం. కార్మికులు, కర్షకులు ఒకే వేదికపైకి వచ్చి పోరాటాలు చేయాల్సిన అవసరం ఉంది.
కార్మిక చట్టాల రద్దు అన్యాయం నాగనాధ్, హెచ్ఎంఎస్ కర్నాటక రాష్ట్ర అధ్యక్షులు
దేశంలోని కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లను తీసుకురావడం అన్యాయం. అవి ఇంకా అమల్లోకి రాలేదు. వస్తే మాత్రం కార్మికవర్గం తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. దేశంలో మోడీ వన్‌మ్యాన్ షో నడుస్తున్నది. దీన్ని తిప్పికొట్టాలి. దేశం అభివృద్ధి చెందాలంటే మోడీ సర్కారును గద్దె దింపాల్సిందే.
పది కేంద్ర కార్మిక సంఘాలు ఐక్య పోరాటాలను నిర్మించాలి కె.సోమశేఖర్, ఏఐయూటీయూసీ అధ్యక్షులు
దేశంలోని కార్మికులందర్నీ ఐక్యపర్చి ఐక్య పోరాటాలను చేయాలని పది కేంద్ర కార్మిక సంఘాలను కోరుతున్నా. ఢిల్లీలో మూడు నల్లచట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఐక్యంగా నిలబడి కొట్లాడి వెనక్కి తీసుకునేలా చేశారు. కార్మికవర్గం కూడా లేబర్కోడ్లకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అలాంటి పోరాట రూపాన్ని తీసుకోవాలి. మహారాష్ట్రలో విద్యుత్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా 72 గంటల పాటు విద్యుత్ ఉద్యోగులు ఆందోళన చేశారు.
అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో దేశం రాజేంద్రన్ నాయర్, టీయూసీసీ జాతీయ కార్యదర్శి
నేడు మన దేశం అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ప్రజల కష్టార్జితం కార్పొరేట్ల పాలవుతున్నది. కార్మికుల హక్కుల కోసం గతంలో త్రైపాక్షిక చర్చలకు అవకాశం ఉండేది. ప్రస్తుతం అలాంటిదేం లేదు. కార్మికులకు ఆయా సంస్థల్లో ఉద్యోగ, సామాజిక భద్రత లేకుండా పోయింది. ప్రయివేటీకరణతో దోపిడీ మరింత పెరిగింది. ఇలాంటి తరుణంలో కార్మిక సంఘాలన్నీ ఐక్యంగా పోరాడాలి.
మిలిటెంట్ పోరాటాలు చేయాలి సోనియా జార్జి, సేవా ప్రధాన కార్యదర్శి
దేశంలో అసంఘటిత రంగంలోని మహిళా కార్మికుల సమస్యలపై మా సంఘం పనిచేస్తున్నది. కోవిడ్ తర్వాత ప్రజల ఉపాధి తీవ్రంగా దెబ్బతింది. ఉపాధి కోల్పోయిన వారిలో మహిళలే ఎక్కువ. ప్రజల నుంచి వసూలు చేసిన పన్నులు కార్పొరేట్లకు అందుతున్నాయి. రైతులు, ప్రజల నుంచి ముక్కుపిండి వసూలు చేసే బ్యాంకులు.. కార్పొరేట్ల విషయంలో ప్రేమ చూపుతున్నాయి. లక్షల కోట్ల రూపాయల బకాయిలను మాఫీ చేయడమే దీనికి కారణం. కార్మిక వర్గ సమస్యలపై మిలిటెంట్ తరహా పోరాటాలు చేయాలి.
వలస కార్మికుల బతుకులు దుర్భరం క్లిప్టన్, ఏఐసీసీటీయూ జాతీయ కార్యదర్శి
కోవిడ్ కాలంలో వలస కార్మికుల బతుకులు దుర్భంగా మారాయి. వారి విషయంలో ఉన్న చట్టాలు కూడా అమలు చేయలేదు. పైగా కోవిడ్ కాలంలో సొంతూర్లకు వెళ్లే క్రమంలో వారి బాధలు అన్నీ ఇన్నీ కావు. వారిపై మోడీ సర్కారు లాఠీచార్జీలు కూడా చేయించింది. వలస కార్మికుల చట్టాలను మరింత పకడ్బందీగా అమలయ్యేలా పోరాటాలను ఉధృతం చేయాలి.
2 కోట్ల ఉద్యోగాలు రాకపాయే..కోట్ల ఉద్యోగాలు పాయే.. వేణుస్వామి, ఎల్పీఎఫ్ జాతీయ కార్యదర్శి
మోడీ ఏటా ఇస్తానన్న రెండు కోట్ల ఉద్యోగాలు రాలేదు. పైగా ఉన్న ఉద్యోగాలను కోల్పోతున్న పరిస్థితి. ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ సమావేశాలు అస్సలు నిర్వహించడం లేదు. లేబర్ సంస్కరణల పేరుతో కార్మికుల హక్కులపై దాడి జరుగుతున్నది. 90శాతం కార్మికులు నేడు చట్టాల పరిధి నుంచి తప్పించబడిన దుస్థితి. సేలం, విశాఖ స్టీల్ ప్లాంట్లను నిర్వీర్యం చేసే యత్నాన్ని మోడీ సర్కారు చేస్తున్నది. రక్షణరంగాన్నీ నిర్వీర్యం చేయడం దారుణం. ఆర్థిక పోరాటాలకే పరిమితం కాకుండా ఎన్నికల్లోనూ ప్రభావితం చేసేలా కార్యాచరణ ఉండాలి.
వర్గదృక్పథంలో ప్రభుత్వ విధానాలను చూడాలి అశోక్ ఘోష్, యూటీయూసీ ప్రధాన కార్యదర్శి
ఓ వైపు దేశాన్ని నాశనం చేస్తూ మరోవైపు 75 ఏండ్ల స్వాతంత్య్రం పేరుతో ఆజాదీకా అమృత్ మహౌత్సవాలను నిర్వహించడం విడ్డూరంగా ఉంది. పెద్దనోట్ల రద్దుతో ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొం టున్నారు. మరోవైపు దేశంలో ఇండ్లులేనివారి సంఖ్య, కనీసం తిండి కూడా తినలేని వారి సంఖ్య క్రమంగా పెరిగిపోతున్నది. ఇదేనా అభివృద్ధి? 30న జరిగే ఆల్ ట్రేడ్ యూనియన్స్ కన్వెన్షన్ భవిష్యత్ పోరాటాలకు తొలి అడుగుగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం.