Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నృత్య ప్రదర్శనకు నిరాకరణ : మల్లికా సారాభాయి
- రామప్పఫెస్ట్కు బీజేపీ అడ్డంకులు దురదృష్టకరం : కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్
న్యూఢిల్లీ : మోడీని విమర్శించినందునే తన నృత్య ప్రదర్శనకు అనుమతినివ్వలేదని ప్రముఖ శాస్త్రీయ నృత్యకారిణి మల్లికాసారాభాయి ఆదివారం తెలిపారు. జనవరి 16న కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ వ్యవస్థాప కులకు కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి కార్యాలయం నుంచి ఫోన్ వచ్చిందని మల్లికాసారాభాయి పేర్కొన్నారు. వరంగల్‌లోని రామప్ప ఆలయంలోని ప్రదర్శకుల జాబితాలో ఆమె పేరు తొలగించాలని లేదా వేడుకను రద్దు చేయాలని డిమాండ్ చేసినట్టు తెలిపారు.బీజేపీ, దాని హిందూత్వ రాజకీయ వైఖరిని విమర్శించినందునే తన ప్రదర్శనకు అనుమతి నిరాకరించారని మల్లికా సారాభాయి పేర్కొన్నారు. ప్రశ్నించేతత్వాన్ని అనుమతించని వాతావరణంలో ప్రస్తుతం మనం నివసిస్తున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు. ''ప్రజాస్వామ్య దేశంలో ప్రశ్నించే తత్వం ఇక్కడి ప్రజల డీఎన్ఏలోనే ఉన్నది. అది ఉండాలి కూడా. వేదాంతాలు, ఉపనిషత్తులు ప్రశ్నించే తత్వం నుండే వచ్చాయే తప్ప అంధ విశ్వాసాలతో కాదు. దేశాన్ని, రాజ్యాంగాన్ని కుప్పకూల్చాలనుకునే ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నా స్వరం వినిపిస్తూనే ఉంటాను. గత 20 ఏండ్లుగా అదే పని చేస్తున్నాను'' అని మల్లికా సారాభాయి అన్నారు.
బీజేపీ బెదిరింపులతో సాధించేదేమీలేదు...:బీజేపీ ప్రభుత్వ బెదిరింపు రాజకీయాలతో సాధించేదేమీ లేదని ఎద్దేవా చేశారు. ఇది పూర్తిగా పుస్తకాన్ని నిషేధించడంతో సమానమని అన్నారు. రాష్ట్రం ఒక పుస్తకాన్ని నిషేధిస్తే.. ప్రతి ఒక్కరూ ఆ పుస్తకం కాపీని పొందేందుకు యత్నిస్తారనీ.. అలాగే తన ప్రదర్శనను అడ్డుకోవడంతో తన కళను చూసేందుకు మరింత ఎక్కువ మంది తనకు మద్దతుగా నిలిచారని అన్నారు. అయితే ఆమె ప్రదర్శనను అడ్డు కోవడం ఇదే మొదటిసారి కాదు. 2020లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ కాన్వకేషన్‌కు ముఖ్య అతిథిగా ఆహ్వానం అందిందనీ, అయితే అనుకోని పరిస్థి తుల కారణంగా కాన్వకేషన్‌ను రద్దు చేసినట్టు సమాచారమిచ్చారని అన్నారు.
రామప్పఫెస్ట్కు బీజేపీ అడ్డంకులు
రామప్ప ఆలయం ప్రపంచ వారసత్వ గుర్తింపు పొంది ఏడాది పూర్తయిన సందర్భంగా కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 'రామప్ప ఫెస్ట్' పేరుతో ఓ వేడుకను నిర్వహించాలని నిర్ణయించింది. అయితే ఆ వేడుకలో మోడీ విమర్శకులు ప్రదర్శన చేయాలని కోరుకోవడం లేదని కిషన్ రెడ్డి పేర్కొన్నట్టు తెలిపారు. ''నాట్య ప్రదర్శనకు అనుమతి కోరుతూ మూడు నెలల కిందే అర్కియాలజీ డిపార్ట్మెంట్కు దరఖాస్తు చేశాం. అయితే అనుమతి లభించలేదు. మల్లికా సారాభాయి కావడం వల్లే పర్మిషన్ ఇవ్వలేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఓరల్ గా చెప్పారు. కళలకు రాజకీయాలకు సంబంధం లేదు. ఉండకూడదు. ఇది దురదృష్టకరం'' అని కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ వ్యవస్థాపకులు పేర్కొన్నారు.