Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆహార భద్రతకు మోడీ సర్కార్ తూట్లు
- 2021 జనగణన వాయిదా.. కొత్త రేషన్‌కార్డుల జారీ నిలుపుదల
- ఒక్క ఢిల్లీ నగరంలోనే 2,93,184 దరఖాస్తులు పెండింగ్
- పీడీఎస్ మరింత విస్తరించాలని ఆర్థికవేత్తలు సూచన
- గణాంకాల్లేవని 10 కోట్లమందికి కేంద్రం మొండిచేయి
కోవిడ్-19 సంక్షోభం తర్వాత కోట్లాది కుటుంబాలు పేదరికంలోకి కూరుకుపోయాయి. నెలవారీ ఆదాయం గల్లంతైంది. దీంతో 2021లో కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులు అనూహ్యంగా పెరిగాయి. మోడీ సర్కార్ అనుసరిస్తున్న విధానాల వల్ల ఎక్కడా కూడా కొత్త రేషన్ కార్డుల జారీ చేపట్టడం లేదు. దాంతో కోట్లాది కుటుంబాలు ప్రజా పంపిణీ వ్యవస్థ పరిధిలోకి రాకుండా పోతున్నారని ఆర్థిక నిపుణులు జీన్ డ్రెజ్, రితికా ఖేర్ పలు నివేదికలు విడుదల చేశారు. ఆర్టీఐ దరఖాస్తుకు విడుదలైన ప్రభుత్వ సమాచారం ప్రకారం, ఒక్క ఢిల్లీ నగరంలోనే రేషన్ కార్డుల దరఖాస్తులు 2,93,184 పెండింగ్‌లో ఉన్నాయని తెలిసింది. జాతీయ ఆహార భద్రతా చట్టాన్ని ప్రస్తుత జనాభాకు, సామాజిక పరిస్థితులకు అనుగుణంగా అమలుజేయనందు వల్లే కోట్లాది మంది పేదలు నష్టపోతున్నారని ఆర్థిక నిపుణులు విశ్లేషించారు.
న్యూఢిల్లీ : రైట్ టు ఫుడ్ ప్రచారకురాలు, సామాజిక కార్యకర్త అమిత్రా జోహ్రా మాట్లాడుతూ, ''కేంద్రం 2011 జనాభా లెక్కల్నే ఇప్పటికీ చూపుతోంది. వాస్తవానికి పీడీఎస్‌ను విస్తరించాలన్న ఉద్దేశం కేంద్రానికి లేదు. జనాభా పెరుగుదల సూచికలను పరిగణనలోకి తీసుకోవాలి. ఉదాహరణకు ఈ-శ్రమ్ పోర్టల్‌లో 28కోట్ల మంది పేర్లు రిజిష్టర్ అయ్యాయి. ఇందులో రేషన్ కార్డులు లేనివారికి ఇవ్వొచ్చు. గణాంకాలు లేవని కొత్త రేషన్ కార్డుల జారీ చేపట్టకపోవటం అమానవీయ''మని అన్నారు.జాతీయ ఆహార భద్రతా చట్టం (ఎన్ఎఫ్ఎస్ఏ) 2013లో అమల్లోకి వచ్చింది. దేశంలో ఆహార అభద్రత సమస్యను పరిష్కరించటం కోసం ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. ఆనాటి పాలకులు ప్రజా పంపిణీ వ్యవస్థను మరింత బలోపేతం చేశారు. ఇప్పటివరకు ఉన్న అధికారిక గణాంకాల ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో 75శాతం జనాభా పీడీఎస్ పరిధిలోకి వస్తోంది. పట్టణ జనాభాలో 50శాతం మందికి వర్తిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా పీడీఎస్‌ను అమలుజేయాలని చట్టంలో పేర్కొన్నారు. ఆహార ధాన్యాల్ని కేటాయించే బాధ్యత కేంద్రానిదైతే, లబ్దిదారులను గుర్తించటం, పథకాన్ని సమర్థంగా అమలుజేయటం రాష్ట్రాల బాధ్యత. ప్రస్తుతం దేశంలోని 81.34కోట్ల మంది ఆహార భద్రతా చట్టం కిందకు వస్తున్నారు. అయితే దేశంలో ఎంతోమంది పేదలకు రేషన్ కార్డుల్లేవని, పీడీఎస్ పథకం విస్తరించటం లేదని, కొత్త కార్డులు పొందేందుకు అర్హులైన వారెంతో మంది ఉన్నారని ఆర్థిక నిపుణులు గణాంకాల్ని విడుదల చేస్తున్నారు.
జనగణన 2021లో మొదలవ్వాలి..కానీ ఎప్పుడో 12 ఏండ్ల క్రితం (2011) చేపట్టిన జనాభా లెక్కల ప్రకారం పీడీఎస్ పథకం అమలవుతోందన్నది ప్రధాన విమర్శ. దేశ జనాభా ఇప్పుడు ఎంతో పెరిగింది. పేదలు, మధ్య తరగతి సంఖ్య గణనీయంగా ఉందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని ఆయా వర్గాల నుంచి పెద్ద ఎత్తున దరఖాస్తులు వస్తున్నాయి. తాజా జనాభా లెక్కలు లేకపోవటం వల్ల దాదాపు 10కోట్ల మందికి అన్యాయం జరుగుతోందని ప్రముఖ ఆర్థిక నిపుణులు జీన్ డ్రెజ్, రితికా ఖేర్ ఆరోపిస్తున్నారు. జనాభా లెక్కల ప్రక్రియ వాస్తవానికి 2021లోనే మొదల వ్వాలి. కోవిడ్-19 సంక్షోభాన్ని సాకుగా చూపి కేంద్రం వాయిదా వేసింది. జనవరి 2న దీనిపై ఒక నిర్ణయం వెలువడాలి. కానీ ఈ అంశాన్ని నానుస్తోంది. దాదాపు 2024 సార్వత్రిక ఎన్నికలు వచ్చే వరకు జన గణన-2021 చేపట్టే ఉద్దేశం మోడీ సర్కార్‌కు లేదని సంకేతాలు వెలువడ్డాయి.
ఆకలి సూచికలు చెబుతున్నా...పట్టదా?
మోడీ సర్కార్ తీరు వల్ల భారత్‌లో ఆకలి సమస్య తీవ్రస్థాయికి చేరుకుందని ఆర్థిక నిపుణులు ఆరోపిస్తున్నారు. అందువల్లే ప్రపంచవ్యాప్తంగా పలు సూచికల్లో భారత్ ర్యాంక్ దిగజారుతోందని చెబుతున్నారు. ముఖ్యంగా ప్రపంచ ఆకలి సూచికలో భారత్‌ను 'అత్యంత తీవ్రమైన' కేటగిరిలో చేర్చింది. ఉదాహరణకు ఢిల్లీ, ముంబయి, కోల్‌కతా, హైదరాబాద్ వంటి మహా నగరాల్లో జనాభా అనూహ్యంగా పెరిగింది. ఇందులో పేద కుటుంబాలకు చెందినవారు ఎక్కువగా ఉన్నారు. 2011 జనాభా లెక్కలను అడ్డుపెట్టుకొని కేంద్రం పథకాన్ని అమలుజేస్తున్న తీరును సుప్రీంకోర్టు తప్పుబట్టింది. ఎన్ఎఫ్ఎస్ఏ పరిధిని ఇప్పుడు విస్తరించాల్సిన అవసరం లేదంటూ మోడీ సర్కార్ సుప్రీంలో అఫిడవిట్ కూడా దాఖలు చేసింది.