Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఛత్తీస్‌గఢ్ సీఎంకు సంయుక్త బృందం మెమోరాండం
- బాధిత ప్రాంతాలను పర్యటించిన బృందం
రాయ్‌పూర్ : బీజేపీ, భజరంగ్‌దళ్ గూండాల దాడుల నుంచి రాష్ట్రంలోని క్రిస్టియన్ ఆదివాసీలను రక్షించాలని ఛత్తీస్‌గఢ్ ముఖ్య మంతి భుపేశ్ బాఘాల్కు సీపీఐ(ఎం) అదివాసీ అధికార్ రాష్ట్రీయ మంచ్‌తో కూడిన సంయుక్త బృందం మొమోరాండం అందచేసింది. దాడులు జరుగుతున్న ఉత్తర బస్తర్ జిల్లాలు కంకెర్, కొడెగాన్, నారాయణ్పూర్లోని సమస్యలపై తక్షణమే దృష్టి సారించాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేసింది. సీపీఐ(ఎం) పొలిట్ బూర్యో సభ్యురాలు బృందాకరత్ నేతృత్వంలోని సంయుక్త బృందం బాధిత ప్రాంతాల్లో ఈ నెల 20, 21, 22 తేదీల్లో పర్యటించింది. హింసాకాండ బాధితుల్ని, పాస్టర్లను, ఆదివాసీలను, ఆదివాసీల సంఘం సభ్యుల్ని, ఎన్నికైన కొంత మంది స్థానిక సంస్థల ప్రతినిధుల్ని, ఉద్యమకారుల్ని బృందం సమావేశమయింది. అలాగే కంకెర్ ఎస్పీ, నారాయణపూర్ కలెక్టర్, కొడెగాన్ ఎస్డీఎం, ఇతర అధికారుల్ని కూడా బృందం భేటీ అయింది. ఈ సంయుక్త బృందంలో బృందకరత్తో పాటు ధర్మరాజ్ మహపాత్ర (యాక్టింగ్ సెక్రెటరీ, ఛత్తీస్‌గఢ్), బాల్ సింగ్ (రాష్ట్ర కార్యదర్శి, ఆదివాసీ ఏక్తా మహసభ), నజీబ్ ఖరేషి, వసుందర్ దాస్ ఉన్నారు. బాధితులకు సంఘీభావం తెలపడానికి, వారి సమస్యలను స్వయంగా తెలుసుకునే ఉద్దేశంతో ఈ బృందం పర్యటన సాగింది.
దాడుల బాధితుల్ని, ప్రభావానికి గురైన వారిని కలుసుకోవడానికి ఈ ప్రాంతంలో ఒక మంత్రిగానీ, ప్రభుత్వం నుంచి ఒక సీనియర్ నాయకులు గానీ ఇప్పటి వరకూ పర్యటించకపోవడంపై బృందం ఆశ్యర్యం వ్యక్తం చేసింది. చిన్నారులు, మహిళలతో సహా అనేక మంది దారుణంగా దాడికి గురయ్యారని బృందం ఆందోళన వ్యక్తం చేసింది. సుమారు 1500 మంది బలవంతంగా తమ ఇండ్ల నుంచి, సొంత ఊర్ల నుంచి గెంటివేయపడ్డారని మెమోరాం డంలో బృందం పేర్కొంది. ప్రస్తుతం ఇళ్లకు తిరిగివస్తున్న వారిపైనా హిందుత్వ గూండాలు ఆంక్షలు వేస్తున్నారని, క్రిస్టియన్ ఆదివాసీలకు సరుకులు అమ్మమని దుకాణదారులు హెచ్చరిస్తున్నారని తెలిపింది.
కొన్ని గ్రామాల్లో ఇప్పటికీ అంటరానితనం కొనసాగుతోందని గుర్తించినట్లు బృందం వెల్లడించింది. చర్చ్‌లు, క్రిస్టియన్ ఆదివాసీలపై నవంబర్ నుంచి దాడులు ప్రారంభమయ్యాయని తెలిపింది. బీజేపీ నాయకులు ఏర్పాటు చేసిన జంజాతి సురాక్ష మంచ్, భజరంగ్ దళ్ గూండాలే ఈ దాడులకు కారణమని పేర్కొంది. ఈ ఏడాది చివరిలో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజకీయ ఎజెండాతోనే ఈ దాడులు ప్రారంభమయ్యాయని తెలిపింది. అలాగే తమ పర్యటనలో అటవీ హక్కుల చట్టం అమలుకానీ విషయాన్ని గుర్తించామని బృందం తెలిపింది. అదేవిధంగా నారాయణపూర్ జిల్లాలో రెండు ఐరన్ మైనింగ్ ప్రాజెక్టులను ఆదివాసీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని తెలిపింది.