Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిరంతర పోరాటాలు కొనసాగించాలి
- పెట్టుబడిదారీ వ్యవస్థపై క్యూబా సాగిస్తున్నదే అదే : చెగువేరా కుమార్తె డాక్టర్ అలైదా గువేరా
శ్యామల్ చక్రవర్తి నగర్ నుంచి నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి
ప్రజల మధ్య ఐక్యతతోనే సామ్రాజ్యవాదంపై గెలుపు సాధ్యమవుతుందని చెగువేరా కుమార్తె డాక్టర్ అలైదా గువేరా నొక్కిచెప్పారు. ఆ ఐక్యత కోసం ప్రపంచవ్యాప్తంగా మరింత కృషి పెరగాలని ఆకాంక్షించారు. బెంగుళూరులోని శ్యామల్ చక్రవర్తినగర్(ప్యాలెస్ గ్రౌండ్)లోగల కామ్రేడ్ రంజనా నిరులా, కామ్రేడ్ రఘునాథ్ సింగ్ వేదికలో జరుగుతున్న సీఐటీయూ అఖిల భారత 17వ మహాసభ రెండో రోజైన గురువారం అలైదా గువేరా, ఆమె కుమార్తె ప్రొఫెసర్ ఎస్తిఫినా గువేరా ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు.
పోరాట యోధుడి కుమార్తె సీఐటీయూ మహాసభకు హాజరవ్వడంతో హాజరైన ప్రతినిధులు, ఇతర సభ్యులు ఆమెకు జేజేలు పలికారు. చెగువేరా అమర్హై..అప్ అప్ సోషలిజం...డౌన్‌డౌన్ క్యాప్టలిజం...వర్కర్స్ యూనిటీ జిందాబాద్..సీఐటీయూ జిందాబాద్ అని పెద్ద పెట్టున నినాదాలు చేశారు. సీఐటీయూ ప్రధాన కార్యదర్శి తపన్‌సేన్ ఆమెను వేదికపైకి ఆహ్వానించారు. అనంతరం ఆమె ప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగించారు. పెట్టుబడిదారీ విధానంలో కార్మిక సమస్యలు ఎక్కడైనా ఒకే విధంగా ఉంటాయని చెప్పారు. అయితే ప్రజల మధ్య ఐక్యతను తీసుకొచ్చి, సమీకరించి పోరాటం సాగించడం ద్వారా అనుకున్న లక్ష్యాలను సాధించడానికి వీలవుతుందని నొక్కిచెప్పారు. అదే ఇప్పుడు క్యూబాలో చేస్తున్నట్టు చెప్పారు. ప్రపంచ పెట్టుబడిదారీ దేశమైన అమెరికాకు కేవలం 90 మైళ్ల దూరంలోనే చిన్న దేశంగానున్న క్యూబా దాన్ని ఎదిరించి ఇంతకాలంగా నిలబడిందంటే అక్కడి ప్రజల చైతన్యం, సహకారం, ఐక్యతతోనే సాధ్యమైందని వివరించారు. అయినా, అమెరికా నుంచి క్యూబాపై దాడి ఆగడం లేదనీ, ఆర్థిక, ఇతర దేశాల నుంచి సహకారం అందకుండా నిర్భందాన్ని పెంచుతున్నదని తెలిపారు. మరోవైపు కోవిడ్‌తో దేశ ఆర్థిక పరిస్థితి దిగజారిందన్నారు. తమ దగ్గరా కొన్ని లోపాలున్నాయనీ, వాటినుంచి గుణపాఠాలు నేర్చుకుంటూ ముందుకు సాగుతున్నామని చెప్పారు. వాటి నుంచే సమాధానాలు వెతుక్కోవాలన్నారు. క్యూబా పోరాటం ముందుకు సాగాలంటే ప్రపంచ దేశాలు తమకు అండగా నిలవాల్సిన అవసరం నెలకొందని చెప్పారు. అమెరికా ఏమిచేసినా తమ దేశ ప్రజలు ఐక్యతతో పోరాడేందకు సిద్ధమై ఉన్నారన్నారు. నార్త్ అమెరికాలోనూ సోషలిస్టు వ్యవస్థను విస్తరింపజేస్తామనే నమ్మకం తమకు ఉందని ఘంటాపథంగా చెప్పారు. విజయం సాధించేవరకూ నిర్దేశించుకున్న లక్ష్యానికి కట్టుబడి ఉండాలని నొక్కిచెప్పారు. భారతదేశంలోనూ కార్మిక సమస్యలపై అందర్నీ ఏకం చేయాలని సూచించారు. వర్కింగ్ క్లాస్ వ్యక్తే ఇతరుల మీద సానుభూతిని కలిగి ఉంటారనీ, వారే ప్రజల సమస్యలను అర్థం చేసుకోగలుగుతారని చెప్పారు. మనుషులందరూ సమానమేనని నొక్కిచెప్పారు. రంగు, రూపు, మతం, సంస్కృతిని బట్టి మనుషులను విభజించి చూడొద్దని కోరారు. కొన్ని అంశాల్లో భిన్నాభిప్రాయాలున్నప్పటికీ ఐక్యపోరాటాలకు అవి అటంకంగా మారకుండా చూసుకోవాలని కోరారు. ప్రధానమైన అంశాలపై అందర్నీ ఏకం చేసి పోరాటంలోకి దింపాలని పిలుపునిచ్చారు. పోరాటం ద్వారానే గెలుపు సాధ్యమనే విషయాన్ని గ్రహించాలన్నారు. అలైదా గువేరా ప్రసంగం అనంతరం సీఐటీయూ అఖిలభారత అధ్యక్షులు డాక్టర్ కె.హేమలత తలపాగా పెట్టి సత్కరించారు.
