Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్థిక వ్యవస్థ వృద్ధి 7 శాతంగా అంచనా
- కేంద్రం లెక్కలపై నిపుణుల ఆశ్చర్యం
- ప్రజల్లో కొనుగోలు శక్తి లేనపుడు వృద్ధి సాధ్యం కాదని స్పష్టీకరణ
న్యూఢిల్లీ : దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి అంకెల గారడీతో మోడీ ప్రభుత్వం మాయ చేస్తున్నది. దేశ ఆర్థిక వ్యవస్థ అంచనాల్లో ఉన్నంత బలంగా బయటకు మాత్రం కనపించటం లేదు. భారత్‌లో కుటుంబాల ఆదాయం మాత్రం పెరగటం లేదు. కొనుగోలు శక్తి క్షీణించి ఉక్కిరిబిక్కిరవు తున్నాయి. ప్రజల చేసే ఖర్చులే దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధిని పెంచుతాయనీ, ఇలాంటి పరిస్థితుల్లో దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందిందని ఎలా చెప్పగలుగుతామని ఆర్థిక నిపుణులు తెలిపారు. మోడీ అనుకూల మీడియా చేసే అతి ప్రచారం, సోషల్ మీడియాలో బీజేపీ అనుకూల వర్గాలు చేసే అసత్య ప్రచారాలు.. దేశ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2022-23లో భారత ఆర్థిక వ్యవస్థ ఎంత వృద్ధి చెందుతుందనే అంచనాను ప్రభుత్వం ఇటీవల విడుదల చేసింది. మొదటి ముందస్తు అంచనా ప్రకారం ఆర్థిక వృద్ధి గతేడాది కంటే 7 శాతం అధికంగా ఉన్నది. 2023-24కు సంబంధించి ఫిబ్రవరి 1న పార్లమెంటులో కేంద్రం ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌కు అంతా సానుకూలంగా ఉండే విధంగా ఈ గణాంకాలు ఉన్నాయని నిపుణులు తెలిపారు. ఈ అంచనాలు స్థిరంగా ఉండవనీ, సమయాన్ని బట్టి మారుతుంటాయని చెప్పారు. అయితే, ఈ అంచనా గణాంకాలు వాస్తవ స్థితిని ప్రతిబింబించటం లేదని తెలిపారు. ప్రజల ముందు కేంద్రం ప్రతిష్టను కాపాడుకునే చర్యల్లో భాగమే ఈ అంచనాలని చెప్పారు. ప్రభుత్వ అంచనాల ప్రకారం.. ప్రయివేటు తుది వినియోగ వ్యయం (పీఎఫ్‌సీఈ) అంటే గృహాలు, ఇతర ప్రయివేటు సంస్థలు చేసే మొత్తం ఖర్చు, మొత్తం 2022-23లో జీడీపీలో 57.2 శాతంగా నిర్ణయించబడింది. గత ఏడాది అంటే 2021-22లో ఇది జీడీపీలో 56.9 శాతం. ఇది ఒక సానుకూల అంశమనీ, ప్రజల ఖర్చు దేశ ఆర్థిక వ్యవస్థను నడిపిస్తుందని తెలిపారు. మరొక సంవత్సరం క్రితం అంటే 2020-21లో సవరించిన అంచనాల ప్రకారం జీడీపీలో పీఎఫ్‌సీఈ వాటా 57.3 శాతంగా ఉన్నది. 2021-22లో ప్రయివేటు వ్యయం తగ్గింది. ప్రస్తుతం సంవత్సరంలో కొంచెం పెరిగింది. 2020-21 మొదటి మహమ్మారి సంవత్సరం కంటే ప్రస్తుత పీఎఫ్‌సీఈ తక్కువగా ఉండటం గమనించాల్సిన అంశం. కరోనా మహమ్మారి కాలంలో ఆర్థిక వ్యవస్థ మందగించి, ప్రజలలో కొనుగోలు శక్తి లేదని.. అయితే, ప్రస్తుతం అలాంటి పరిస్థితులేవీ లేనప్పటికీ ప్రజల ఖర్చు తగ్గిపోయిందన్నారు. ప్రజల ఖర్చులు లేనప్పుడు.. దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి ఎలా సాధించగలుగుతుందని నిపుణులు ప్రశ్నించారు. ఇతర చర్యలతో పాటు వివిధ సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించడం ద్వారా ఖర్చులను పెంచి చూపి అంచనాలను కేంద్రం తనకు సానుకూలంగా మలుచుకుంటున్నదని చెప్పారు. ప్రజల చేతుల్లో డబ్బు, ఖర్చులు లేనప్పుడు నమోదయ్యే ఆర్థిక వృద్ధి సంపూర్ణమైంది కాదని తెలిపారు. ప్రభుత్వ తుది వినియోగ వ్యయం (జీఎఫ్‌సీఈ) ప్రస్తుతం సంవత్సంరలో 10.3 శాతంగా అంచనా వేయబడిందని వివరించారు. సంక్షేమ, అభివృద్ధి పథకాల పేరుతో ప్రభుత్వం విచ్చలవిడిగా ఖర్చు చేసిందని తెలిపారు. అయితే, అసలైన వృద్ధి ప్రయివేటు ఖర్చులు పెరిగినపుడే సాధ్యమవుతుందని నిపుణులు అన్నారు. పీఎఫ్‌సీఈ, జీఎఫ్‌సీఈ ల మధ్య అంతరం అధికంగా ఉన్నదని తెలిపారు. 2021-22 ద్వితీయార్ధంతో పీఎఫ్‌సీఈ రూ. 45.9 లక్షల కోట్లు కాగా.. ప్రస్తుతం రెండో అర్ధభాగంలో రూ. 45.8 లక్షల కోట్లుగా ఉన్నది. ఈ అంచనాలు చెప్తున్నదేమిటంటే.. ప్రస్తుత సంవత్సరం ద్వితియార్థంలో గృహ వ్యయం తగ్గుతుంది. ఇది కఠిన పరిస్థితిని సూచిస్తుందని నిపుణులు చెప్పారు.