Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పరీక్ష కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి
- 13 భాషల్లో ఎగ్జామ్ నిర్వహణ
న్యూఢిల్లీ : జాతీయ స్థాయిలో జరిగే ఇంజినీరింగ్ ఎంట్రన్స్ టెస్ట్ జేఈఈ మెయిన్-2023 సెషన్-1 పరీక్షలు నేటి నుంచి మొదలు కానున్నాయి. ఫిబ్రవరి 1 వరకు నిర్ణీత తేదీలలో సాగనున్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లోని పరీక్ష కేంద్రాల్లో ఎన్టీఏ ఏర్పాట్లను పూర్తి చేసింది. లక్షలాది మంది హాజరుకానున్న ఈ పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులను ఎన్టీఏ విడుదల చేసింది. పరీక్ష తేదీలను బట్టి అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవాల్సిందిగా అధికారులు అభ్యర్థులకు సూచించారు. జేఈఈ మెయిన్ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ జెఈఈమెయిన్.ఎన్టీఏ.ఎన్ఐసీ.ఇన్ ద్వారా అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ పరీక్షలను ఇంగ్లీష్, హిందీ, తెలుగుతో పాటు అస్సామీ, బెంగాలి, గుజరాతీ, కన్నడ, మలయాళం, మారాఠీ, ఒడియా, పంజాబీ, తమిళం, ఉర్దూ.. ఇలా మొత్తం 13 భాషల్లో నిర్వహించనున్నారు. జేఈఈ మెయిన్‌లో మొత్తం రెండు పేపర్లు ఉంటాయి. మొదటి పేపర్ ద్వారా ఎన్ఐటీ లు, సీఎఫ్టీఐలు, ఐఐటీలలో బీఈ, బీటెక్ వంటి అండర్ గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ ప్రోగ్రామ్‌లలో ప్రవేశాలు కల్పించనున్నారు. బీఆర్క్, బీప్లానింగ్ కోర్సులలో ప్రవేశాలను పేపర్-2 ద్వారా కల్పించనున్నారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు సూచనలను పాటించాల్సిందిగా అధికారులు తెలిపారు.