Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏప్రిల్ 5 మజ్దూర్ కిసాన్ సంఘర్ష్ ర్యాలీని జయప్రదం చేయండి
- బీజేపీ సర్కారు ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొడదాం : సీఐటీయూ అఖిల భారత 17వ మహాసభ పిలుపు
- పలు తీర్మానాలకు ఏకగ్రీవ ఆమోదం
- మూడేండ్ల కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణపైనా విస్తృత చర్చ
- నాలుగు కమిషన్లపై బృంద చర్చలు
బెంగుళూరు నుంచి అచ్చిన ప్రశాంత్
కార్మిక, కర్షక ఐక్యపోరాటాలే ధ్యేయంగా పదండి ముందుకు..పదండి తోసుకు...మతోన్మాద శక్తులను చీల్చి చెండాడుతూ..నయా ఉదారవాద విధానాలను తిప్పికొడుతూ మునుముందుకు సాగండి అంటూ సీఐటీయూ అఖిల భారత 17వ మహాసభ పిలుపునిచ్చింది. ఐక్యపోరాటాల ఆవశ్యకతను నొక్కిచెప్పింది. బెంగుళూరులోని శ్యామల్ చక్రవర్తి నగర్(ప్యాలెస్గ్రౌండ్)లోని రంజనా నిరులా, రఘునాథ్ సింగ్ వేదిక సాక్షిగా ఐదురోజుల పాటు ఉత్తేజితపూరిత వాతావరణంలో మహాసభ కొనసాగింది. ప్యాలెస్‌గ్రౌండ్‌లో ఎర్రజెండాలు, తోరణాలు, మహనీయుల సూక్తులతో ఏర్పాటు చేసిన ఫొటోలు ప్రతినిధుల్లో నూతన ఉత్తేజాన్ని నింపాయి. మహనీయుల చిత్రపటాల వద్ద ఆసక్తిగా ఫొటోలు దిగి వారి పోరాట పటిమను గుర్తుచేసుకుని తమలో స్ఫూర్తిని నింపుకున్నారు. బెంగుళూరుకు వంద కిలోమీటర్ల దూరంలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్(కేజీఎఫ్) పోరాటంలో అసువులు బాసిన కార్మికుల జ్ఞాపకార్ధం అక్కడ నుంచి అనందరాజు నేతృత్వంలోని బృందం తీసుకొచ్చిన అమరవీరుల జ్యోతిని సీఐటీయూ అఖిల భారత అధ్యక్షులు కె.హేమలతకు అందజేశారు. రెడ్‌షర్ట్ వాలంటీర్ల బృందం నుంచి ఆమెగౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఆమె సీఐటీయూ జెండాను ఎగురవేసి మహాసభను ప్రారంభించారు.
అమరవీరుల స్థూపం వద్ద డబ్ల్యూఎఫ్‌టీయూ ప్రధాన కార్యదర్శి పాంబిస్ క్రిస్టిస్, సీఐటీయూ అఖిల భారత ప్రధాన కార్యదర్శి తపన్‌సేన్, అధ్యక్షులు కె.హేమలత, మహాసభల ఆహ్వాన సంఘం గౌరవాధ్యక్షులు, సీనియర్ న్యాయవాది కె.సుబ్బారావు, ప్రజాసంఘాల నేతలు, మహాసభ ప్రతినిధులు అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించారు. అమరవీరుల స్తూపానికి ఇరువైపులా పిడికిళ్లు బిగించి ఎర్రజెండాలు చేతబట్టిన చేతుల బొమ్మలు ప్రత్యేక ఆకర్షణగా నిలిశాయి. ఆహ్వాన సంఘం ప్రతినిధులకు స్వాగతం పలికింది. 1500 మందితో ప్రతినిధుల సభ ప్రారంభమైంది. ప్రధాన కార్యదర్శి తపన్‌సేన్ నివేదికను ప్రవేశపెట్టారు. గత మహాసభ నుంచి ఈ మహాసభ వరకు సీఐటీయూ చేసిన పోరాటాలు, సాధించిన విజయాలు, కార్మికవర్గ ఐక్యత కోసం చేసిన కృషి, లోపాలు, తదితరాలపై విస్తృతంగా చర్చ జరిగింది. ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, రంగాలు, ఫెడరేషన్ల నుంచి ప్రతినిధులు ప్రధాన కార్యదర్శి నివేదికపైన చర్చల్లో పాల్గొని నివేదికను మరింత పరిపుష్టం చేశారు.
