Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఓబీసీ ల లెక్కలకు వెనుకడుగు
- ఇప్పటికే సమ్మతి తెలుపని మోడీ సర్కారు
- 'హిందూత్వ'కు ఎదురుదెబ్బ తగులుతుందన్న భయం :
రాజకీయ నిపుణులు
న్యూఢిల్లీ : దేశంలోని ప్రజలు, వారు ఉంటున్న పరిస్థితులు, వారికి కావాల్సిన అవసరాలను తీర్చటానికి, సామాజిక ఆర్థిక మార్పులను అంచనా వేయడానికి జనాభా లెక్కలు, సర్వేలు ప్రభుత్వాలకు ఎంతో ముఖ్యమైనవి. వివిధ పథకాలు, విధానాలను పోల్చే క్రమంలో వలసదారులు, చదువుకున్న యువత, వృత్తిపరమైన గ్రూపులపై ఇంటింటి సర్వేలు అనేవి సాధారణమైన అంశం. భారత్ వంటి దేశంలో కులం అనేది చాలా కీలకమైన విషయమని నిపుణులు చెప్పారు. అయినప్పటికీ ఈ విషయంలో, ముఖ్యంగా ఓబీసీ లకు సంబంధించి లెక్కలు తీయడానికి భారత ప్రభుత్వం వెనకడుగు వేస్తుండటం గమనార్హమన్నారు. ఈ విషయంలో కేంద్రంలోని మోడీ సర్కారు కుల గణనకు ఇటీవల ఆమోదం తెలుపని విషయాన్ని గుర్తు చేశారు. కుల ఆధారిత సామాజిక, రాజకీయ సెంటిమెంట్లకు ఇది అగ్గిరాజేస్తుందనీ, హిందూత్వ-జాతీయవాద ప్రాజెక్టుకు ఆటంకం కలిగిస్తుందన్న భయంలో మోడీ ప్రభుత్వం ఉన్నదని రాజకీయ నిపుణులు చెప్పారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్లో కుల గణన ఆవశ్యమని నిపుణులు చెప్పారు. భారత్లోని సామాజిక, రాజకీయ యవనికపై హిందూ కుల వ్యవస్థ తెచ్చిన భయానక వాతావరణాన్ని మన దేశ నిర్మాతలు చూశారన్నారు. దీనిని రూపుమాపి భారత ప్రజల కోసం ఆధునిక జాతీయవాద గుర్తింపును నిర్మించాలని నిర్ణయించారని తెలిపారు. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి 73 ఏండ్లు గడుస్తున్నప్పటికీ.. సామాజికంగా ఉన్నత వర్గాలకే పరిమితమైన అధికారాలు ప్రజాస్వామ్యబద్ధం కాలేదని చెప్పారు. దేశంలో రాజకీయ అధికారం, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక రంగాల్లో ఉన్నత వర్గాలు తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తూనే ఉన్నాయనీ, సామాజికంగా అణచివేతకు గురైన వర్గాలు మాత్రం వీటికి దూరంగా ఉంటున్నాయని నిపుణులు తెలిపారు.
దేశ జనాభాలో సగానికి పైగా ఉండే ఓబీసీల పరిస్థితి మాత్రం దయనీయంగా ఉన్నదన్నారు. జనాభాకు తగిన వాటాను వారు పొందలేకపోతున్నారని చెప్పారు. చివరగా భారత్లో 1931లో కుల గణన జరిగి గణాంకాలు విడుదలయ్యాయని నిపుణులు తెలిపారు. అప్పుడు దేశంలో ఓబీసీ ల జనాభా 52 శాతంగా వెల్లడించారన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ.. దేశంలో ఓబీసీలు ఎంత? వారిలో ఏ కులాల వారు ఎంత మంది ఉన్నారు? వారికి దక్కాల్సిన వాటా ఎంత? అన్న విషయంలో ఏ కేంద్ర ప్రభుత్వమూ కుల గణను జరపకపోవడం గమనించాల్సిన అంశమని చెప్పారు. దళితలు, ఆదివాసీలకు సంబంధించిన జనాభా లెక్కలు, వివిధ ప్రాంతాలు, ప్రభుత్వ సంస్థలు, విద్యా సంస్థల్లో వారి వాటాకు సంబంధించి కచ్చితమైన లెక్కలు అందుబాటులో ఉన్నాయి. కానీ, ఓబీసీల విషయంలో మాత్రం స్పష్టమైన