Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏఐఏడబ్ల్యూయూ జాతీయ ప్రధాన కార్యదర్శి బి వెంకట్
న్యూఢిల్లీ: నాడు బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గ్రామీణ పేదల, రైతాంగ సత్యాగ్రహ ఉద్యమాలు చంపారన్ ప్రాంతంలో ప్రజల్ని కదనరంగంలోకి తీసుకొచ్చాయనీ, ఆ స్ఫూర్తితో నేడు రైతులు, గ్రామీణ పేదలు కార్పొరేట్లకు, మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా ఉద్యమించాలని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం (ఏఐఏడబ్ల్యూ యూ) ప్రధాన కార్యదర్శి బి వెంకట్ పిలుపు నిచ్చారు. వ్యవసాయ కార్మిక సంఘం బీహార్ రాష్ట్ర మహాసభ సందర్భంగా శనివారం పశ్చిమ చంపారన్ ప్రాంతమైన భేత్యలో భారీ బహిరంగ సభ జరిగింది. ఈ సభలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న వెంకట్ మాట్లాడుతూ బ్రిటిష్ ప్రభుత్వం వ్యవసాయాన్ని కబళించే చర్యలను అడ్డుకునేందుకు1917లో పశ్చిమ చంపారన్ కేంద్రంగా గ్రామీణ రైతాంగాన్ని, పేదలని కదిలించి గాంధీజీ సత్యాగ్రహాన్ని చేపట్టారని ఆ పోరాటం స్వాతంత్ర ఉద్యమంలో ఒక చారిత్రక ఘట్టంగా నిలిచిందని తెలిపారు. నాటి స్ఫూర్తితో నేడు గ్రామీణ ప్రాంతాల్లో పేదలు వ్యవసాయ రంగ రక్షణ కోసం ఉద్యమించాలని అని పిలుపు నిచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో సంపద సృష్టిస్తున్న శ్రమజీవులకు ఆ సంపద దక్కేందుకు ఉద్యమించాలని అన్నారు. నాటి గాంధీ పోరాటం బ్రిటిష్ వ్యతిరేకంగా జరిగితే నేడు కార్పొరేట్లకు, అసమానతలకు వ్యతిరేకంగా జరగాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సభలో రాజ్యసభ ఎంపీ వి. శివదాసన్, వ్యవసాయ కార్మిక సంఘం బీహార్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు దేవేంద్ర, బోలా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.