సవాళ్లను ఎదురొడ్డి పోరాడుదాం
ఐద్వా అఖిల భారత అధ్యక్షులు పీ.కే శ్రీమతి
'దేశంలో నేడు అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. కులం, మతం, ప్రాంతం, భాష పేర్లతో ప్రజలను విడగొట్టి పాలకులు రాజకీయ లబ్ది పొందుతున్నారు. దీన్ని తిప్పికొట్టాలి. పాలకుల నుంచి ఎదురవుతున్న సవాళ్లను ఎదురొడ్డి పోరాడుదాం' అని ఆలిండియా డెమోక్రటిక్ ఉమెన్ అసోసియేషన్(ఐద్వా) అఖిలభారత అధ్యక్షులు పీ.కే.శ్రీమతి పిలుపునిచ్చారు. శ్యామల్ చక్రవర్తి నగర్(బెంగుళూరు)లోని రంజనానిరులా, రఘునాథ్ సింగ్ వేదిక మీద జరుగుతున్న సీఐటీయూ అఖిల భారత 17వ మహాసభలో గురువారం ఆమె సౌహార్ధ్ర సందేశాన్ని ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా, కార్మిక, కర్షక వ్యతిరేక పోరాటాల్లో మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని చెప్పారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ఆర్ఎస్ఎస్ మనువాదాన్ని ప్రజల్లోకి జొప్పిస్తున్నాయని విమర్శించారు. మహిళలపై దాడులు తీవ్రమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. సమానత్వం కోసం పోరాడుతున్నామన్నారు. దేశంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఐద్వా, సీఐటీయూ ఐక్యంగా పోరాటాలు చేయాల్సిన ఆవశ్యకత ఉందని నొక్కిచెప్పారు.
ఇబ్రహీం బారు..షుక్రియా...
- ల్యాప్‌టాప్‌ను భద్రంగా తిరిగి తెచ్చి ఇచ్చిన ఆటోడ్రైవర్
- ఆయన్ను అభినందించిన సీఐటీయూ నేతలు
ఆ మార్గంలో సీఎం వెళ్తున్నాడని పోలీసుల హడావిడి...తొందరగా ఆటో దిగాలంటూ ఆటోవాలా వేడుకోలు..హడావిడిగా ఆటో దిగేక్రమంలోనే ల్యాప్‌టాప్ బ్యాగ్ అందులో వెనకాలే ఉండిపోయింది. నిమిషంలోపే ఆటోను అనుసరించినా రెండు ఫ్లైఓవర్లు, ఓ క్రాస్ రోడ్డు ఉండటంతో లాభం లేకపోయింది. ఆటో అడ్డా వద్దకెళ్లి విచారించినా..అతను ఆ అడ్డావాడు కాకపోవడంతో ఫలితం లేకుండా పోయింది. పోలీసులు కంట్రోల్ రూమ్‌కి ఫోన్ చేసి విషయాన్ని చెప్పారు.
