Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొన్ని ఉత్తర భారత రాష్ట్రాలు, ఈశాన్యంలో ఇంటి వద్ద డెలివరీలు
- వీటిలో అధికం బీజేపీ పాలిత రాష్ట్రాలే
- జాతీయ సగటు కంటే అధికం :కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సమాచారం
న్యూఢిల్లీ : దేశంలో ప్రసవాలు కొన్ని రాష్ట్రాల్లో సాఫీగా ఉంటే.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మాత్రం ఆందోళనకరంగా మారాయి. దేశవ్యాప్తంగా 2021-22 ఏడాదికి గానూ అనేక రాష్ట్రాల్లో సంస్థాగత ప్రసవాలు (ఆస్పత్రులలో జరిగే డెలివరీలు-ఇన్స్టిట్యూషనల్ డెలీవరీలు) పెరుగుదలను నమోదు చేశాయి. కానీ, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మాత్రం ఈ పరిస్థితులు ఇందుకు విరుద్ధంగా ఉన్నాయి. ఈశాన్యంతో పాటు ఉత్తర భారత రాష్ట్రాలైన యూపీ, ఉత్తరాఖండ్, ఢిల్లీలో ఇప్పటికీ ఇంటి వద్ద ప్రసవాలు జరుగుతున్నాయి. ఈ సంఖ్య జాతీయ సగటు కంటే ఎక్కువగానే ఉండటం గమనార్హం. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సమాచారంలో ఈ విషయం వెల్లడైంది. దీనిపై ఆరోగ్య నిపుణులు సైతం ఆందోళనను వ్యక్తం చేశారు.ఈ సమాచారం ప్రకారం.. తెలంగాణ, తమిళనాడు, గోవాలతో పాటు రెండు కేంద్రపాలిత ప్రాంతాలు పుదుచ్చేరి, లక్షద్వీప్ లు వంద శాతం సంస్థాగత డెలివరీలను నమోదు చేశాయి. కేరళ, ఆంధ్రప్రదేశ్, సిక్కిం, పంజాబ్‌తో సహా తొమ్మిది రాష్ట్రాలలో జననాలు ఆస్పత్రుల్లోనే నమోదయ్యాయి. సంస్థాగత డెలివరీలలో జాతీయ సగటు 95.5 శాతంగా ఉన్నది. ఇక మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, బీహార్, ఉత్తరాఖండ్, మిజోరాం, అసోం, ఉత్తరప్రదేశ్, అరుణాచల్‌ప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్, త్రిపుర, జమ్మూకాశ్మీర్, ఢిల్లీ వంటి 13 రాష్ట్రాలలో ఇంటి వద్ద జరిగే ప్రసవాలు జాతీయ సగటు కంటే ఎక్కువగా నమోదు చేయడం ఆందోళనను కలిగిస్తున్నది. వీటిలో చాలా వరకూ బీజేపీ పాలిత రాష్ట్రాలే కావడం గమనార్హం. ఇంటి వద్ద జరిగే ప్రసవాల జాతీయ సగటు 4.5 శాతంగా ఉన్నది.ఇంటి వద్ద జరిగే ప్రసవాలు అత్యధికంగా మేఘాలయలో 42.8 శాతంగా ఉన్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో నాగాలాండ్ (21.7 శాతం), మణిపూర్ (19.4 శాతం), బీహార్ (13.3 శాతం), ఉత్తరాఖండ్ (11.5 శాతం), మిజోరాం (12.8 శాతం), అసోం (8.7 శాతం), హిమాచల్‌ప్రదేశ్ (7.3 శాతం), త్రిపుర (5.4 శాతం), జమ్మూకాశ్మీర్ (5.1 శాతం), ఢిల్లీ (4.7 శాతం) లు ఉన్నాయి. 2020-21 ఏడాదికి గానూ భారత్‌లో మొత్తం 10,67,470 ప్రసవాలు ఇండ్ల వద్ద జరిగాయి. 2021-22 ఏడాదిలో అది 9,22,637గా ఉన్నది. ప్రసూతి మరణాల నిష్పత్తి (ఎంఎంఆర్)ను తగ్గించడానికి సంస్థాగత ప్రసవాలు కీలకమని నిపుణులు చెప్పారు. అయితే, మారుమూల ప్రాంతాల్లో ఇప్పటికీ ఆస్పత్రి సదుపాయాలు లేకపోవడం కారణంగా ఇంటి వద్ద ప్రసవాలు ఇంకా జరుగుతున్నాయని తెలిపారు.బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వైద్య రంగం పేలవంగా ఉన్నదనడానికి సాక్షాత్తూ కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెలువరించిన సమాచారమే ప్రత్యక్ష నిదర్శనమని సామాజికవేత్తలు, నిపుణులు తెలిపారు. ప్రస్తుత పరిస్థితులపై వారు ఆందోళనను వ్యక్తం చేశారు. సంస్థాగత డెలివరీలను పెంచి ప్రసూతి మరణాలను నియంత్రించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను వారు కోరారు.