Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తీర్పులతోటే వారిపై అభిప్రాయం
- కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు వ్యాఖ్యలు
న్యూఢిల్లీ : న్యాయమూర్తులు ఎన్నికవరు కాబట్టి వారు ప్రజల సునిశితమైన పరిశీలనను ఎదుర్కొనరని, కానీ ప్రజలు వారిని పరిశీలిస్తూనే వుంటారని, వారిచ్చే తీర్పుల ద్వారా వారిని అంచనా వేస్తారని కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు సోమవారం వ్యాఖ్యానించారు. న్యాయ వ్యవస్థ, ప్రభుత్వం మధ్య మాటల యుద్ధం జరుగుతున్న వేళ ఇక్కడ తీస్ హజారి కోర్టు కాంప్లెక్స్ నిర్వహించిన రిపబ్లిక్ డే కార్యక్రమంలో మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. సామాజిక మాధ్యమాల కారణంగా సాధారణ పౌరులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారని, ఆ క్రమంలో ప్రభుత్వం దాడికి గురవుతోందని, ప్రశ్నించబడుతోందని అన్నారు. ''ప్రజలు మమ్మల్ని మళ్ళీ ఎన్నుకుంటే, మేం తిరిగి అధికారానికి వస్తాం, లేదంటే ప్రతిపక్షంలో కూర్చుంటాం, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని'' అన్నారు. అదే సమయంలో ఒక వ్యక్తి న్యాయమూర్తి అయినట్లైతే, ఆయన ఎన్నికలను ఎదుర్కొనక్కర్లేదని, న్యాయమూర్తులపై బహిరంగ పరిశీలన వుండదని అన్నారు. ''ప్రజలు వారిని ఎన్నుకోనందున, వారిని మార్చలేరు, కానీ ప్రజలు మీరేం చూస్తున్నారో చూస్తూనే వుంటారు, మీరు తీర్పులిచ్చే తీరు, పద్ధతి, మీ తీర్పులు ఇలా అన్నీ పరిశీలిచబడతాయి. ఇవన్నీ చూస్తున్న ప్రజలు మీపై ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకుంటారనిఅని అన్నారు. ఈ సోషల్ మీడియా యుగంలో ఏదీ ఎవరి నుండీ దాచలేమన్నారు. సోషల్మీడియాలో న్యాయమూర్తు లపై జరుగుతున్న దాడుల విషయంలో ఏదో ఒకటి చేయాల్సిందిగా భారత ప్రధాన న్యాయమూర్తి తనని కోరారని రిజిజు చెప్పారు. న్యాయమూర్తులపై ఉపయోగిస్తున్న అవమానకరమైన భాషను ఎలా నియంత్రించాలో ఆయన తెలుసుకోవాలనుకుంటు న్నారు. న్యాయమూర్తులకు పరిమితులు వుంటాయని, అందువల్ల వారు బహిరంగ వేదికలపై వాదించలేరని అన్నారు. ''ఏం చేయాలో నాకు తెలుసు, ధిక్కార నిబంధన వుంది, కానీ పెద్ద సంఖ్యలో ప్రజలు వ్యాఖ్యానిస్తుంటే ఏం చేయగలుగుతాం. రోజూ ప్రభుత్వం విమర్శలను ఎదుర్కొంటూనే వుందని, అలాగే న్యాయమూర్తులు కూడా ఇప్పుడు అదే పరిస్థితి ఎదుర్కొంటున్నారని అన్నారు.