Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎన్నికల సంఘం హామీ వృథా : ఏచూరి
న్యూఢిల్లీ : ఎన్నికల సంఘం ఇచ్చిన హామీకి విరుద్ధంగా త్రిపురలో నిరంతరం దాడులు జరుగుతున్నాయని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. ఎన్నికల కమిషన్ పూర్తిస్థాయి బృందం రాష్ట్ర పర్యటన నుంచి తిరిగి వచ్చిన కొద్దిసేపటికే ప్రతిపక్ష పార్టీలపై దాడి జరిగిందని తెలిపారు. ఈ మేరకు గురువారం ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్‌ను సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, పొలిట్‌బ్యూరో సభ్యుడు నీలోత్పల్ బసు, కేంద్ర కార్యదర్శివర్గ సభ్యుడు మురళీధరన్ కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం సీతారాం ఏచూరి మీడియాతో మాట్లాడుతూ 'త్రిపురలో వారం రోజుల్లోనే తొమ్మిది దాడులు జరిగాయి. పోలీసు వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. ఎన్నికల సంఘం ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదు' అని విమర్శించారు. 'జనవరి 12న గోమతి జిల్లాలోని ఉదరుపూర్ డాక్ బంగ్లా రోడ్డులో నాలుగు ఇండ్లపై దాడి చేసి దోపిడి చేసి అందులో ఉన్నవారిని కొట్టారు. 14న ఉదరుపూర్‌లోని మాతాబరిలో సీపీఐ(ఎం) స్థానిక కమిటీ కార్యాలయాన్ని దహనం చేశారు. 15న దక్షిణ త్రిపురలోని సందీర్బజార్లో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు శ్రీమంత డేపై దారుణంగా దాడి చేసి తలపై గాయపర్చారు. 18న దక్షిణ త్రిపురలోని బర్పథారిలో సమావేశానికి వెళ్లి తిరిగి వస్తున్న ఐదుగురు సీపీఐ(ఎం) కార్యకర్తలపై దాడి జరిగింది. అదే రోజు బలోనియాలో సీపీఐ(ఎం) ఎమ్మెల్యే సుధాందాస్, పశ్చిమ త్రిపురలోని ఎస్ఎన్ కాలనీలో మాజీ మంత్రి మాణిక్ డే సమావేశాలను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. 18న కాంగ్రెస్ నేత సుశాంత చౌదరి నేతృత్వంలోని బృందం అజోరు కుమార్ హాజరైన సమావేశంపై దాడి జరిగింది. టిప్రా కార్యకర్త ప్రంజిత్ నమ్సుద్ర కమల్పూర్ దలైలో హత్యకు గురయ్యాడు. 19న పశ్చిమ త్రిపురలోని మలై నగర్లో సీపీఐ(ఎం) కార్యాలయాన్ని కూల్చివేశారు' అని అన్నారు. దాడులను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.