లెక్కలు జాతీయ స్థాయిలో అందుబాటులో లేకపోవటం ఆందోళనకరమన్నారు. దేశంలో 1970వ దశకంలో ఆధిపత్య వ్యవసాయ కులాల రాజకీయ శక్తి నవ హక్కుదారులుగా ఆవిర్భవించాయని నిపుణులు చెప్పారు. ఆ సమయంలో రాజకీయాలను, ప్రజలను సోషలిజం ఆకట్టుకున్నదన్నారు. నిమ్న కులాలు, దళితులను ప్రత్యేకించి ఉత్తర భారతదేశ రాష్ట్రాలలో రాజకీయాల్లోకి తీసుకొచ్చిందని చెప్పారు. లాలూ ప్రసాద్ యాదవ్, చౌదరీ దేవీ లాల్, ములాయం సింగ్ యాదవ్, రామ్ విలాస్ పాశ్వాన్, శరద్ పవార్ వంటి ఇతర ఓబీసీ ఫైర్ బ్రాండ్ నాయకులను తయారు చేసిందనీ, భారత రాజకీయ యవనికపై వీరి ప్రభావాన్ని తప్పనిసరి అయ్యేలా చేసిందని నిపుణులు తెలిపారు. సామాజిక న్యాయం అనేది ప్రజాస్వామ్యాన్ని అణగారిన ప్రజలకు మరింత చేరువయ్యేలా చేసిందన్నారు. కానీ, 1951లో జనసంఫ్ుతో మొదలైన కాషాయ రాజకీయం బీజేపీ ఆవిర్భావంతో తీవ్ర రూపం దాల్చిందని నిపుణులు చెప్పారు. ఈ రాజకీయాలు కేవలం ఉన్నత వర్గాలకు లబ్దిని చేకూరుస్తాయని ఆ రోజుల్లోనే పలువురు నిపుణులు ముందుగానే అంచనా వేశారు. రాజకీయాల్లో దళితులు, బహుజనులు (ఓబీసీ) ప్రయోజనాలకు విరుద్ధంగా పని చేస్తాయన్నారు. అనుకున్నట్టుగానే సామాజిక న్యాయ రాజకీయాలు వాటి ప్రాభవాన్ని కోల్పోయాయని నిపుణులు చెప్పారు. బీజేపీ రెచ్చగొట్టే మతతత్వ, జాతీయవాద దూకుడు రాజకీయాలు అణగారిన వర్గాల ప్రజలను ఆకర్షించడం.. వారిని సామాజిక న్యాయం, అధికారం నుంచి దూరం చేశాయని తెలిపారు.
కేవలం హిందూత్వతోనే ఓబీసీల ఓట్లు రాలవని గుర్తించిన బీజేపీ రూటు మార్చిందన్నారు. ఓబీసీలలో కింది కులాలనూ టార్గెట్ చేస్తూ సంస్కృతి పేరుతో బీజేపీ వ్యూహాన్ని రచించిందని తెలిపారు. ఓబీసీలో కొన్ని కులాలే రాజకీయ ప్రయోజనాలను అనుభవిస్తున్నాయనీ, మిగతా కులాలకు అధికారం దక్కటం లేదని విభజించు, పాలించు సూత్రాన్ని అమలు చేసిందని చెప్పారు. అంటే.. యూపీ, బీహార్, హర్యానా, ఎంపీ వంటి రాష్ట్రాల్లో యాదవేతర కులస్థులను, కిందిస్థాయి దళిత-ఓబీసీలను టార్గెట్ చేసి వారి మద్దతు సంపాదించటంలో బీజేపీ సక్సెస్ అయిందని తెలిపారు. దీంతో ఆ సామాజిక వర్గాల ప్రజలు ఆర్జేడీ, సమాజ్వాదీ పార్టీలకు దూరమై బీజేపీని విశ్వసించటం మొదలు పెట్టారని నిపుణులు చెప్పారు. దేశంలో బీజేపీ రాజకీయంగా లబ్ది పొంది అతిపెద్ద రాజకీయ శక్తిగా అవతరించిందనీ, ఓబీసీ ల జీవితాల్లో మాత్రం మార్పు రాలేదనీ, సాధికారత కలగానే మిగిలిందని అన్నారు. బీహార్లో ఆర్జేడీ-జేడీయూల కలయిక ఆహ్వానించదగిన పరిణామామే అయినా.. ఇతర ఓబీసీల ఓట్లపై దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని రాజకీయ నిపుణులు నొక్కి చెప్పారు. వివిధ రాష్ట్రాల్లో ఓబీసీ సంఖ్యా బలం గురిం చిన సమాచారం ఎంతో ముఖ్యమనీ, కుల గణనతోనే ఇది సాధ్యమని నిపుణులు తెలిపారు. ఈ విషయంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు, కుల సంఘాలు మోడీ సర్కారుపై మరింత ఒత్తిడిని పెంచాలని సూచించారు.