Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రతిఘటనతో ప్రయివేటీకరణ వెనుకడుగు
- 17వ మహాసభలో అన్ని అంశాలపై సాగుతున్న చర్చలు
- వివరాలు వెల్లడించిన ప్రధాన కార్యదర్శి తపన్‌సేన్
బెంగళూరు నుంచి అచ్చిన ప్రశాంత్
మతతత్వ, సరళీకరణ విధానాలు అనుసరిస్తున్న బీజేపీ ప్రభుత్వానికి త్రిముఖ పోరు (రైతులు, వ్యవసాయ కూలీలు, కార్మికుల ఐక్యంగా)తో అడ్డుకట్ట వేసేందుకు సీఐటీయూ అఖిల భారత 17వ మహాసభ ప్రణాళికను రచిస్తున్నదని సీఐటీయూ అఖిల భారత ప్రధాన కార్యదర్శి తపన్‌సేన్ పేర్కొన్నారు. బెంగుళూరు నగరంలోని ప్యాలెస్ గ్రౌండ్స్‌లోని శ్యామల్ చక్రవర్తి నగర్లో రెండు రోజులుగా జరుగుతున్నాయి. మహాసభలో చర్చిస్తున్న అంశాల గురించి ఆయన మీడియాకు వివరించారు. 23 రాష్ట్రాలు, పలు కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారని తెలిపారు. సోదర సంఘాలైన బ్యాంకింగ్, బీమా, రైల్వే సంఘాలతో పాటు, రైతు వ్యవసాయ కార్మిక సంఘాలు కూడా ఈ మహాసభలో పాల్గొని తమ మద్దతు తెలిపాయని వివరించారు.
దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాల వల్ల కార్మికులు, ఉద్యోగులు పడుతున్న ఇబ్బందులను ఇందులో చర్చించామని వెల్లడించారు. వాటి పరిష్కారానికి చేసిన కృషిని, పోరాటాలను సమీక్షించుకుంటున్నట్టు తెలిపారు. దేశంలో ఆర్థిక సంక్షోభం రోజురోజుకు ముదురుతున్నదన్నారు. ప్రభుత్వం అనురిస్తున్న సరళీకరణ ఆర్థిక విధానాలు దేశ ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చే విధంగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు ప్రభుత్వ రంగం సంస్థలను ప్రయివేటీకరించే ప్రయత్నాలు ముమ్మరం చేసిందని చెప్పారు. అయితే ప్రయివేటీకరణకు ఉద్యోగుల నుంచి తీవ్రమైన వ్యతిరేకత అన్ని చోట్ల వ్యక్తమైందని గుర్తు చేశారు. ఉదాహరణకు బెంగళూరు నగరంలోనే బీఈఎంఎల్ను ప్రయివేటీకరించేందుకు ప్రయత్నిస్తే ఉద్యోగులు ఉమ్మడిగా ప్రతిఘటించారని తెలిపారు. అదేవిధంగా మహారాష్ట్రలో విద్యుత్‌రంగ సంస్థల ప్రయివేటీకరణకు తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైందన్నారు. దీంతో ప్రభుత్వం ప్రయివేటీకరణపై తాత్కాలికంగానైనా వెనుక్కు తగ్గక తప్పలేదని చెప్పారు. ఈ పోరాటాలకు మరింత పదును పెట్టాలని తమ యూనియన్ భావిస్తోందన్నారు. అదే రకంగా ఇతర రంగాల్లో పనిచేస్తున్న కార్మికులకు అనేక రకాల ఇబ్బందులూ ఉన్నాయన్నారు. వీటిన్నింటిపైనా రాబోయే రోజుల్లో పోరాటాలు మరింత ఉధృతం చేస్తామన్నారు. ఒకవైపు స్వతంత్రంగా పోరాటం సాగిస్తూనే, ఇతర కార్మిక సంఘాలతోనూ కలసి ఐక్యకార్యాచరణతో ముందుకెళ్తామని చెప్పారు. సమావేశంలో సీఐటీయూ కార్యదర్శి ఉమేష్, నాయకులు ఆర్కే రాజ్పే పాల్గొన్నారు.