Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంగ్రెస్ సభ్యులకు మధ్యప్రదేశ్ మంత్రి హెచ్చరికలు
- సోషల్ మీడియాలో వీడియో వైరల్
భోపాల్ : ప్రతిపక్ష నాయకులను ఉద్దేశించి... మధ్యప్రదేశ్ రాష్ట్ర మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో చేరాలనీ, లేకపోతే 'సీఎం బుల్డోజర్' కూల్చివేతలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. రుతియారు పట్టణంలో జరిగిన ఓ బహిరంగ సమావేశంలో మధ్యప్రదేశ్ పంచాయతీ శాఖ మంత్రి మహేంద్ర సింగ్ సిసోడియా ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ''కాంగ్రెస్ సభ్యులారా... వినండి. బీజేపీలో చేరండి. ఇటువైపు (అధికార పార్టీ వైపు) నెమ్మదిగా మళ్లండి. 2023లో కూడా మధ్యప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తుంది. మామ (సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్) గారి బుల్డోజర్ రెడీగా ఉన్నది'' అని రఘోగర్ నగర్ నగరపాలిక ఎన్నికల ప్రచారంలో భాగంగా సిసోడియా అన్నారు. మంత్రి వ్యాఖ్యలపై రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ కూడా తీవ్రంగానే స్పందించింది. రఘోగర్ ప్రజలు ఇలాంటి బెదిరింపులకు భయపడేంత పిరికివారు కారని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యులు, ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దిగ్విజరు సింగ్ హిందీలో ట్వీట్ చేశారు. ప్రజలు నిర్భయంగా ఓటు వేస్తారని పేర్కొన్నారు. మంత్రి వ్యాఖ్యలు ఆయన నెగెటివ్ మెంటాలిటీని ప్రతిబింబిస్తుందని రఘోగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే జైవర్ధన్‌సింగ్ అన్నారు. ''అభివృద్ధికి సంబంధించి బీజేపీ ఎత్తి చూపింది ఏమీ లేదు. ఆ పార్టీ నాయకుడు ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. ప్రజల ఐక్యత కోసమే తాము ఎల్లప్పుడు రాజకీయాలు చేస్తాం. వారిని విడగొట్టడానికి కాదు. నగర పాలిక ఎన్నికల్లో కాంగ్రెస్ 24 వార్డులన్నిటిలో విజయం సాధిస్తుంది'' అని ఎమ్మెల్యే అన్నారు. సిసోడియాను మంత్రి వ్యాఖ్యలు బీజేపీకే కళంకం తెచ్చాయని గుణ జిల్లా కాంగ్రెస్ చీఫ్ హరిశంకర్ విజరువర్గీయ అన్నారు.
మంత్రి వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకులు, ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో బీజేపీ దిద్దుబాటు చర్యలకు దిగింది. అక్రమ కార్యకలాపాల్లో మునిగి ఉన్న వారిని ఉద్దేశించి మంత్రి వ్యాఖ్యలు చేశారనీ, అలాంటి వారి కోసం బుల్డోజర్ ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుందని రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి పంకజ్ చతుర్వేది భోపాల్‌లో అన్నారు. రఘోగర్ అనేది దిగ్విజరుసింగ్ సొంత గడ్డ. ఇక్కడ ఈయన కుమారుడు జైవర్ధన్ సింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇతర బీజేపీ పాలిత రాష్ట్రాల లాగానే వివిధ నేరాల్లో నిందితులుగా ఉన్న వ్యక్తులకు సంబంధించిన అక్రమ ఇంటి నిర్మాణాలుగా భావింపబడుతున్నవాటిని మధ్యప్రదేశ్ ప్రభుత్వం కూల్చివేస్తున్నది. ఈ కూల్చివేతలను సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ కూడా తరచూ ప్రశంసిస్తూ వచ్చిన విషయం విదితమే.