ఇలా గంటన్నర గడిచిపోయింది. ట్రాఫిక్ పోలీసుల సహాయంతో.. ఆటో ఎక్కిన ప్రాంతంలో సీసీ ఫుటేజీల పరిశీలనలో ఉండగానే..బాధితునికి అటువైపు నుంచి ఫోన్...కె.ఎన్. హరినేనా? మీ ల్యాప్‌టాప్ సీఐటీయూ కాన్ఫరెన్స్ రిసెప్షన్ కౌంటర్లో ఉంది. ఆటోవాలా మీ బ్యాగ్‌ను నిజాయితీగా తెచ్చి ఇచ్చాడు. ఇక్కడకు రండి' అంటూ పెట్టేశాడు. ల్యాప్‌టాప్‌లోని విలువైన డాటా పోయిందన్న తీవ్రబాధలో ఉన్న నవతెలంగాణ దినపత్రిక ఫొటోగ్రాఫర్ కె.ఎన్.హరికి ప్రాణం లేచివచ్చినట్టయింది. వెంటనే సీఐటీయూ 17వ మహాసభ జరుగుతున్న ప్రాంగణానికి వెళ్లాడు. ఆటోవాలా ఇబ్రహీం బారుని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. చిన్న వస్తువు దొరికితేనే పట్టికెళ్లిపోయే క్రమంలో బ్యాగులో 60వేల విలువైన ల్యాప్‌టాప్, విలువైన వస్తువులున్నప్పటికీ ఎలాంటి దురాశకు గురికాకుండా తెచ్చివ్వటం పట్ల సీఐటీయూ సభా ప్రాంగణంలోని పలువురు. నేతలు ఆటోవాలను అభినందించారు. 'వెనకాల ఆటోలో ల్యాప్‌టాప్ ఉండిపోయింది. నేనూ చూసుకోలేదు. మీరు ఆటో దిగిపోగానే ఇద్దరు ప్యాసింజర్లు అడిగితే బాడిగకు వెళ్లాను. వాళ్లను దించిన తర్వాత ఆటోలో చూస్తే బ్యాగు కనిపించింది. ప్రాణం గడబిడ అయింది. ప్యాలెస్గ్రౌండ్ నాలుగో గేటు..సీఐటీయూ సమ్మేళనానికి వచ్చామన్న మీ మాటలు గుర్తుకొచ్చాయి. వెంటనే ఆటోను ప్యాలెస్గ్రౌండ్ వద్దకు తీసుకొచ్చాను. కొద్దిసేపు అటూ ఇటూ తిరిగాను. ముందుకొస్తే అక్కడ రిసెప్షన్ కమిటీ బోర్డు కనిపించింది. వెంటనే అక్కడ సమాచారం ఇచ్చాను. అప్పటికే ల్యాప్‌ట్యాప్ ఆటోలో మిస్ అయ్యిందని మీరు సమాచారం ఇచ్చినట్టు వారు తెలిపారు. ల్యాప్‌టాప్ తిరిగి ఇచ్చినందుకు సంతోషంగా ఉంది' అని బెంగుళూరుకు చెందిన ఇబ్రహీంబారు చిరునవ్వుతో చెప్పారు. ఆటోడ్రైవర్‌ను కలిసి అభినందనలు తెలిపిన వారిలో తెలంగాణకు చెందిన సీఐటీయూ సీనియర్ నాయకులు పి.రాజారావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేశ్, కర్నాటక భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహంతోష్, తదితరులున్నారు.
మహాసభ ప్రాంగణంలో ఎగ్జిబిషన్
- ప్రారంభించిన సీఐటీయూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.హేమలత, తపన్‌సేన్
- ఆకట్టుకున్న ఫొటోగ్యాలరీ, పుస్తకప్రదర్శనశాలలు
- త్రిపుర, కేరళలో వామపక్ష ఉద్యమాలపై ప్రత్యేక గ్యాలరీ
బెంగుళూరులోని శ్యామల్ చక్రవర్తి నగర్‌లోని సీఐటీయూ అఖిల భారత మహా సభల ప్రాంగణం వెలుపల ఎగ్జిబిషన్‌ను సీఐటీయూ అఖిల భారత అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డాక్టర్ కె.హేమలత, తపన్‌సేన్ గురువారం ప్రారంభించారు. హిట్లర్ నియం తృత్వం, ఆనాటి ప్రజల దుర్భర జీవితాలను కండ్లకు కట్టినట్టు చూపేలా ఫొటో ఎగ్జిబిషన్‌ను సుదీశ్ ఏర్పాటు చేశారు. ఆ ఫొటో ఎగ్జిబిషన్‌ను సీఐటీయూ జాతీయ ఉపాధ్యక్షులు ఏకే పద్మ నాభన్ ప్రారంభించారు. మళయాలళ, కన్నడ, నవతెలంగాణ పుస్తక ప్రదర్శనలను తపన్‌సేన్, కె.హేమలత, సీఐటీయూ కర్నాటక అధ్యక్షులు వరలక్ష్మి, ఉమేశ్, తదితరులు ప్రారంభించారు. కన్నడ భాషలో ఏర్పాటు చేసిన కేరళ, త్రిపుర, కర్ణాటక రాష్ట్రాల్లో వామపక్షాలు బలపడిన తీరు ను వివరించారు. త్రిపురలో వామపక్ష ప్రభుత్వం ఉన్న సమయంలో ట్రైబల్స్ అభివృద్ధి కోసం, అక్షరాస్యత పెంచేందుకు చేసిన కృషిని తెలిపేలా ఏర్పాటు చేశారు. నవతెలంగాణ బుకహేౌస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శన శాలలో తపన్‌సేన్, కె.హేమలత కలియ తిరిగా రు. పుస్తకాలను పరిశీలించారు. ఎగ్జిబిషన్‌ను మహాసభ ప్రతినిధులు ఆసక్తిగా తిలకించారు.