Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మార్చిలో ప్రారంభం
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో కొత్త పార్లమెంట్ భవన నిర్మాణం చివరి దశకు చేరుకుంది. ఆ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. కొత్త పార్లమెంట్‌కు చెందిన లేఅవుట్, ఫోటోలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. నూతనంగా నిర్మించిన పార్లమెంట్ సముదాయ బిల్డింగ్‌లను బడ్జెట్ సెషన్ రెండవ భాగంలో ఓపెన్ చేసే అవకాశాలు ఉన్నాయి. మార్చిలో ఈ బిల్డింగ్‌లను ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది.సెంట్రల్ విస్టా రీడెవలప్మెంట్ ప్రణాళికలో భాగంగా కొత్త పార్లమెంట్ భవనాన్ని నిర్మిస్తున్నారు. టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ ఈ పనులు చేపడుతోంది. అత్యంత విశాలమైన హాల్స్, లైబ్రరీతో పాటు పార్కింగ్‌కు కావాల్సినంత స్థలాన్ని కల్పిస్తున్నారు. హాల్స్, ఆఫీసు రూములన్నీ ఆధునిక టెక్నాలజీకి తగ్గట్టు నిర్మించారు. కొత్త పార్లమెంట్ భవనంలో 888 సీట్లు కెపాసిటీతో లోక్‌సభ హాల్‌ను నిర్మించారు. ఇక రాజ్యసభ హాల్‌ను లోటస్ థీమ్ తరహాలో నిర్మించారు. రాజ్యసభలో 384 మంది సభ్యులు కూర్చునే రీతిలో కట్టారు.ప్రస్తుతం ఉన్న పార్లమెంట్ భవనాల సమీపంలోనే కొత్త పార్లమెంట్ బిల్డింగ్‌ను నిర్మించారు. అన్ని హంగులతో కాన్స్టిటిట్యూషన్ హాల్‌ను తీర్చిదిద్దారు. లేటెస్ట్ కమ్యూనికేషన్స్ టెక్నాలజీతో అన్ని ఆఫీసుల్ని నిర్మించారు. కమిటీ రూముల్లో అత్యాధునిక ఆడియో విజువల్ సిస్టమ్స్ ఉంటాయి.
నూతన పార్లమెంట్ భవనం విశేషాలు
పార్లమెంటు నూతన భవనానికి హెచ్సీపీ డిజైన్, ప్లానింగ్ అండ్ మేనేజ్మెంట్ ప్రయివేట్ లిమిటెడ్ రూపకల్పన చేసింది. నూతన పార్లమెంట్ భవన నిర్మాణం కోసం రూ.971 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. ఈ భవనానికి ఆరు ప్రవేశ మార్గాలు ఉంటాయి. 1. రాష్ట్రపతి, ప్రధాన మంత్రి, 2. లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ చైర్మెన్, ఎంపీలు, 3. సాధారణ ప్రవేశ మార్గం, 4. ఎంపీల కోసం మరొక ప్రవేశ మార్గం, 5, 6 ప్రజల ప్రవేశ మార్గాలుగా నిర్ణయించారు.ఈ భవనాన్ని నాలుగు అంతస్థులతో నిర్మిస్తున్నారు. 64,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో దీనిని నిర్మిస్తున్నారు. లోక్‌సభ ఛాంబర్లో 888 సీట్లు ఉంటాయి. దీని మొత్తం వైశాల్యం 3,015 చదరపు మీటర్లు. రాజ్యసభ చాంబర్లో 384 సీట్లు ఉంటాయి. దీని వైశాల్యం 3,220 చదరపు మీటర్లు. భూకంపాలను తట్టుకునే విధంగా ఈ నూతన భవనాన్ని నిర్మిస్తున్నారు. ఈ నూతన భవనంలో 120 కార్యాలయాలను ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉంటుంది. కమిటీ సమావేశ మందిరాలు, పార్లమెంటరీ వ్యవహారాల ప్రధాన కార్యాలయాలు, లోక్‌సభ సచివాలయం, రాజ్యసభ సచివాలయం, ప్రధాన మంత్రి కార్యాలయం, కొందరు ఎంపిల కార్యాలయాలు, సిబ్బంది, భద్రతా సిబ్బంది కోసం ప్రత్యేక గదులు ఉంటాయి. ఫర్నిచర్‌లోనే స్మార్ట్ డిస్ప్లేస్ సదుపాయాలు ఉంటాయి. ఒక భాష నుంచి మరొక భాషకు అనువదిండానికి డిజిటల్ సదుపాయాలు ఉంటాయి. ప్రోగ్రామబుల్ మైక్రోఫోన్స్, రికార్డింగ్ సదుపాయాలు ఉంటాయి. సభ్యులు బిల్లులపై సులువుగా ఓటు వేయడానికి వీలుగా బయోమెట్రిక్స్ ఉంటాయి. సాంస్కృతిక వైవిధ్యం కూడా కనిపిస్తుంది. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 200 మందికి పైగా కళాకారులు ఈ నిర్మాణంలో పాలుపంచుకుంటారు. ప్రస్తుత పార్లమెంటు భవనాన్ని పురావస్తు సంపదగా పరిరక్షిస్తారు. 93 ఏళ్ళనాటి ప్రస్తుత పార్లమెంటు భవనానికి బదులుగా ఈ భవనాన్ని నిర్మిస్తున్నారు.
సెంట్రల్ ఫ్లోర్ పై భాగంలో 9,500 కిలోల బరువు, 6.5 మీటర్ల ఎత్తు గల జాతీయ చిహ్నాన్ని కాంస్యంతో తయారు చేసి ఏర్పాటు చేశారు. చిహ్నానికి సపోర్టుగా 6,500 కిలోల బరువున్న ఉక్కుతో కూడిన సహాయక నిర్మాణం చేశారు. ఈ జాతీయ చిహ్నం కాన్సెప్ట్ స్కెచ్, కాస్టింగ్ ప్రక్రియ క్లే మోడలింగ్, కంప్యూటర్ గ్రాఫిక్ నుంచి కాంస్య కాస్టింగ్, పాలిషింగ్ వరకు ఎనిమిది విభిన్న దశల తయారీ సాగింది.