Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర మంత్రి కుమారుడి బెయిల్‌ను వ్యతిరేకించిన యూపీ ప్రభుత్వం
న్యూఢిల్లీ : లఖింపూర్ ఖేరీ హింస కేసులో నిందితుల్లో ఒకరైన కేంద్రహౌం శాఖ సహాయమంత్రి అజరు కుమార్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా బెయిల్ పిటిషన్‌ను సుప్రీంకోర్టులో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వ్యతిరేకించింది. ఈ పిటిషన్ ను గురువారం న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జెకె మహేశ్వరిలతో కూడిన ధర్మాసనం విచారించింది. ఉత్తరప్రదేశ్ అదనపు అడ్వకేట్ జనరల్ గరిమా ప్రసాద్ వాదనలు వినిపిస్తూ ఇది తీవ్రమైన, ఘోరమైన, దారుణమైన, క్రూరమైన నేరమని అన్నారు. ఎనిమిది మరణానికి కారణమైన వ్యక్తికి బెయిల్ ఇస్తే సమాజంలోకి తప్పుడు సంకేతం వెళ్తుందని అన్నారు.
ఘోరమైన నేరానికి సంబంధించి రెండు వెర్షన్లు ఉన్నాయనీ, ఏ వెర్షన్‌పైనా వ్యాఖ్యానించలేమని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. ఈ కేసు విచారణ ముగియడానికి ఐదేండ్లు పట్టవచ్చని, నిందితులకు నిరవధిక కారాగారవాసం ఉండదని ధర్మాసనం పేర్కొంది. ఫిర్యాదుదారుల్లో ఒకరి తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే స్పందిస్తూ 2020 ఢిల్లీ అల్లర్లకు సంబంధించి జైలులో మగ్గుతున్న నిందితులకు ఇదే చట్టాన్ని వర్తించాలని అన్నారు. ''ఆయన ఈ కేసులో ఉన్నాడని మేం భావిస్తున్నాం. కానీ, ఇంత పెద్ద కేసులో ఆధారాలను నాశనం చేయాలని అతను ప్రయత్నిస్తున్నాడా?'' ధర్మాసనం ప్రశ్నించింది. ఇప్పటిదాకా అలాంటిదేం జరగలేదని గరిమా ప్రసాద్ తెలపగా, ఆ వెంటనే బాధిత కుటుంబాల తరఫున వాదిస్తున్న సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే ధర్మాసనం ముందు తీవ్ర ఆరోపణలే చేశారు. బెయిల్ మంజూరు చేయడం వల్ల సమాజానికి భయంకరమైన సందేశం పంపుతోందని అన్నారు. ''ఇది కుట్ర, పక్కా ప్రణాళికతో జరిగిన హత్య.. చార్జిషీట్లో చూపిస్తాను. పవర్ఫుల్ వ్యక్తి కొడుకు. అంతే శక్తివంతమైన లాయర్లను ఈ కేసులో నియమించుకున్నారు'' అని అన్నారు. ఈ తరుణంలో ఆశిష్ మిశ్రా తరఫున వాదనలు వినిపిస్తున్న సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ ....దవే వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ''ఎవరు శక్తివంతమైన వాళ్లు? ఏం మాట్లాడుతున్నారు? ప్రతీ రోజూ మేం కోర్టులో వాదనలు వినిపిస్తున్నాం. బెయిల్ నిరాకరించడానికి ఇదొక కారణమేనా? అని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇప్పటికే తన క్లయింట్ ఏడాది కంటే ఎక్కువ కాలం కస్టడీలో ఉన్నారని, విచారణ ఇలాగే కొనసాగితే ఏడు నుంచి ఎనిమిదేళ్లు పట్టవచ్చని అన్నారు. ఈ వ్యవహారంలో ప్రధాన ఫిర్యాదుదారు అయిన జగ్జీత్ సింగ్ ప్రత్యక్ష సాక్షి ఏమాత్రం కాదని, కేవలం ఎవరో చెప్పింది విని ఫిర్యాదు చేశాడని అన్నారు. ఎలాంటి నేర చరిత్ర లేని తన క్లయింట్ కు బెయిల్ ధర్మాసనాన్ని కోరారు. ''నా క్లయింట్‌కు తొలిదశలో బెయిల్ వచ్చింది. ఇది కాక్ అండ్ బుల్ స్టోరీ కాదు, నా కథనంలో నిజం ఉంది'' అని రోహత్గీ అన్నారు. తన క్లయింట్ నేరస్థుడు కాదని, గత రికార్డులు లేవని అన్నారు. విచారణను ముగించిన ధర్మాసనం తీర్పు రిజర్వ్ చేసింది.