Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వారివి అబద్దాలు:'నకిలీ స్టింగ్' ఆరోపణలపై స్వాతి మలివాల్
న్యూఢిల్లీ : తనపై వచ్చిన 'నకిలీ స్టింగ్' ఆరోపణలపై ఢిల్లీ మహిళ కమిషన్ (డీసీడబ్ల్యూ) చీఫ్ స్వాతి మలివాల్ స్పందించారు. ఈ ఆరోపణలు 'అబద్దాలు' అని, తన తుది శ్వాస వరకు పోరాడుతూనే ఉంటానని ఆమె స్పష్టం చేశారు. దేశరాజధాని ఢిల్లీలో గురువారం ఉదయం 3 గంటలకు తాగిన మైకంలో ఉన్న ఒక క్యాబ్ డ్రైవర్ తనను వేధించాడనీ, కారు కిటికీలో తన చేయి ఉండగానే లాక్కొని వెళ్లాడని స్వాతి మలివాల్ ఆరోపణలు చేసిన విషయం విదితమే. అయితే, ఢిల్లీలో భద్రతపై స్వాతి మలివాల్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని బీజేపీ నాయకులు ఆరోపణలు చేశారు. ఢిల్లీ పోలీసులు అప్రమత్తంగా లేరనే విధంగా జరిగిన కుట్రే ఈ తతంగమని స్వాతి మలివాల్ స్టింగ్ ఆపరేషన్‌ను ప్రశ్నించారు. ఇలాంటి ఆరోపణలపై ఆమె స్పందించారు. ''నా గురించి మురికి అబద్దాలతో వారు నన్ను భయపెట్టొచ్చు. చిన్న జీవితంలోనే నేను చాలా పెద్ద పనులు చేశాను. నాపై అనేక సార్లు దాడులు జరిగాయి కానీ నేను ఆపలేదు. ప్రతీ దాడితో నాలో ఉన్న జ్వాల మరింత బలపడింది. నా గొంతును ఎవరూ అణగ దొక్కలేరు. నేను బతికు న్నంత వరకూ పోరాడుతూనే ఉంటా'' అని స్వాతి మలివాల్ ట్వీట్ చేశారు. కాగా, స్వాతి మలివాల్‌ను వేధించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న క్యాబ్ డ్రైవర్ దక్షిణ ఢిల్లీ సంగమ్ విహార్‌లోని ప్రముఖ ఆప్ కార్యకర్త అని ఢిల్లీ బీజేపీ నాయకుడు వీరేంద్ర సచ్దేవ ఆరోపించారు. ఈ కేసులో నిందితుడు (47)ను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. నిందితుడిని హరీశ్ చంద్రగా గుర్తించారు.