Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఏఏ నిరసనలను క్రూరంగా అణచివేశారు...
- వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్‌కు హాజరుకానున్న నేపథ్యంలో స్విట్జర్లాండ్ అటార్నీ జనరల్‌కు న్యాయవాదుల ప్రత్యేక బృందం ఫిర్యాదు
న్యూఢిల్లీ : యూపీ సీఎం యోగి ఆదిత్యనాధ్‌పై అంతర్జాతీయ క్రిమినల్, మానవహక్కుల న్యాయవాదుల ప్రత్యేక బృందం స్విట్జర్లాండ్ ఫెడరల్ ప్రాసిక్యూటర్ (అటార్నీ జనరల్)కు ఫిర్యాదుచేసింది. దావోస్‌లో నిర్వహిస్తున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్‌కు యోగి ఆదిత్యనాథ్ హాజరుకానున్న సంగతి తెలిసిందే. పౌరసత్వ సవరణ (సీఏఏ)కు వ్యతిరేకంగా శాంతియుతంగా ఆందోళన చేపడుతున్న నిరసనకారులపై 2019 డిసెంబర్ నుంచి 2020 జనవరి మధ్య యూపీలో క్రూరంగా జరిగిన దాడులపై ప్రత్యేక బృందం (గ్వర్నెకా 37 ఛాంబర్) ఫిర్యాదు చేసింది. స్విస్ క్రిమినల్ కోడ్‌లోని ఆర్టికల్ 264 కింద సార్వత్రిక అధికార పరిధి సూత్రాన్ని పేర్కొంది. శాంతియుత నిరసనలను అణిచివేయడం మానవత్వ వ్యతిరేక నేరాలుగా పరిగణించబడుతుందని పేర్కొంది. యూపీ సీఎం, ఆయన పాలన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. సీఏఏ నిరసనలను అణచివేసేందుకు తప్పుడు జైలు శిక్ష, వేధింపులు, పౌరుల హత్యలకు యోగి ప్రభుత్వం ఆదేశించిందని పేర్కొంది. ముస్లిం కమ్యూనిటీపై విస్తృతంగా, క్రమబద్ధంగా దాడులు జరిగినట్లు వెల్లడించింది. ఆరు నెలల పాటు జరిగిన క్రూరమైన దాడుల్లో ముస్లిం కమ్యూనిటీకి చెందిన 22 మంది మరణించగా, 117 మందిని వేధించారనీ, 307 మందిని అకారణంగా నిర్బంధించారని తెలిపింది. ముఖ్యమంత్రి సహా రాష్ట్రంలోని సీనియర్ అధికారులు వేధింపులపై పోలీసులను ఆదేశించారని చెప్పేందుకు తగిన సాక్ష్యాధారాలు ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే యూపీ ముఖ్యమంత్రి ప్రసంగాలను కూడా ఫిర్యాదులో ప్రస్తావించారు. దాడులపై విచారణ చేపట్టాలంటూ బాధిత కుటుంబాలు, మానవహక్కుల సంఘాలు, దేశీయ న్యాయస్థానాలు, ఐరాస సభ్యులు ఇచ్చిన ఆదేశాలను యూపీ అధికారులు బేఖాతరు చేశారని వెల్లడించింది.