Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆజాదీకా అమృతోత్సవం ఓ డ్రామా
- విషభావజాలాన్ని నింపేపనిలో బీజేపీ
- ఐక్యంగా తిప్పికొడదాం..దేశాన్ని కాపాడుకుందాం
- ఏప్రిల్ 5న మజ్దూర్ కిసాన్ ఏక్తా ర్యాలీని జయప్రదం చేయండి :సీఐటీయూ బహిరంగ సభలో తపన్‌సేన్
- కార్మికులకు అండ ఎర్రజెండానే : కె.హేమలత
బెంగుళూరు నుంచి అచ్చిన ప్రశాంత్
కార్మికుల జీవన విధానంపై మోడీ సర్కారు దాడి తీవ్రతరం చేసిందనీ, కార్పొరేట్ల కోసం పర్మినెంట్ ఎంప్లాయిమెంట్ స్థానంలో అప్రెంటీస్, ట్రైనీ పనివిధానం తీసుకొస్తున్నదని సీఐటీయూ అఖిల భారత ప్రధాన కార్యదర్శి తపన్‌సేన్ విమర్శించారు. బీజేపీ ప్రభుత్వ విధానాలు, కరోనా వల్ల 80 శాతం కార్మికుల జీవన ప్రమాణాలు పడిపోయాయనీ, చాలా మంది ఉపాధి కోల్పోయి రోడ్లమీద పడ్డారని వాపోయారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఏప్రిల్ ఐదో తేదీన ఢిల్లీలో జరిగే మజ్దూర్కిసాన్ ఏక్తా ర్యాలీని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఆదివారం సీఐటీయూ అఖిల భారత మహాసభల ముగింపు సందర్భంగా బెంగళూరులోని నేషనల్ కాలేజీ గ్రౌండ్లో బహిరంగ సభను నిర్వహించారు. సీఐటీయూ కర్నాటక రాష్ట్ర అధ్యక్షులు ఎస్.వరలక్ష్మి అధ్యక్షతన జరిగిన ఈ సభలో తపన్‌సేన్ మాట్లాడారు. ఆజాదీకా అమృత్ మహౌత్సవం ఒక నాటకం అనీ, దాని పేరుతో ప్రజల్లో విష భావజాలాన్ని నింపే పనిలో బీజేపీ యత్నిస్తున్నదని విమర్శించారు. మోడీ ప్రభుత్వం కార్పొరేట్ల కోసం పనిచేస్తున్నదన్నారు. మతంపేరుతో ప్రజల మధ్య విభజన చిచ్చు రాజేసి ప్రభుత్వ రంగ సంస్థలను ప్యాకెట్ల రూపంలో విడగొట్టి కార్పొరేట్లకు కట్టబెడుతున్న తీరును వివరించారు. విద్యుత్‌రంగాన్ని అదానీకి అప్పగించే పనిలో ఉందని విమర్శించారు. అందులో భాగంగానే మహారాష్ట్రలో విద్యుత్ పంపిణీ సంస్థలను ప్రయివేటీకరణ చేసేందుకు యత్నించగా అక్కడ ఉద్యోగులు, కార్మికులు పెద్ద ఎత్తున పోరాటం చేయడం వల్ల బీజేపీ సర్కారు వెనక్కి తగ్గిందన్నారు. బలమైన పోరాటాల ద్వారా పాలకుల విధానాలను వెనక్కి కొట్టొచ్చన్నారు. కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ బలమైన పోరాటాల రూపకల్పన కోసం జనవరి 30న ఢిల్లీలో కార్మిక సంఘాల జేఏసీ మీటింగ్ జరుగబోతున్నదని చెప్పారు. మోడీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని, మానవ హక్కులను, వ్యవసాయాన్ని, ప్రభుత్వ రంగ సంస్థలను విధ్వంసం చేస్తున్న తీరుపై ప్రజలకు వివరిస్తామన్నారు. దేశాన్ని రక్షించుకుందాం అనే నినాదంతో ముందుకుసాగుతామని చెప్పారు. సీఐటీయూ అఖిల భారత అధ్యక్షులు డాక్టర్ కె.హేమలత మాట్లాడుతూ..బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కారు అని చాలా రాష్ట్రాల్లో ఉందనీ, ఆ పార్టీ పాలిత రాష్ట్రాల్లో కార్మికుల హక్కులపై దాడి జరుగుతున్నదని చెప్పారు. మరోవైపు కేరళలో ఉన్న వామపక్ష ప్రభుత్వం కార్మికులకు అండగా నిలుస్తున్న విషయాన్ని గమనించాల న్నారు. ఎప్పటికైనా కార్మికులకు అండగా నిలిచేది ఎర్రజెండానేనన్నారు. వామపక్ష భావజాల ప్రభుత్వాలు రావాల్సిన అవసరం ఉందనీ, అందుకు కార్మికవర్గం తమ వంతు కృషి చేయాల్సిన ఆవశ్యకత ఉందని నొక్కిచెప్పారు. కర్నాటక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మీనాక్షి సుందరం మాట్లాడుతూ.. మోడీ ప్రభుత్వం ఒక్కసారి కూడా ఇండియన్ లేబర్ కమిషన్ సమావేశాలను నిర్వహించలేదనీ, దీనిని బట్టే కార్మికవర్గంపై వారికున్న చిత్తశుద్ధి ఏంటో అర్ధమవుతున్నదని చెప్పారు. కర్నాటకలో 40 శాతం కమిషన్ ప్రభుత్వం నడుస్తున్నదని విమర్శించారు. కార్మికుల అండగా నిలబడని బొమ్మై ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెబుతారన్నారు. కాంగ్రెస్, జేడీఎస్‌లు కార్మిక పోరాటాలకు అండగా నిలబడాలని కోరారు. రాష్ట్ర అధ్యక్షులు ఎస్.వరలక్ష్మి మాట్లాడుతూ..సీఐటీయూ అఖిల భారత మహాసభ విజయవంతంలో కీలకపాత్ర పోషించిన కార్మికులకు ధన్యవాదాలు తెలిపారు. కర్నాటక రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ, ఆశా, గ్రామపంచాయతీ కార్మికులకు ఒక్క మేలు కూడా చేయలేదని విమర్శించారు. కర్నాటక భవన నిర్మాణ కార్మికుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హిమంతోశ్ నాయకులను వేదికపైకి ఆహ్వానించారు. వేదికపైనా అంగన్వాడీలు డ్రమ్స్ వాయించారు. కోలాటం ఆడారు. చిన్నపిల్లలు నృత్యప్రదర్శన చేశారు. పాటలు పాడారు. ఈ సభలో సీఐటీయూ అఖిల భారత ఉపాధ్యక్షులు ఏకే పద్మనాభవన్, చుక్కరాములు, జి.బేబీరాణి, కార్యదర్శులు పాలడుగు భాస్కర్, సీహెచ్.నర్సింగరావు, కె.ఎన్.ఉమేశ్, కరుమలయన్, ఉషారాణి, ఏఆర్సింధు, కిసాన్‌సభ కోశాధికారి కృష్ణప్రసాద్, రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.