ఢిల్లీలో ఏప్రిల్ ఐదో తేదీన తలపెట్టిన మజ్దూర్ కిసాన్ సంఘర్ష్ ర్యాలీలో లక్షలాది మంది కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని మహాసభ పిలుపునిచ్చింది. ప్రపంచవ్యాప్తంగానూ, కర్నా టకలోనూ కార్మికులు చేస్తున్న పోరాటాలకు సంఘీభావం తెలుపుతూ సభలో తీర్మానాలు ప్రవేశపెట్టారు. వీటితో పాటు లేబర్కోడ్ల రద్దు కోరుతూ, మహిళలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ, కేరళలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వంపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న కుట్రలను ఖండిస్తూ తీర్మానాలను ప్రవేశపెట్టారు. నాలుగో రోజు నాలుగు కమిషన్ల( ఆధునిక ఉత్పాదక రంగంలో కార్మికులను సంఘటితం చేయడం, ఎదురవుతున్న సవాళ్లు- మతతత్వానికి వ్యతిరేకంగా కార్మికవర్గ పోరాటం, ప్రతిఘటన -భారతదేశంలో నయా ఉదారవాదం, కోవిడ్ సంక్షోభ నేపథ్యంలో కార్మికుల అంతర్గత వలసలు - ఉపాధి సంబంధాల్లో మారుతున్న పరిస్థితులు)పై ప్రతినిధులు నాలుగు బృందాలుగా విడిపోయి సుధీర్ఘంగా చర్చించారు. ఆ చర్చల ద్వారా భవిష్యత్‌లో చేయాల్సిన పోరాటాలపై కార్యాచరణ రూపొందించారు. మతం, కులం, ప్రాంతం, భాష పేరుతో కార్మికుల మధ్య చీలిక తీసుకొచ్చి వారి హక్కులను హరిస్తున్న బీజేపీ విధానాలపై పోరాడేందుకు ఐక్యపోరాటాలను నిర్మించాల్సిన ఆవశ్యకతను నొక్కిచెప్పింది.
మహాసభలో ఆలిండియా కిసాన్ సభ, అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం, ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ, కేంద్ర కార్మిక సంఘాల నేతలు సౌహార్ధ్ర సందేశాలిస్తూ సీఐటీయూ ఐక్యపోరాటాల్లో తామూ కలిసి నడుస్తామని ప్రతిమబూనారు. డబ్ల్యూఎఫ్‌టీయూ ప్రధాన కార్యదర్శి ఐదురోజుల పాటు మహాసభ ప్రాంగణంలోనే ఉండి చర్చలను పరిశీలించారు. చేగువేరా కూతురు అలైదా గువేరా, మనువరాలు ప్రొఫెసర్ ఎస్తేఫానియా మహాసభ ప్రాంగణంలోకి అడుగు పెట్టగానే ప్రతినిధులు అందరూ నిలబడి వెంట్రుకలు నిక్కపొడిచేలా పెద్దపెట్టున నినాదాలు చేస్తూ ఘన స్వాగతం పలికారు. 'వర్కింగ్ క్లాస్ యూనిటీ వర్ధిల్లాలి...అప్అప్ సోషలిజం..డౌన్‌డౌన్ క్యాప్టలిజం.. సోషలిజం వర్ధిల్లాలి' అనే నినాదాలతో సభాప్రాంగణం మార్మోగిపోయింది. ఫాసిస్టు ఎజెండాతో ముందుకెళ్తున్న మోడీ సర్కారు పాలన తీరును నిరసిస్తూ వాల్‌ను ఏర్పాటు చేసి దానిపై సంతకాల సేకరణ, అభిప్రాయాల సేకరణ చేపట్టారు. మహాసభ చివరిరోజు నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బెంగుళూరులోని నేషనల్ కాలేజీ గ్రౌండ్లో భారీబహిరంగ సభకు ప్రజలు వేలాదిగా తరలొచ్చి జయప్రదం చేశారు.