Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'హాథ్ సే హాథ్ జోడో అభియాన్' ప్రచార లోగో విడుదల
న్యూఢిల్లీ : మోడీ ప్రభుత్వంపై కాంగ్రెస్ చార్జిషీటు విడుదల చేసింది. రాహుల్ గాంధీ సారథ్యంలో గత ఏడాది సెప్టెంబర్ 7న మొదలై జనవరి 30తో ముగియనున్న 'భారత్ జోడో యాత్ర' సందేశాన్ని ఇంటింటికి చేరవేసేందుకు కాంగ్రెస్ పార్టీ 'హాథ్ సే హాథ్ జోడో అభియాన్' ప్రచారాన్ని చేపట్టనుంది. ఇందుకు సంబంధించిన లోగోతో పాటు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక చార్జిషీటును శనివారం నాడిక్కడ విడుదల చేసింది. ఈ సందర్భంగా ఏఐసీసీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ మాట్లాడుతూ ఈ నెల 26 నుంచి రెండు నెలల పాటు 'హాథ్ సే హాథ్ జోడో' ప్రచారం సాగనుందని తెలిపారు. రాహుల్ గాంధీ సారథ్యంలోని జోడో యాత్ర సందేశాన్ని సామాన్య ప్రజానీకానికి సైతం చేరవేసేందుకు ఈ ప్రచారం చేపడుతున్నట్టు తెలిపారు. మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విడుదల చేసిన చార్జిషీటును ప్రాతిపదికన ఆయా రాష్ట్రాలకు చెందిన ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలు (పీసీసీలు) చార్జిషీట్లు తయారు చేస్తాయని వేణుగోపాల్ తెలిపారు. మోడీ ప్రభుత్వ అవినీతి, అవకతవకల పాలన కారణంగా ప్రజలకు ఎదురైన ఇబ్బందులను పరిష్కరించేందుకు తమ పార్టీ కృషి చేస్తుందన్నారు. 130 రోజుల చారిత్రక ప్రోగ్రాం (భారత్ జోడో యాత్ర) తరువాత దేశ ప్రజల నుంచి విస్తృత సమాచారాన్ని కాంగ్రెస్ పార్టీ సేకరించిందనీ, లక్షలాది మంది రాహుల్ గాంధీ అడుగులో అడుగులు వేసి ఆయనతో సంభాషించారని అన్నారు. మోడీ ప్రభుత్వ తప్పిదాల పాలన కారణంలో ప్రజలు ఎదుర్కొన్న బాధలను తాము అవగతం చేసుకున్నామని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి (కమ్యూనికేషన్స్) జైరామ్ రమేష్ మాట్లాడుతూ తమ పార్టీ చేపట్టనున్న ఇంటింటి ప్రచారం 6 లక్షల గ్రామాలు, 2.5 లక్షల గ్రామ పంచాయతీల్లోని 10 లక్షల పోలింగ్ బూత్‌లకు తీసుకువెళ్తామని చెప్పారు. 'హాథ్ సే హాథ్ జోడో' ప్రచారం జనవరి 26 నుంచి మార్చి 26 వరకూ జరుపుతామన్నారు. పార్టీ కార్యకర్తలు ఇంటింటికి తిరిగి రాహుల్ గాంధీ లేఖను ప్రజలకు అందజేస్తారని చెప్పారు.