Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తగ్గిన వైద్య సిబ్బంది సంఖ్య
- సరిపడా వైద్యులు, నర్సులు లేక అవస్థలు
- దేశవ్యాప్తంగా ఆరోగ్య కేంద్రాల్లో ఇవే పరిస్థితులు
- ఆర్హెచ్ఎస్ 2020-21 సమాచారం
భారత్‌లో ఆరోగ్య రంగం ఇప్పటికే అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నది. ముఖ్యంగా గ్రామీణ భారతంలో ఇది కనిపిస్తున్నది. కరోనా మహమ్మారి కాలంలో ఇది స్పష్టంగా బయటపడింది. సరిపడా సిబ్బంది, మౌలిక సదుపాయాలు లేకపోవడంతో ప్రజలు నానా నరకయాతనను అనుభవించారు. గ్రామీణ ప్రాంతాల్లో మానవ వనరులు తగ్గిపోయాయి. ముఖ్యంగా, గ్రామీణ ఆరోగ్య రంగంలో కీలక పాత్రను పోషించే ఆరోగ్య ఉప కేంద్రాలు (ఎస్సీలు), ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్‌సీలు), కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు (సీహెచ్‌సీలు)లు కిందటేడాది (2020-21) కంటే తక్కువ సిబ్బందితో పని చేశాయని 'గ్రామీణ ఆరోగ్య గణాంకాలు (ఆర్హెచ్ఎస్) 2021-22' లో తేలింది.
న్యూఢిల్లీ : ఆర్హెచ్ఎస్ 2021-22 ప్రకారం.. గతేడాది మార్చిలో ఉప కేంద్రాల్లో ఏఎన్ఎంల సంఖ్య 2,07,587గా ఉన్నది. 2021 మార్చిలో ఈ సంఖ్య 2,14,820గా ఉండటం గమనార్హం. అదే విధంగా, పీహెచ్సీలలో వైద్యుల సంఖ్య కూడా పడిపోయింది. 2021-22లో పీహెచ్సీలలో వైద్యుల సంఖ్య 30,640గా ఉన్నది. 2021లో ఈ సంఖ్య 31,716 గా ఉండటం గమనించాల్సిన అంశం. 2021-22లో భారత్ కరోనా మహమ్మారితో పోరాడుతున్న సమయంలోనే సిబ్బంది సంఖ్య కిందటేడాదితో పోలిస్తే పడిపోయింది. దేశానికి అంతపెద్ద ఉపద్రవం ముంచుకొస్తుందన్న విషయాన్ని పసిగట్టడంలో విఫలమైన మోడీ సర్కారు.. గ్రామీణ ఆరోగ్య రంగంలో వైద్య సిబ్బంది కొరతను పూడ్చలేకపోయిందని ఆరోగ్య రంగం నిపుణులు తెలిపారు.గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సంరక్షణ విషయంలో ఉప కేంద్రాల పాత్ర కీలకమైనది. ప్రతి ఐదు వేల మందికి ఉండే ఒక ఉప కేంద్రంలో ఒక ఏఎన్ఎం, ఒక పురుష హెల్త్‌కేర్ వర్కర్ ఉంటారు. ఆ తర్వాత పీహెచ్‌సీల వంతు. ప్రతి 30వేల మందికి ఉండే ఒక పీహెచ్సీలో నాలుగు నుంచి ఆరు బెడ్లు, ఒక వైద్యాధికారి ఇంచార్జీగా, సిబ్బంది ఉండాలి. గ్రామీణ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో అతి కీలకమైనది సీహెచ్‌సీ. ప్రతి 1.20 లక్షల మందికి ఒక సీహెచ్‌సీ ఉండాల్సి ఉన్నది. కేంద్ర ప్రభుత్వం పొందుపర్చిన నిబంధనల మేరకు సీహెచ్సీలలో తప్పనిసరిగా 30 బెడ్లు, లేబర్ రూమ్‌లు, ఆపరేషన్ థియేటర్లు, ప్రత్యేక సేవలు ఉండాలి. అయితే, గ్రామీణ భారతంలో క్షేత్రస్థాయిలో ఇవి పూర్తి విరుద్ధంగా ఉన్నాయని నిపుణులు చెప్పారు.
సీహెచ్‌సీ, పీహెచ్సీ లలో ల్యాబ్ టెక్నీషియన్ల సంఖ్య 2022లో స్వల్పంగా 50 మంది మాత్రమే పెరిగి 22వేల మందికి పైగా పని చేస్తున్నారు. నర్సింగ్ సిబ్బంది 79,044 మంది నుంచి 79,933 వరకు, రేడియో గ్రాఫర్ల సంఖ్య 2,418 నుంచి 2,448 వరకు స్వల్పంగా పెరిగాయి.
యూపీ, బీహార్, జార్ఖండ్ వంటి రాష్ట్రాల్లో మాత్రం పరిస్థితులు మరింత కఠినంగా ఉన్నాయి. అక్కడ ప్రతి ఏడు వేల మందికి పైగా ప్రజలు ఒక ఎస్సీపై మాత్రమే ఆధారపడుతున్నారు. భారత్‌లోని పది రాష్ట్రాల్లోనూ ఇవే పరిస్థితులు ఉన్నాయి. ఇక యూపీ, బీహార్, జార్ఖండ్లతో పాటు పశ్చిమ బెంగాల్లో ప్రతి 50 వేల మందికి పైగా ప్రజలు ఒక పీహెచ్సీ పైనే ఆధారపడుతుండటం గమనార్హం. మరో ఐదు రాష్ట్రాల్లో ఈ సంఖ్య 30వేల నుంచి 50 వేల మధ్య ఉన్నది. కర్నాటక, ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, బీహార్, యూపీ వంటి రాష్ట్రాల్లో 2 నుంచి 5 లక్షల మంది ప్రజలు ఒక సీహెచ్‌సీపై ఆధారపడుతున్నారు. ఈ విషయంలో ప్రభుత్వాలు ముందుచూపుతో ఆలోచించి తగిన చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో దేశ ప్రజలకు మరిన్ని ఇబ్బందులు ఎదురుకాక తప్పవని ఆరోగ్య నిపుణులు హెచ్చరించారు.