Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీబీసీ డాక్యుమెంటరీపై మోడీ సర్కార్ గరం గరం
- ట్విట్టర్, యూట్యూబ్‌కు కేంద్రం ఆదేశాలు
న్యూఢిల్లీ: బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ పై మోడీ సర్కార్ గరం గరం అవుతోంది. ఈ డాక్యుమెంటరీ వీడియో ఎట్టి పరిస్థితుల్లో వివిధ మాధ్యమాల్లో ప్రసారం కావడానికి వీల్లేదనే ధోరణితో కేంద్ర ప్రభుత్వ వర్గాలు రంగంలోకి దిగాయి. మైక్రోబ్లాగింగ్, వీడియో షేరింగ్ సైట్లలో అందుబాటులో ఉండటానికి వీల్లేదని మోడీ సర్కార్ ఆదేశాలు జారీచేసింది. వీడియో లింక్స్ ఇవ్వరాదు అంటూ ట్విట్టర్, యూట్యూబ్‌ను ఆదేశించింది. వీడియో లింకులను బ్లాక్ చేసేలా కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెంటనే చర్యలకు ఉపక్రమించారు. ప్రభుత్వం నుంచి లభించిన మద్దతుతోనే 2002 గుజరాత్ అల్లర్లు చెలరేగాయని, దీనికి ప్రధాన బాధ్యుడు ఆనాటి రాష్ట్ర సీఎం నరేంద్రమోడీ..అని బీబీసీ డాక్యుమెంటరీ పేర్కొంది. ఈ వీడియో భారత్, బ్రిటన్‌లో రాజకీయంగా తీవ్ర కలకలం రేపింది. రెండో వీడియో కూడా విడుదల కానున్నదని బీబీసీ కొద్దిరోజుల క్రితం ప్రకటించింది. మొదటి వీడియో విడుదలైన కొద్ది గంటల్లోనే బీబీసీ తొలగించటం చర్చనీయాంశమైంది. 'ఇండియా : ది మోడీ క్వశ్చన్' పేరిట విడుదలైన డాక్యుమెంటరీని భారత్ తీవ్రంగా ఖండించింది. డాక్యుమెంటరీ ఒక విద్వేషపూరిత చర్యగా అభివర్ణించింది.
బీబీసీ డాక్యుమెంటరీపై మోడీ సర్కార్‌కు మింగుడుపడటం లేదు. తాజాగా మరికొన్ని చర్యలు చేపట్టినట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఆ డాక్యుమెంటరీ లింకులను బ్లాక్ చేయాలని ట్విట్టర్, యూట్యూబ్‌లను కేంద్రం ఆదేశించినట్టు తెలిసింది. ఈ అంశానికి సంబంధించి మొదటి ఎపిసోడ్ లింకులను బ్లాక్ చేయాలని ఆ రెండు సామాజిక మాధ్యమ సంస్థలను సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఆదేశించినట్టు తెలుస్తోంది. 50 ట్వీట్లను తొలగించాలని చెప్పినట్టు ఆ వర్గాలు తెలిపాయి. ట్విట్టర్ తొలగించిన వాటిలో తృణమూల్ కాంగ్రెస్ నేత డెరిక్ ఓబ్రెయిన్ ట్వీట్ కూడా ఉంది. ఇదిలా ఉంటే..ఈ డాక్యుమెంటరీ అంశం బ్రిటన్ పార్లమెంట్ లోనూ చర్చకు వచ్చింది. డాక్యుమెంటరీలోని విష యాలను తాను పూర్తిగా అంగీకరించలేనని ప్రధాని రిషి సునాక్ స్పందించిన విషయం తెలిసిందే.