Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐక్య పోరాటాలతోనే సాధ్యం
- ఏప్రిల్ 5న కిసాన్ -మజ్దూర్ మార్చ్‌కు మద్దతు
- సీఐటీయూ అఖిల భారత అధ్యక్షులు డాక్టర్ కె.హేమలత
బెంగళూరు నుంచి అచ్చిన ప్రశాంత్
ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో కార్మికులపై దాడి తీవ్రతరం అవుతున్నదని సీఐటీయూ అఖిల భారత అధ్యక్షులు డాక్టర్ కె.హేమలత అన్నారు. ఐక్య పోరాటాల ద్వారానే ఆ దాడిని తిప్పికొట్టగలమని ఆమె తెలిపారు. బెంగళూరులోని శ్యామల్ చక్రవర్తి నగర్లో (కామ్రేడ్ రంజనా నిరులా, రఘునాథ్ సింగ్ వేదిక) కొనసాగుతున్న సీఐటీయూ 17వ అఖిల భారత మహాసభ శుక్రవారం మూడో రోజుకు చేరుకుంది. ఈ మూడు రోజుల్లో చర్చించిన అంశాలను హేమలత మీడియాకు వెల్లడించారు. దేశంలోని కార్మిక సమస్యలతోపాటు, ప్రపంచ వ్యాప్తంగా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటిపైనా మహాసభలో సుదీర్ఘంగా చర్చించామని తెలిపారు. ప్రపంచంలోని పెట్టుబడిదారి దేశాలన్నింటిలోనూ క్రమక్రమంగా కార్మికులపై దాడి పెరుగుతున్నదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అమెరికా, ఫ్రాన్స్, యూకే, ఇటలీ, జర్మనీ ఇలా అన్ని దేశాల్లోనూ కార్మికులపై దాడి పెరుగుతున్నదని గుర్తుచేశారు. దీనికి వ్యతిరేకంగా ఆయా దేశాల్లో కార్మికులు పెద్ద ఎత్తున పోరాటాల్లోకి వస్తున్నారని తెలిపారు. ఫ్రాన్సులో గురువారం నిర్వహించిన నిరసనలో నాలుగు లక్షల మంది ఉద్యోగులు పాల్గొన్నారని వివరించారు. భారతదేశం లోనూ బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలనే అవలంభిస్తున్నదనీ, వాటికి వ్యతిరేకంగా దేశంలోనూ పెద్దఎత్తున వ్యతిరేకత వస్తున్నదని తెలిపారు. బ్యాంకింగు, విద్యుత్, తపాలా, కోల్ ఇండియా ఇలా అనేక విభాగాల్లో పనిచేసే ఉద్యోగులు పెద్దఎత్తున ఇటీవలి కాలంలో పోరాటాలు నిర్వహించారని గుర్తు చేశారు. కార్మికులతోపాటు, రైతులు, వ్యవసాయ కార్మికులకు అనేక సమస్యలున్నాయని తెలిపారు. అందువల్ల వారందరితో విశాల ఐక్య పోరాటాన్ని నిర్మించాలంటూ మహాసభ అభిప్రాయపడిందని వివరించారు. ఆ క్రమంలో ఏప్రిల్ ఐదున ఢిల్లీలో కిసాన్-మజ్దూర్ మార్చ్‌ను నిర్వహించతలపెట్టామని అన్నారు. రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల నాయకులు తమ మహాసభకు హాజరై తమ సంఘీభావాన్ని తెలపటం హర్షణీయమని అన్నారు. బీజేపీయేతర ప్రభుత్వాలున్న రాష్ట్రాలపై కేంద్రం తన దాడిని పెంచిందన్నారు. ప్రధానంగా కార్మికులకు మద్దతుగా ఉంటున్న కేరళలోని ఎల్డీఎఫ్పై ఈ దాడి మరింత అధికంగా ఉందన్నారు. ఇలాంటి చర్యలను ఖండిస్తూ... ఎల్డీఎఫ్ ప్రభుత్వానికి మద్దతునిస్తూ మహాసభలో తీర్మానాన్ని ఆమోదించామని చెప్పారు. శుక్రవారం ఈ రెండు అంశాలపై తీర్మానం చేయడమే కాకుండా నిర్మాణపరమైన అంశాలను లోతుగా చర్చించామని చెప్పారు. సీఐటీయూకు ఇప్పుడున్న శక్తితోపాటు మున్ముందు దేశంలో మరింత బలంగా ఎదగడంపై దృష్టి సారిస్తున్నామని హేమలత ఈ సందర్భంగా వివరించారు. అందుకవసరమైన కార్యాచరణపై కూడా మహాసభలో చర్చిస్తామని అన్నారు. మీడియా సమావేశంలో సీఐటీయూ కర్నాటక రాష్ట్ర కార్యదర్శి ఉమేష్, జాతీయ నాయకులు ఆర్కో రాజ్ పండిట్ పాల్గొన్నారు.