Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్మికులు, కర్షకులు ఒక్కటైతే పాలకవర్గాలు నిలబడలేవ్...
- పెట్టుబడిదారీ విధానమే పెద్ద రోగం..
- మన పోరాటం అధికారం కోసం కాదు..ప్రత్యామ్నాయం కోసం : సీఐటీయూ అఖిల భారత మహాసభలో ఏఐకేఎస్ ప్రధాన కార్యదర్శి విజ్జు కృష్ణన్
శ్యామల్ చక్రవర్తి నగర్(బెంగళూరు) నుంచి నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి
శ్రీలంకను అన్ని రకాలుగా దివాళా తీయించి.. ప్రజల జీవితాలతో ఆటలాడుకున్న అక్కడి డబుల్ ఇంజిన్ సర్కారును ప్రజలు వెనక్కి కొట్టారని అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) ప్రధాన కార్యదర్శి విజ్జు కృష్ణన్ గుర్తు చేశారు. మన దేశంలో కూడా అదే పేరుతో ముందుకొస్తున్న బీజేపీని తిప్పికొట్టాలని కార్మికులు, కర్షకులు, ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. బెంగళూరులోని శ్యామల్ చక్రవర్తి నగర్లోని కామ్రేడ్ రంజనా నిరులా, రఘునాథ్సింగ్ వేదికగా కొనసాగుతున్న సీఐటీయూ అఖిల భారత 17వ మహాసభలో విజ్జు కృష్ణన్ శుక్రవారం సౌహార్థ్ర సందేశమిచ్చారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు చట్టాలకు వ్యతిరేకంగా అన్నదాతలంతా కలిసికట్టుగా పోరాడి ప్రధాని మోడీతో క్షమాపణలు చెప్పించారని గుర్తు చేశారు. వారి పోరాట పటిమ ఆయా చట్టాలను వెనక్కి తీసుకునేలా చేసిందని తెలిపారు. రైతాంగ పోరాటానికి కార్మికులు అండగా నిలబడినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు. మహారాష్ట్రలో విద్యుత్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు పోరాడి విజయం సాధించారని గుర్తుచేశారు. ఇలాంటి పోరాటాలు దేశవ్యాప్తంగానూ మొదలయ్యాయని వివరించారు. భవిష్యత్లో కార్మికులు, కర్షకులు ఐక్యతతో ముందుకు సాగాల్సిన ఆవశ్యకతను ఆయన నొక్కి చెప్పారు. అలా ముందుకు సాగితే పాలకవర్గాలు నిలబడలేవని హెచ్చరించారు.
నయా ఉదారవాద విధానాల వల్ల రైతుల్లో తీవ్ర నైరాశ్యం నెలకొందని చెప్పారు. ఆర్థిక సంస్కరణలు ప్రారంభమైన తర్వాత నాలుగు లక్షల మందికిపైగా అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మోడీ సర్కారు వచ్చాక ఈ ఆత్మహతలు మరింత ఎక్కువయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికలు, అధికారం కోసం కాకుండా ఆధిపత్యవాద ధోరణిని తిప్పికొట్టి ప్రత్యామ్నాయ విధానాల రూపకల్పన, సమాజమార్పు దిశగా పోరాడాలని రైతులకు పిలుపునిచ్చారు. పెట్టుబడిదారీ వ్యవస్థకు వ్యతిరేకంగా మనదేశంలోనేగాక ఫ్రాన్స్, పెరూ, శ్రీలంక దేశాల్లో కొనసాగుతున్న పోరాటాలను విజ్జు కృష్ణన్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. 'పెట్టుబడిదారీ వ్యవస్థ అనేది ప్రజల సమస్యలకు చికిత్సా కాదు.. మందు అంతకంటే కాదు..అదొక పెద్ద రోగం.. అది విస్తరించేకొద్దీ మనుషుల మధ్య అంతరాలు పెరిగిపోతాయి...' అని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
యువతను పక్కదోవ పట్టిస్తున్న బీజేపీ...
డీవైఎఫ్ఐ అఖిల భారత అధ్యక్షులు ఏ.ఏ.రహీం
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం యువతను పక్కదోవ పట్టిస్తున్నదని డీవైఎఫ్ఐ అఖిల భారత అధ్యక్షులు ఏ.ఏ.రహీం అన్నారు. సీఐటీయూ అఖిల భారత మహాసభలో ఆయన సందేశాన్ని ఇచ్చారు. మోడీ పాలనలో ఎన్నడూ లేని విధంగా నిరుద్యోగం పెరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాల హామీని తుంగలో తొక్కారని విమర్శించారు. ఈ నేపథ్యంలో యువత తమ సమస్యలపై పోరాటాల్లోకి రాకుండా మతం పేరుతో కాషాయ పార్టీ.. వారి మెదళ్లల్లో విషం నింపుతు న్నదని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం లోని మోడీ సర్కారు అనుసరిస్తున్న తిరోగమన విధానాలకు ప్రత్యామ్నాయం గా కేరళలో ఎల్డీఎఫ్ ప్రభుత్వం తనదైన అభివృద్ధి, ప్రజా విధానాలతో ముందుకు సాగుతున్న తీరును ఆయన వివరిం చారు. యువతను చైతన్య పరిచేలా పోరాటాలను రూపొంది స్తున్నామని చెప్పారు. సీఐటీయూ, రైతుసంఘం, వ్యవసాయ కార్మిక సంఘం చేసే ఐక్యపోరాటాల్లో తామూ పాలు పంచుకుంటామని చెప్పారు.
