Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బిజెపి ఎంపీ బ్రిజ్‌భూషణ్‌పై చర్యలకు కేంద్ర ప్రభుత్వం వెనుకడుగు
- జంతర్‌మంతర్ వద్దే కుస్తీకి రెజ్లర్లు సిద్ధం
- ఏడుగురు సభ్యులతో ఐఓఏ కమిటీ
- మూడోరోజు కొనసాగిన రెజ్లర్ల ధర్నా
నవతెలంగాణ-న్యూఢిల్లీ
విశ్వక్రీడా యవనికపై పతకాలు గెలిచి, యావత్ దేశం గర్వపడేలా చేసిన మల్లయోధులు దేశ రాజధానిలో మౌనంగా రోదిస్తున్నారు. మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించిన రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు, బిజెపి ఎంపీ బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్‌పై చర్యలు తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం సిద్ధంగా లేదు!. రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్‌పై చట్టపర చర్యలతో పాటు ప్రస్తుత రెజ్లింగ్ సమాఖ్య పాలక వర్గాన్ని రద్దు చేయాలని భారత రెజ్లింగ్ క్రీడాకారులు జంతర్‌మంతర్ వద్ద వరుసగా మూడోరోజు ధర్నా చేశారు.
ఇక్కడే ప్రాక్టీస్ చేస్తాం : రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్‌పై చట్టపర చర్యలు తీసుకునే వరకు రెజ్లర్ల ఆందోళన కొనసాగుతుందని వినేశ్ ఫోగట్ తెలిపింది. గురువారం రాత్రి క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్‌తో సమావేశమైన రెజ్లర్లు, శుక్రవారం సాయంత్రం మరోసారి భేటీ అయ్యారు. బ్రిజ్‌భూషణ్‌పై చర్యలకు స్పష్టమైన హామీ లభించకపోవటంతో రెజ్లర్లు ఆందోళన కొనసాగించేందుకు నిర్ణయించారు. 'బ్రిజ్‌భూషణ్ లైంగిక వేధింపులకు సంబంధించి మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. యువ రెజ్లర్లు చాలా మంది మాతో ఈ విషయాన్ని పంచుకున్నారు. బాధిత రెజ్లర్ల కుటుంబాల కోసమే వివరాలను బహిర్గతం చేయటం లేదు. మహిళా రెజ్లర్ల భవిష్యత్ కోసమే ఈ పోరాటం. జంతర్‌మంతర్‌కు రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫీస్ 100 మీటర్ల దూరం. మూడు రోజులుగా ధర్నా చేస్తున్నా ఎవరూ ఇక్కడికి వచ్చి సమాధానం చెప్పే ప్రయత్నం చేయలేదు. బ్రిజ్‌భూషణ్‌ను పదవి నుంచి తప్పించాలి. ఈ సమస్యకు పరిష్కారం చూపాలి. లేదంటే జంతర్‌మంతర్‌కు కుస్తీ మ్యాట్లతో వస్తాం, ఇక్కడే కుస్తీ సాధన చేస్తామని' వినేశ్ ఫోగట్ తెలిపింది. రెజ్లింగ్ సమాఖ్య ఉపాధ్యక్షుడి లైంగిక వేధింపులపై ఓ యువ రెజ్లర్ 30 నిమిషాల ఆడియో సైతం ఉందని ఫోగట్ భావోద్వేగంగా వెల్లడించింది.
ఏడుగురు సభ్యులతో ఐఓఏ కమిటీ : రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడిపై లైంగిక ఆరోపణల కింద చర్యలు తీసుకోవాలని కోరుతూ ఐదుగురు స్టార్ రెజ్లర్లు భారత ఒలింపిక్ సంఘానికి లేఖ రాశారు. వినేశ్ ఫోగట్, బజరంగ్ పూనియా, సాక్షి మాలిక్, రవి దహియా, దీపక్ పూనియాలు ఐఓఏకు లేఖాస్త్రం సంధించారు. అత్యవసరంగా సమావేశమైన ఐఓఏ ఎగ్జిక్యూటివ్ కమిటీ రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడిపై ఆరోపణలను విచారించేందుకు ఏడుగురు సభ్యులతో కూడిన కమిటీని నియమించింది. మేరీకోమ్, డోలా బెనర్జీ, అలకనంద అశోక్, యోగేశ్వర్ దత్, సహదేవ్ యాదవ్ సహా ఇద్దరు న్యాయవాదులు కమిటీ సభ్యులుగా ఉంటారు. సమస్యకు ఇరువైపులా విచారణ జరిపి త్వరగా నివేదిక ఇవ్వాలని ఐఓఏ ఆదేశించింది. ఇదిలా ఉండగా, భారత స్టార్ రెజ్లింగ్ క్రీడాకారులు మూడురోజులుగా ధర్నాకు దిగినా.. బ్రిజ్‌భూషణ్‌ను పదవి నుంచి తప్పుకోవాలని ఆదేశించేందుకు భారతీయ జనతా పార్టీ (బిజెపి) నాయకత్వం సిద్ధంగా ఉన్నట్టు కనిపించటం లేదు. కుస్తీ యోధుల ఆందోళనపై ప్రతి విమర్శలు చేసేందుకు బిజెపి సోషల్ మీడియా వెనుకాడటం లేదు. నిరసనల నేపథ్యంలో భారత రెజ్లింగ్ సమాఖ్య ఏజీఎం జనవరి 22న నిర్వహించనున్నారు. సమావేశంలో తాజా పరిణామాలపై చర్చించి, ఓ ప్రకటన చేసేందుకు బ్రిజ్‌భూషణ్ సిద్ధమవుతున్నాడు.