Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : కృష్ణా జలాల పంపకంపై దాఖలైన పిటిషన్ల విచారణను సర్వోన్నత న్యాయస్థానం మార్చి 14కి వాయిదా వేసింది.కృష్ణా జలాల పంపకంపై కర్ణాటక 2014లో దాఖలు చేసిన ఒరిజినల్ పిటిషన్ తో పాటు వ్యాజ్యకాలీన దరఖాస్తు(ఐఏ)పై జనవరి 10, 11ల్లో సుప్రీంకోర్టులో సుదీర్ఘ వాదనలు కొనసాగాయి. తెలంగాణ, కర్నాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల తరఫు న్యాయవాదులు ఆయా రాష్ట్రాల వాదనలు వినిపించారు. తాజాగా జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ వి. రామసుబ్రమణియన్ తో కూడిన ద్విసభ్య ధర్మాసనం శుక్రవారం పిటిషన్ల విచారణను చేపట్టాయి. ఇతర పిటిషన్ల విచారణలో తలమునకలుగా ఉన్నందున తరువాత విచారణ చేపడతానని జస్టిస్ సూర్యకాంత్ తెలిపారు. ఈదశలో కర్నాటక, మహారాష్ట్ర తరఫు సీనియర్ న్యాయవాదులు శ్యాం దివాన్, నఫడే త్వరగా కేసు విచారణను పూర్తి చేయాలనీ, ఏండ్ల తరబడి న్యాయస్థానంలో కేసు ఉండిపోతోందని తెలిపారు. తమకు తగిన సమయం కేటాయించాలని తెలంగాణ తరఫు సీనియర్ న్యాయవాది సిఎస్ వైద్యనాధన్ కోరారు. అవసరమైన వివరాల అందజేతకు, తమ వాదనలు వినిపించేందుకు సిద్ధమేనని కేంద్రం తరఫు న్యాయవాదులు తెలిపారు. ఈ దశలో జోక్యం చేసుకున్న జస్టిస్ వి. సూర్యకాంత్ మార్చి 14 నుంచి ఐఏతో పాటు ఒరిజినల్ పిటిషన్ విచారణ చేపడతామంటూ కేసు విచారణను వాయిదా వేశారు.