Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేరళలో ఎన్ఎంఓపీఎస్ సెక్రెటరీ జనరల్ స్థితప్రజ్ఞ
నవతెలంగాణ - కేరళ
కేరళలో కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్) రద్దు ఉద్యమం ప్రారంభ మైంది. నేషనల్ మూవ్మెంట్ ఫర్ ఓల్డ్ పెన్షన్ స్కీం (ఎన్ఎంఓపీఎస్) ఆధ్వర్యంలో శనివారం కేరళ రాజధాని త్రివేండ్రంలో ఉన్న సచివాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్ఎంఓపీఎస్ సెక్రెటరీ జనరల్ స్థితప్రజ్ఞ మాట్లాడుతూ ఐదు రాష్ట్రాల్లో సీపీఎస్ రద్దు కావడంలో ఎన్ఎంఓపీఎస్ ప్రముఖ పాత్ర పోషించిందని చెప్పారు. 1952లో అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్వో) 102వ కనెన్షన్లో పెన్షన్ ఉద్యోగి నెలవారీ జీతంలో కనీసం 50 శాతం ఉండాలని తీర్మానించిందని అన్నారు. కార్పొరేట్లకు కొమ్ముకాసే సీపీఎస్ పథకాన్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పాత పెన్షన్ పునరుద్ధరించే రాష్ట్రాల పట్ల రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. సీపీఎస్ అమలు తర్వాత రిటైరైనా లేదంటే మరణించిన ఉద్యోగి కుటుంబానికి అందిన ప్రయోజనాలు శూన్యమని విమర్శించారు. సీపీఎస్ ఉద్యోగులకు సామాజిక భద్రత కరువైందన్నారు. కేరళ ప్రతినిధి షాహిద్ రఫిక్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో కర్నాటక నుంచి రంగనాథ్, తెలంగాణ నుంచి సీపీఎస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్, రాష్ట్ర కోశాధికారి నరేష్ గౌడ్, తమిళనాడు నుంచి ఆరోగ్య దాస్ తదితరులు హాజరయ్యారు.