బీజేపీని ఓడించడం అత్యంత అవసరం..
ఎస్ఎఫ్ఐ అఖిల భారత అధ్యక్షులు వీపీ సానూ
విధానపరమైన మార్పు కోసం కొనసాగుతున్న పోరాటాల్లో తామూ పాల్గొంటామని ఎస్ఎఫ్ఐ అఖిల భారత అధ్యక్షులు వీపీ సానూ చెప్పారు. ఇప్పుడున్న ప్రమాదకర పరిస్థితుల్లో బీజేపీని ఓడించడం అత్యంత అవసరనమని ఆయన నొక్కి చెప్పారు. బెంగళూరులో కొనసాగుతున్న సీఐటీయూ అఖిల భారత 17వ మహాసభలో ఆయన శుక్రవారం సౌహార్థ్ర సందేశమిచ్చారు. ఇటలీ తరహాలో ఫాసిస్టు విధానాలను భారతదేశంలో ఆమలు చేసేందుకు మతతత్వ శక్తులు కుట్రలు చేస్తున్నాయని చెప్పారు. రంగు, మతం, ప్రాంతం, కులం పేరుతో ప్రజల మధ్య చిచ్చుపెట్టి బీజేపీ రాజకీయ లబ్ది పొందుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. అందులో భాగంగానే నూతన జాతీయ విద్యా విధానాన్ని(ఎన్ఈపీ) కేంద్రం తీసుకొచ్చిందన్నారు. ఎన్ఈపీపై పార్లమెంట్లో కూడా చర్చించలేదని గుర్తు చేశారు. దొడ్డిదారిన దాన్ని మోడీ సర్కారు అమలు చేస్తున్నదని విమర్శించారు. లేబర్ కోడ్లతో కార్మికవర్గాన్ని, నూతన వ్యవసాయ చట్టాలతో రైతులను ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తున్నదని చెప్పారు. ఇలాంటి ధోరణి దేశానికే ప్రమాదకరమని హెచ్చరించారు. ఈ విధానాలను వ్యతిరేకిస్తూ బీజేపీ ఓడించాలనే సంకల్పంతో ముందుకు సాగాలని సానూ పిలుపునిచ్చారు.
ప్రత్యామ్నాయ విధానాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాలి
అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షులు ఎ.విజయరాఘవన్
కేంద్రంలోని బీజేపీ అనుసరిస్తున్న నయా ఉదారవాద, మతోన్మాద విధానాలకు ప్రత్యామ్నాయంగా అభ్యుదయ, అభివృద్ధితో కూడిన విధానాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాల్సిన గురుతర బాధ్యత ఏఐకేఎస్ (రైతులు), ఏఐఏడబ్ల్యూయూ (వ్యవసాయ కార్మికులు), సీఐటీయూ(కార్మికులు)పై ఉందని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షులు ఎ.విజయరాఘవన్ అన్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఆ మూడు సంఘాలు ఐక్య పోరాటాలను ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. బెంగళూరులో కొనసాగుతున్న సీఐటీయూ అఖిల భారత 17వ మహాసభలో ఆయన శుక్రవారం సౌహార్థ్ర సందేశమిచ్చారు. కార్పొరేట్, కమ్యూనల్ (మతోన్మాద) ఎజెండాతో ముందుకెళ్తున్న బీజేపీ విధానాలను తిప్పికొట్టాలన్నారు. ఐక్య పోరాటాలకు ఏప్రిల్ ఐదోతేదీన జరిగే చలో ఢిల్లీ కార్యక్రమం తొలిమెట్టు కావాలని ఆకాంక్షించారు. మతోన్మాదంతో దేశంలో చిచ్చుపెడుతున్న బీజేపీ ప్రజలకు ఏవిధంగా నష్టం చేకూరుస్తున్నదనే విషయాలను ప్రజలకు అర్ధమయ్యేలా విడమర్చి చెప్పాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కార్మికులు, అసంఘటిత కార్మికులే ఎక్కువగా ఉంటారనీ, వారిమధ్య ఐక్యత సాధించలేకపోతే పోరాటాలను ముందుకు తీసుకుపోలేమని చెప్పారు. కార్పొరేట్లు, బీజేపీ ములాఖత్ అయ్యి... ప్రజల మధ్య చీలిక తెస్తున్నారని వివరించారు. తద్వారా కార్మికవర్గ ప్రయోజనాలను దెబ్బతీస్తున్నారని తెలిపారు. ఇలాంటి విషయాలన్నింటినీ కార్మికులకు అర్ధమయ్యేలా వివరించాలని విజయ రాఘవన్ సూచించారు.